Home జాతీయ వార్తలు కండోమ్‌ల లెక్క చెప్పినోళ్లు నజీబ్ ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారా?: కన్హయ్య

కండోమ్‌ల లెక్క చెప్పినోళ్లు నజీబ్ ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారా?: కన్హయ్య

Kanaiya1

న్యూఢిల్లీ: జెఎన్‌యు విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శల దాడి చేశారు. విశ్వవిద్యాలయంలో ఎన్ని కండోమ్‌లు వాడుతున్నారో లెక్కలు చెప్పిన ప్రభుత్వం అక్టోబర్ 15నుంచి కనిపించకుండా పోయిన నజీబ్ ఆచూకీని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు అని ప్రశ్నించారు. మంగళవారం నాడిక్కడ తాను రాసిన ‘బిహార్ టూ తీహార్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జెఎన్‌యు క్యాంపస్‌లో ఎన్ని కండోమ్‌లు వాడుతున్నారు అనే విషయాన్ని కనుగొనేందుకు వారు ఉపయోగించిన తెలివి.. కనిపించకుండా పోయిన నజీబ్‌ను వెతికేందుకు ఉపయోగించట్లేదని ఆరోపించారు. జెఎన్‌యులో ప్రతి రోజు 3వేల బీర్ బాటిళ్లు, 2వేల మద్యం సీసాలు, 10వేల సిగరెట్ ప్యాకెట్లు, 4వేల బీడీలు, 3వేల వాడిపడేసిన కండోమ్‌లు, అబార్షన్ అయ్యేందుకు ఉపయోగించే 500 ఇంజక్షన్లు దొరుకుతాయని బిజెపి ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహూజా గతంలో అన్న మాటలను ప్రస్తావిస్తూ కన్నయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎబివిపి విద్యార్థులతో ఘర్షణే నజీబ్ అదృశ్యానికి కారణమని కొందరు వాదిస్తున్నారు.  అయితే ఈ ఆరోపణలను ఎబివిపి తోసిపుచ్చుతూ వస్తోంది. నజీబ్ అదృశ్యంతో తమకేమాత్రం సబంధం లేదని వాదిస్తోంది. తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు.