Home ఎడిటోరియల్ పసిపిల్లలపై పశుత్వం

పసిపిల్లలపై పశుత్వం

The worst in two recent shelter homes in Bihar states

ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాల్లో ఇటీవల రెండు షెల్టర్ హోంల్లో జరిగిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పసిపిల్లలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాల కార్యకలాపాలు తెలిసి యావత్తు జాతి నివ్వెరపోయింది. జులై 2017లో బీహారు ప్రభుత్వం రాష్ట్రంలోని 110 ప్రభుత్వ లేదా ఎయిడెడ్ సంస్థల సోషల్ ఆడిట్ జరపాలని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ను కోరింది. ఇందులో అనాథ బాలల శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటివి ఉన్నాయి. ముహమ్మద్ తారిక్ నాయకత్వంలో ఏడుగురు సభ్యుల ఒక టీము ముజఫర్ పూర్ షెల్టర్ హోంకు ఈ పనిమీదనే వెళ్ళింది. ఆ బృందమే ఈ అమానుషాన్ని బట్టబయలు చేసింది.

ఉత్తరప్రదేశ్ దేవరియాలో పది సంవత్సరాల బాలిక కన్నీరు మున్నీరవుతూ జరిగిన దారుణాలను చెబుతుంటే పోలీసులు నోటి మాట రాక మాన్పడిపోయారు. ప్రతి రోజు కార్లు వచ్చేవట. బాలికలను కార్ల్లలో పంపేవారట. మర్నాడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన స్థితిలో అమ్మాయిలు తిరిగి వచ్చేవారట. ఎంత దారుణం? దేవరియా నుంచి 24 మంది బాలికలను కాపాడారు. ఇలాంటి గుండెలు పిండేసే కథలు ఎన్నో. ఎన్ని షెల్టర్ హోంలు సేవ ముసుగులో ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాయో. ఎన్ని పసిమొగ్గలు చెక్కిళ్ళపై రక్తాశ్రువులు రాలుతున్నాయో. ఎన్ని పూలు వికసించకముందే వాడి మాడిపోతున్నాయో?

నేషనల్ క్రయిం రికార్డు బ్యూరో ప్రకారం ప్రతి రోజు భారతదేశంలో 55 మంది పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కోర్టుల్లో లక్షకు పైబడి ఇలాంటి కేసులున్నాయి. ఇప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్‌లలో అత్యాచార బాధితులైన పిల్లలకు కోర్టుల్లో న్యాయం లభించాలంటే ఈ పేరుకుపోయిన కేసుల ప్రకారం, 2029 వరకు ఆగాలి. మహారాష్ట్రలో ఈ కేసులు మరీ ఎక్కువ. అక్కడైతే 2032 వరకు ఈ కేసులు తెమిలే పరిస్థితి లేదు. గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం న్యాయవ్యవస్థ పనిచేస్తున్న వేగం ఎలా ఉందంటే, 2071 వరకు న్యాయం కోసం ఆగవలసి ఉంటుంది. నోబుల్ బహుమతి గ్రహిత కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ ఈ మాటలు చెప్పింది. 2013 నుంచి 2016 మధ్యకాలం మూడేళ్ళలో పిల్లలపై నేరాలు 84 శాతం పెరిగాయని చెప్పింది.

భారతదేశంలో అమ్మాయిలకు భద్రత ఉందా? ప్రతి 15 నిముషాలకు ఒక బాలికపై లైంగిక దాడి జరుగుతోంది. ఇవి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే. క్రయిం రికార్డ్ బ్యూరో ప్రకారం 2016లో 1,06,958 మంది పిల్లలపై నేరాలు జరిగాయి. ఇందులో 36,022 కేసులు పోస్కో చట్టం అంటే లైంగిక నేరాల నుంచి పిల్లలకు భద్రత కల్పించే చట్టం క్రింద నమోదయ్యాయి. అంటే ఈ పిల్లలంతా లైంగికంగా దాడులకు గురైన పిల్లలు. కాని చాలా మంది ఈ విషయాల గురించి మాట్లాడ్డానికి ఇష్టపడరు. 2014లో పిల్లలపై 89,423 నేరాలు జరిగితే. రెండు సంవత్సరాల కాలంలో ఈ సంఖ్య లక్షా ఆరువేలకు చేరుకుంది. 2007లో మహిళా శిశు మంత్రిత్వ శాఖ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 53 శాతం మంది పిల్లలు ఏదో ఒక రూపంలో లైంగిక దాడికి గురైనట్లు చెప్పారు. కేవలం బాలికలకు మాత్రమే కాదు, మగపిల్లలకు కూడా ఈ నరకం తప్పడం లేదు.

