Home ఎడిటోరియల్ ఘోర విషాదం

ఘోర విషాదం

sampadakeyam

నీటి ఒడ్డున నాగరికతలు వర్థిల్లుతాయి. ప్రమాదాలు పడగవిప్పి కాటేస్తాయి. సముద్రాలు, నదులే కాదు; నిండిన చెరువులూ ఈ మధ్య ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఒక్కో విపత్తుకు ఒక్కో రకమైన కారణాలు. ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ సమీపంలో కృష్ణానదిలో 20మందికి పైగా విహారయాత్రీకులను కబళించిన బోటు ప్రమాదం మాత్రం పూర్తిగా మానవ తప్పిదాల వల్లనే జరిగిందని రూడి అవుతున్నది. ఈ ప్రమాద వార్త విని దిగ్భ్రాంతికి గురికాని వారు లేరు. ఇదేదో భారీ వర్షాలు, వరదల వల్ల నది ఉప్పొంగి మనిషికి అలవికాని పరిస్థితి తల ఎత్తి సంభవించింది కాదు. తగిన హెచ్చరిక లేకుండా ఆనకట్ట గేట్లు ఎత్తివేయగా పైనుంచి లంఘించి వచ్చిన భారీ జలరాశి ముంచేసినందువల్ల జరిగింది కాదు. కొద్ది క్షణాల్లో ముగిసిపోయి జీవితాంతం మరచిపోలేని సుమధుర జ్ఞాపకాలను మిగిల్చి ఉండవలసిన విహార యాత్రలో సంభవించిన ప్రమాదం ఇది. విహారమంటేనే భయం లేకుండా నిష్పూచీగా దాదాపు మైమరచిపోయి గడపవలసిన ఘట్టం. అటువంటిది ప్రాణాలనే బలితీసుకోవడం అత్యంత ఆందోళనకరం.
కృష్ణాతీరంలోని వెన్నెల టూరిస్ట్ కేంద్రంనుంచి బయలుదేరి నది మధ్యలోని భవానీ ద్వీపం చూసుకుని సమీపంలోని గోదావరి సంగమ స్థలంలో చేపట్టే హారతి కార్యక్రమాన్ని తనివితీరా తిలకించడానికి వెళుతున్న సందర్భంలో ఈ బోటు ప్రమాదం చోటు చేసుకున్నది. గట్టిగా చెప్పాలంటే అరగంటలోపు సమయంలో జరిగిపోయే నదీ ప్రయాణమిది. తరచుగా లేదా ప్రతి ఆదివారం ఇక్కడ ఇలా బోటు విహారం జరుగుతూ ఉండాలి. ఇప్పటి కనేకమంది ఈ యాత్రను ఆనందించి ఉంటారు. కానీ మొన్న ఆదివారం నాటి బోటు ప్రయాణం మాత్రం అందుకు భిన్నంగా చెప్పనలవికాని విషాదాన్ని మిగిల్చింది. బోటు కెపాసిటీని, ఎక్కించుకున్న యాత్రికుల సంఖ్యను ముందుగానే సరిపోల్చి మితిమీరకుండా చూసి పచ్చజెండా ఊపడం లేక ఆపివేయడం చేసే అధికారి బిగ్గరగా వద్దని హెచ్చరించినా వినకుండా నిర్వాహకులు ఓవర్‌లోడ్ చేసి తీసుకెళ్లారన్న సమాచారం విస్తుగొలుపుతున్నది. ఆ అధికారి అడ్డుకుంటున్న దృశ్యం ఇప్పటికే సోషల్ మీడియాకెక్కింది. అతడు తన శక్తియుక్తులా బోటును అడ్డుకోవడానికి ప్రయత్నించిన సన్నివేశం ఆయన బిగ్గరగా చేసిన హెచ్చరికలు సహా లోకవిదితమైంది. అధికారి మాటను తోసిపుచ్చి ఓవర్‌లోడ్ బోటును ఎలా నదిలోపలికి తీసుకెళ్లగలిగా రన్నది ప్రశ్న. ఈ ప్రైవేటు బోటుకు లైసెన్స్ లేదంటున్నారు. దాని యాజమాన్యంలో ప్రభుత్వంలోని పై అధికారులకు భాగస్వామ్యం ఉన్నదనే ఆరోపణ కూడా వార్తలకెక్కింది. కింది అధికారి అడ్డుకున్నా పై వారి అనుమతి లభించడంతోనే బోటు సరంగు ముందుకు తీసుకువెళ్లే సాహసం చేసి ఉంటాడని అనుకోవలసి ఉంది. ప్రమాద సమయంలో తరణోపాయానికి ఉపయోగించే లైఫ్‌జాకెట్లు వంటి సామాగ్రి బోటులో లేకపోవడం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్న లోపం. ఎందుకు లేవని అడిగితే ఈ కాస్త ప్రయాణానికి అక్కరలేదని నిర్వాహకులనుంచి సమాధానమొచ్చిందట. 30 మంది ప్రయాణీకులను మాత్రమే ఎక్కించుకోగల సామర్థం బోటుదయితే 40మంది వరకు అనుమతించడంలోని ధనాశ సుస్పష్టమే. బోటును నడిపిన వ్యక్తి శిక్షణ పొందినవాడు కాదని అంటున్నారు. అతడి వద్ద మార్గపటం కూడా లేదని తెలుస్తున్నది. గమ్యం చేరుకునే ముందు మలుపు తిప్పుతున్న సమయంలో ప్రయాణీకులంతా ఒకవైపు ఒరిగిపోవడంతో అదుపు తప్పినందువల్ల ప్రమాదం జరిగినదని బోధపడుతున్నది. మొత్తం ఘటనను తరచి చూస్తే ధనాపేక్ష తప్ప మరో ఆశయం, ఆలోచన ఉండని ప్రైవేటు బోటు నిర్వాహకులతోపాటు ఇటువంటి సందర్భాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు గైకొనలేకపోయిన ప్రభుత్వాన్ని కూడా చెప్పనలవి తప్పని బోధపడుతున్నది. విహారానికి వెళ్లే వారు ఆ ఉత్సాహంలో సంబంధించిన సాంకేతిక అంశాలను గురించి తెలుసుకుని తగు వివేకవంతమైన నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ఇకముందు మరింత ప్రమాదకరమేనని చెప్పుకోక తప్పదు. నీటి మీద ప్రయాణంలో ఏ కొద్ది లోపం జరిగినా ప్రాణాపాయం తప్పదు. ఇది కృష్ణా, గోదావరి వంటి నదులలో చాలాసార్లు రుజువయింది. తొట్టెలవంటి నాటు బోట్లు, పడవలలో అత్యవసరంగా నీటిని దాటేటప్పుడు ప్రమాదాలు జరిగాయంటే వేరు సంగతి. రెండు నదులు కలుస్తున్న చోట ప్రవాహ ఉధృతి అత్యధికంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో మరపడవులను కూడా ఎంతో నియమ బద్ధంగా నడపాలి.నడిపేటట్లు చూడాలి. ప్రభుత్వాలు జలప్రయాణాల పట్ల మరింత అప్రమత్తతతో వ్యవహరించాలి. లోపరహితమైన ఏర్పాట్లు జరిగేటట్లు తమ అధికారాలను ప్రయోగించాలి.