Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

జిఎస్‌టి వసూళ్లపై నజర్

There are many kinds of efforts to enhance the GST

విద్య, వైద్య రంగాల సేవలపై నిఘా
సేవలు, ముడిసరుకు సరఫరాపై ఆరా

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యా, వైద్య రంగాలలో వివిధ రకాల సేవల నుంచి రావాల్సిన వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) వ సూలుపై వాణిజ్య పన్నల శాఖ నిఘాపెట్టింది. జిఎస్‌టిని మరింత పెంచుకునేందుకు ఆ శాఖ అనేక రకాల ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఒక వైపు పన్ను వసూలు, మరో వైపు శాఖ పరంగా అంతర్గత అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించింది. ఇందులో భాగంగానే విద్యా, వైద్యం,రవాణ రంగాలపై దృష్టి పెట్టారు.జిఎస్‌టి నుంచి విద్యా,వైద్య రంగాలను మినహాయించినప్పటికీ ఆయా రంగాలకు వివిధ సేవలను అందిస్తున్న పలు ఏజెన్సీలు, కొనుగోలు, విక్రయదార్లు చెల్లిస్తున్న జిఎస్‌టి సక్రమంగా వసూ లు కావడం లేదని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది.

హౌజ్ కిపింగ్ నుంచి మొదలు సెక్యూ రిటీ గార్డ్‌తో పాటు వివిధ రకాల ముడి సరుకుల సరఫరా తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలని వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోంది. తద్వారా విద్యా, వైద్యరంగాలకు చెందిన జిఎస్‌టి ఎంత మేరకు వసూలు అవుతుందో ఒక అంచనాకు రావొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. శాఖపరంగా తీసుకున్న చర్యలతో జూలై నెలలో రూ. 4006 కోట్లు వసూలు కావడం పట్ల ఆశాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న లోపాలను సవరిస్తే జిఎస్‌టి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేస్తోంది. కాగా గతంలో వ్యాట్, కమర్షియల్ పన్నులు చెల్లించే వారిలో సుమారు ఏడు వందల వరకు జిఎస్‌టి చెల్లించడం లేదని గుర్తించిన వాణిజ్య పన్నుల శాఖ వారి జాబితాను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించి పన్నులు వసూలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని మాదాపూర్ సర్కిల్ పరిధిలో సుమారు 11 వేల పన్నుదారులు ఉంటే, మరి కొన్ని సర్కిళ్లలో కేవలం 300 మంది మాత్రమే పన్నుదారులు ఉన్నారని, తద్వారా ఒక్కో సర్కిల్‌లో పన్నులు బాగా వసూలవుతే, మరో సర్కిల్‌లో బాకాయిలు పేరుకుపోతున్నాయని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఆ సమస్యలను పరిష్కరించేందుకు సర్కిళ్ల ను వికేంద్రీకరించింది. ప్రతి సర్కిల్‌లో రెండు వేలు పన్నదార్లు ఉండేలా ఆ శాఖ చర్యలు తీసుకున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల పన్నుదార్లు ఉండగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే జిఎస్‌టిపై వివిధ వ్యాపార వర్గాలకు, తదితరులకు అవగాహన కల్పించామని, తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్న వాణిజ్య శాఖ, ఇక నుంచి లోపాలను గుర్తించి వాటిని గాడిలో పెట్టేపనిలో నిమగ్నమైంది.

Comments

comments