ప్రతి ఐదు నిముషాలకు ఒక బాలికపై, ప్రతి పది నిముషాలకు ఒక బాలుడిపై లైంగిక దాడి జరుగుతుందని మరో నివేదికలో తెలుస్తోంది. ప్రపంచంలోని పిల్లల్లో 19 శాతం పిల్లలు మన దేశంలోనే ఉన్నారు. యునిసెఫ్ 2005 నుంచి 2013 మధ్యకాలంలో భారతదేశంలో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం దేశంలోని బాలికల్లో 10 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికల్లో 10 శాతం మంది లైంగిక దాడిని ఎదుర్కుంటున్నారు. 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు బాలికల్లో 30 శాతం మంది లైంగిక హింసకు గురవుతున్నారు. ఎలా చూసిన 42 శాతం మంది బాలికలు టీనేజి కన్నా ముందే లైంగిక వేధింపులు దాడులు భరించక తప్పడం లేదు.

కేంద్రమంత్రి మేనగా గాంధీ ఇంటర్నెట్ లో చైల్డ్ అబ్యూజ్ మెటీరియల్ లేకుండా ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నారు. ఇంటర్నెట్ సురక్షితంగా ఉండేలా చూడాలనుకుంటున్నారు. కాని మరోవైపు మన వీధుల్లో, మన ఊళ్ళలో భద్రత కరువైంది. భారతదేశంలో ప్రభుత్వం నడుపుతున్న 9000 షెల్టర్ హోంలు ఉన్నాయి. ఈ హోంల నిర్వహణకు సగం ఖర్చు కేంద్రం, సగం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ప్రభుత్వం ఎంచుకున్న స్వచ్ఛంద సంస్థలు ఈ షెల్టర్ హోంలను నడుపుతుంటాయి. వాస్తవమేమంటే, ఇలాంటి హోంలను నడిపే ఎన్‌జిఒలకు రాజకీయ పార్టీల అండదండలుంటాయి. చాలా నియమనిబంధనలు కాగితాలకే పరిమితం. ఇది చాలా మందికి తెలిసినా పట్టించుకోవడం జరగదు.ఇలాంటి శరణాలయాల్లో నిరుపేద పిల్లలే వస్తుంటారు. తమపై జరిగే దారుణాల గురించి చెప్పుకునే ధైర్యం వారికి ఉండదు. చాలా మంది పిల్లలు అనాథలే ఉంటారు. పిల్లలకు ఓటుహక్కు ఉండదు. కాబట్టి ఎవరూ పట్టించుకోరు.

ఎప్పుడైనా ఏదైనా సంఘటన బయటపడితే తప్ప ఎవరూ ఈ విషయం ఆలోచించడం కూడా జరగదు. ఎందుకంటే బలమైన రాజకీయ అండ ఉన్నవాళ్ళే ఈ పనులు చేస్తుంటారు. టాటా సంస్థ చేసిన ఆడిట్‌లో 20 సంస్థలపై అనుమానాలు వ్యక్తం చేసింది. స్వయంగా కేంద్ర మంత్రి మేనకా గాంధీ మాట్లాడుతూ ఎలాంటి విచారణ లేకుండా ఎన్‌జిఒలకు ఇలాంటి శరణాలయాలు నడిపే అనుమతి ఇచ్చేస్తున్నారు. అనేక షెల్టర్ హోంలు కాకుండా ఒకే పెద్ద షెల్టర్ హోం ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని ఆమె ప్రతిపాదించారు. పాలనా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అస్సలు ఈ సమస్యను సమస్యగా గుర్తిస్తున్నాయా అన్నది కూడా అనుమానమే. ఎందుకంటే, ఉత్తరప్రదేశ్ దేవరియా షెల్టర్ హోంపై అనుమానాలు కమ్ముకున్న తర్వాత కూడా, బ్లాక్ లిస్టులో పెట్టిన తర్వాత పోలీసులు అక్కడికి పిల్లలను పంపించడం ఆపలేదు. ఇలాం టి కేసులు బయటపడినప్పుడు కొంతకాలం మీడియాలో హడావిడి జరుగుతోంది. తర్వాత మరిచిపోతున్నారు.

ఉత్తరాఖండ్ హైకోర్టు మైనర్లను రేప్ చేస్తే మరణశిక్ష విధించాలని సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది. 2016లో ఎనిమిదేళ్ళ చిన్నారిని రేప్ చేసి, హత్య చేసిన కేసులో దిగువ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. హైకోర్టు ఆ శిక్షను ఖరారు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు లోక్‌సభలో 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు మైనర్ బాలికలను రేప్ చేస్తే మరణశిక్ష విధించేలా బిల్లు తెచ్చారు. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఈ సంవత్సరం ఒక న్యాయస్థానం మైనర్ బాలికను రేప్ చేసిన 40 సంవత్సరాల కామాంధుడికి మరణశిక్ష విధించింది. మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తే నేరాలు ఆగిపోతాయా? మనకు ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేసినా, తనిఖీలు, నిఘా చిత్తశుద్ధితో నిర్వహించినా చాలు ఇలాంటి నేరాలను ఆపడం కష్టం కాదు. అసలు కావలసింది సంకల్పం. పేదపిల్లలు ఓట్లకు కూడా పనికిరారు కాబట్టి వారికి హక్కులేమీ ఉండవన్నట్లు వ్యవహరించడం వల్లనే ఈ సమస్య తలెత్తుతుంది.

                                                                                                                                                    జయంత్