Search
Wednesday 14 November 2018
  • :
  • :

పెళ్లి బారాత్‌లో కత్తుల సావాసం

attempt-to-murder-imageజగిత్యాల పెళ్లి బారాత్‌లో ఘర్షణ
కత్తులో ఇరు వర్గాల దాడి
ఒకరి దుర్మరణం… మరొకరికి తీవ్ర గాయాలు
పోలీసుల అదుపులో నిందితులు

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి బారాత్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఒకరు దుర్మరణం చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలై చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… జిల్లా కేంద్రంలోని మోతె మాలవాడలో 21వ వార్డు కౌన్సిలర్ సమీప బంధువు ఇంట్లో శనివారం వివాహాం జరిగింది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత వధువును అత్తగారింటికి సాగనంపే క్రమంలో రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఆ ఊరేగింపులో వధువు బంధువులంతా కలిసి మధ్యం సేవించి నృత్యాలు చేశారు. అనంతరం ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. అయితే పాత పగలను దృష్టిలో పెట్టుకున్న కౌన్సిలర్ భర్త కిశోర్, అతడి సోదరుడు, అనుచరులు తిట్ల అభిలాష్ అనే వ్యక్తి ఇంటి ముందుకు వెళ్లి బూతులు తిడుతుండగా విన్న అభిలాష్ సోదరుడు మదన్‌మోహన్ ఇంట్లోకి వెళ్లి నీ వల్ల మా పరువు పోతోంది… వాళ్లు ఇష్టమైనట్లు తిడుతున్నారని పేర్కొనడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిలాష్ ఇంట్లో నుంచి కత్తి తీసుకుని బయటకు వచ్చాడు. అప్పటికే ఇంటి ముందు కత్తులతో సిద్దంగా ఉన్న కిశోర్, అతడి అనుచరులు అభిలాష్ పొట్టలో పొడిచారు. అడ్డుకునేందుకు వచ్చిన అభిలాష్ మిత్రుడు బండ కిరణ్‌పై కూడా కత్తులతో దాడి చేశారు. దాంతో వారిద్దరూ తీవ్ర గాయాల పాలై పడిపోవడంతో కిశోర్, అతడి అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. దాంతో అభిలాష్ కుటుంబ సభ్యులు ఆ ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అభిలాష్ మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన కిరణ్‌కు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వైద్య సేవలు అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. జగిత్యాల డిఎస్‌పి భద్రయ్య ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తమ తమ్ముడిని ఎలమాద్రి కిశోర్, అతడి సోదరుడు, అతడి అనుచరులు పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని హతమార్చారని మృతుడి సోదరుడు తిట్ల మదన్‌మోహన్ ఫిర్యాదు మేరకు టౌన్ సిఐ ప్రకాశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 2014లో మృతుడి తల్లి, ఎలమాద్రి కిశోర్ భార్య మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేశారు. అప్పటి నుంచే వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడి ఈ సంఘటనకు దారి తీసిందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు.

Comments

comments