Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

అందనంత ఎత్తులో పోస్టాఫీస్

Hills

హిమాచల్‌ప్రదేశ్‌లోని హిమాలయ పర్వతాల నడుమ మారుమూల స్పితి లోయలో అత్యంత ఎత్తులో ఉంది హిక్కిం పోస్టాఫీసు. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పోస్టాఫీసు నుంచి ప్రపంచ నలుమూలలకూ ఉత్తరాలు వెళ్తుంటాయి. ఉత్తరాలు పంపేందుకు, సేవింగ్స్ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అత్యంత ఎత్తులోని ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు పంపడాన్ని గొప్ప అనుభూతిగా భావిస్తారు. అందుకే దేశ విదేశీ సందర్శకులు ఇక్కడి నుంచి తమ సొంతూళ్లకు, సన్నిహితులకు ఉత్తరాలు పంపుతుంటారు. 1983లో భారత తపాలా శాఖ ఈ పోస్టాఫీసును ప్రారంభించింది. ఇక్కడి నుంచి ఉత్తరాలను బట్వాడా చేయాలంటే చాలా వరకు కాలినడకనే వెళ్లాలి. చలికాలంలో ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది.

దాంతో అప్పుడు చాలాసార్లు పోస్టాఫీసును మూసేయాల్సి వస్తుందని 1983 నుంచి ఇక్కడ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్న రించెన్ చెరింగ్ చెబుతున్నారు. స్పితి లోయకు ప్రధాన కేంద్రంగా ఉన్న కాజా పట్టణానికి ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు తీసుకెళ్తారు. అందుకు రోజూ ఇద్దరు పోస్ట్‌మెన్‌లు కొండాకోనలను దాటుకుంటూ రానుపోను కలిపి దాదాపు 46 కి.మీ నడుస్తారు. కాజా నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ఇతర ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గాల ద్వారా బస్సుల్లో ఉత్తరాలను పంపిస్తారు.

Comments

comments