Home స్కోర్ క్రికెటర్ మహ్మద్ షమిపై భార్య సంచలన ఆరోపణలు

క్రికెటర్ మహ్మద్ షమిపై భార్య సంచలన ఆరోపణలు

smi

 తన భర్తకు చాలా మందితో అక్రమ సంబంధం
 నన్ను చంపేందుకు కుట్ర
 వైరల్‌గా మారిన హసిన్ ఆరోపణలు

న్యూఢిల్లీ: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమిపై అతని భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త షమికు చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే షమి మాత్రం ఆరోపణలను కొట్టి పారేశాడు. తానంటే గిట్టని వారు కావాలనే సోషల్ మీడియాలో ఇటువంటి ఆరోపణలు చేశారని ఆరోపించాడు. కాగా, తన భర్తపై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని అతని భార్య హసిన్ స్పష్టం చేశాడు. కాగా, తన భర్త వ్యవహార శైలీని ప్రశ్నించిన తనపై అతని కుటుంబ సభ్యులు దాడికి దిగారని, అంతేగాక తనను చంపేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ సందర్భంగా హసిన్ జహాన్ మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లుగా తన భర్త షమితో పాటు అతని కుటుంబ సభ్యులు తనపై ఎన్నో అరాచకాలు చేస్తున్నారని ఆరోపించింది. తరచు తనను కొట్టడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. అంతేగాక తనను చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని సంచలన అరోపణ చేసింది. తన భర్తకు పాకిస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి కూడా ఆరోపించింది. దీనికి సంబంధించి సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని వివరించింది. అంతేగాక దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిసిన వెంటనే షమి తన భార్యతో కలిసేందుకు పాకిస్థాన్‌కు కూడా వెళ్లాడని తెలిపింది. కొంతకాలంగా షమితో పాటు అతని తల్లి, సోదరుడు తనపై దౌర్జన్యానికి దిగారని ఆరోపించింది. షమికి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని విషయం అతని ఫోన్ ద్వారా తాను తెలుసుకున్నానని హసిన్ వివరించింది. ఒక రోజు షమి కారులో దొరికిన ఫోన్‌తో అతని గుట్టు రట్టయ్యిందని తెలిపింది. ఆ రోజు అతనికి ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్న విషయం తనకు తెలిసిందని పేర్కొంది. దీనిపై షమిని నిలదిస్తే వేధింపులకు దిగాడని ఆరోపించింది. ఈ విషయంలో షమికి అతని కుటుంబ సభ్యులు అండగా నిలిచారని తెలిపింది. కాగా, షమి కుటుంబంతో తనకు ప్రాణ హాని ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కాగా, షమి వ్యవహార శైలీ గురించి ఎన్ని సార్లు బిసిసిఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది. బిసిసిఐ తగిన విధంగా స్పందించి ఉంటే షమి దారిలోకి వచ్చేవాడని తెలిపింది. కాగా, త్వరలో షమితో పాటు అతని కుటుంబ సభ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హసిన్ స్పష్టం చేసింది. ఇదిలావుండగా మ్యాచ్‌లు ఆడేందుకు ఎక్కడికి వెళ్లినా కుల్దీప్ అనే వ్యక్తి షమికి అమ్మాయిలను సప్లై చేస్తాడని తీవ్రంగా ఆరోపించింది. ఈ విషయం బిసిసిఐ అధికారులకు తెలిసినా పట్టించు కోలేదని ఆవేదన్య వ్యక్తం చేసింది. కాగా, షమిహసిన్ జహాన్‌లది ప్రేమ వివాహం. 2012లో ఓ ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా షమి తొలిసారి హసిన్ జహాన్‌ను చూశాడు. అప్పటి నుంచి ఇద్దరు డేటింగ్‌లో నిమగ్నమయ్యారు. తర్వాత 2014 జూన్ 6న పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది.

ఆరోపణల్లో నిజం లేదు..

shm
తనపై వచ్చిన ఆరోపణలను మహ్మద్ షమి ఖండించాడు. కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించాడు. ఈ మేరకు షమి ట్విటర్ ద్వారా స్పందించాడు. నా వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే కొందరు పని గట్టుకొని ఇలాంటి వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పేర్కొన్నాడు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నాడు. ఇది నాపై జరుగుతున్న కుట్రగా షమి అభివర్ణించాడు. తనంటే పడని వారు ఇలాంటి ఆరోపణలకు దిగారని తెలిపాడు. ఇదిలావుండగా షమిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతనికి కేటాయించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని భారత క్రికెట్ బోర్డు నిలిపి వేసింది. షమికి గ్రేడ్‌బిలో స్థానం లభించింది. దీనిలో భాగంగా అతనికి ఏడాదికి మూడు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందిస్తారు. కాగా, షమి భార్య ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణకు బిసిసిఐ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నివేదిక వచ్చిన తర్వాతే సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని బిసిసిఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.