హైదరాబాద్‌లోని నిజాం మ్యూజియం నుంచి బంగారం వజ్రాలతో తయారుచేసిన టిఫిన్‌బాక్స్, కప్పు, సాసర్ తదితర విలువైన వస్తువుల దొంగతనం సిసి కెమెరాల ధ్వంసం
మన తెలంగాణ/ హైదరాబాద్: పాతబస్తీ దారుల్షిఫా పురానీహవేలీ ప్రాంతంలో ని నిజాం మ్యూజియంలో దొంగలు పడ్డారు. అరుదైన వస్తువులతో కూడిన మ్యూజియంలోకి ఆదివారం రాత్రి సినీఫక్కీలో దొంగలు ప్రవేశించి బంగారం వజ్రాలతో తయారుచేసిన టిఫిన్‌బాక్స్, టీకప్పు, సాసర్ల వంటి వస్తువులను అపహరించారు. సిసి కెమెరాలతోపాటు వాచ్మెన్ల పర్యవేక్షణలో ఉన్న ఈ మ్యూజియంలోకి దొంగలు ప్రవేశించి విలువైన సంపదను దోచుకెళ్లడంతో పాతబస్తీలో ఒక్కసారిగా కలకలం రేపింది. మీర్‌చౌక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పురానీహావేలిలోని దుర్రెషవార్ ఆసుపత్రి సమీపంలో గల నిజాం మ్యూజియం లో ఏడో నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అభిరుచులకు కేంద్రంగా నడుస్తోంది. ఈ మ్యూజియంలో విలువైన వస్తువులు భద్రపరుస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మ్యూజియాన్ని యథావిథిగా మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 9 గంటలకు తెరిచారు.
మ్యూజియం వెనకభాగంలోని కిటికీ తీసి ఉండి లోనికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించినట్లు అనుమానం రాగానే సిబ్బంది మ్యూజియంలోని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించగా గాజు గ్యాలరీలో భద్రపరిచిన బంగారుతో తయారు చేసి వజ్రాలు, కెంపులతో తయారు చేసిన అత్యంత విలువైన టిఫిన్ బాక్స్‌తోపాటు బంగారంతో తయారు చేసిన టీకప్పు, సాసర్, స్పూన్లు కనిపించలేదు. వెంటనే మ్యూజియం అడ్మినిస్ట్రేటర్ షౌకత్ అలీ మ్యూజియం ట్రస్టు సభ్యులకు సమాచారం అందించారు. ట్రస్టు కార్యదర్శి రఫత్‌హుస్సేన్ మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థ్ధలానికి చేరుకుని పరిశీలించగా వెనక గోడకు ఉన్న కిటికీ గుండా దొంగలు దూరిన ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాకుండా సీసీ కెమెరాలను సైతం దొంగలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలో సైతం సరిగ్గా దొంగల చిత్రాలు కనిపించలేదు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. మీర్‌చౌక్ ఎసీపీ ఆనంద్ మాట్లాడుతూ ఇది ఇంటి దొంగల పనై ఉంటుందని త్వరలో దొంగలను పట్టుకుంటామని వారికోసం ప్రత్యేక బృందాలను నిమించినట్లు ఆయన వెల్లడించారు.