Home నిర్మల్ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

The welfare of all classes is the goal

మన తెలంగాణ/నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాల అభివృద్ధి లక్షంగా పని చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం సారంగాపూర్ మండలంలో చించోలి(బి) గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. రూ. 1.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్‌సి కమ్యూనిటీ సంఘ భవనానికి, రూ. 4.50లక్షల వ్యయంతో నిర్మించి రజక సంఘ భవనానికి, రూ. 3లక్షలతో నిర్మించిన న్యాకపోడ్ సంఘ భవనానికి, రూ. 35లక్షలతో నిర్మించిన జిల్లా సెకండరీ పాఠశాల అదనపు గదులను, రూ. 3లక్షలతో నిర్మించిన విశ్వబ్రాహ్మణ సంఘ భవనానికి, రూ. 10లక్షలతో నిర్మించిన ముత్యాలమ్మ గుడి నిర్మాణములకు, రూ.16లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి, రూ. 8.50లక్షలతో నిర్మించిన ఈద్గా కాంపౌండ్ వాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 4 సంవత్సరాల్లోనే అనేక కోట్ల విలువైన సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే వర్షాలు సంవృద్ధిగా కురిసేందుకు ప్రతీ ఒకరు మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు చెల్లించి నాణ్యమైన విద్యను అందించేందకు కస్తూర్బా రెసిడెన్షియల్ విద్యను అందిస్తుందని తెలిపారు. అలాగే ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ కో ఆర్డినేటర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఎఎంసి చైర్మన్ రాజ్‌మహ్మద్, ఎన్‌ఆర్‌ఈజిఎస్ సభ్యులు హరీష్‌రావు, జిల్లా విద్యాధికారి ప్రణీత, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, ముడుసు సత్యనారాయణ, సురేందర్‌రెడ్డి, ధన, లక్ష్మణ్, ఎం.లక్ష్మీ, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.