Home ఎడిటోరియల్ మహోన్నతనేత వాజ్‌పేయీ

మహోన్నతనేత వాజ్‌పేయీ

There are many things about Vajpayee

మాజీ ప్రధాని వాజ్‌పేయీ గురించి చాలా మంది చాలా విషయాలు చెబుతారు. ఆయన గురించి మరింతగా మాట్లాడుకోవలసిన రోజిది. వాజ్‌పేయీ కవి. పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాల క్లిప్పులను ఇప్పుడు అనేక చానళ్ళు చూపిస్తున్నాయి. ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఏ హోదాలో అయినా సరే ఆయన లేచి మాట్లాడుతుంటే పార్లమెంటులో ఆయన్ను ఎవరూ అడ్డుకునేవారు కాదు. ఎవరూ అంతరాయం కల్పించేవారు కాదు. చాలా శ్రద్ధగా ఆయన చెప్పేది వినేవారు. రాజకీయాలను, కవిత్వాన్ని కలుపుతూ ఆయన వాగ్ధార అద్భుతంగా సాగేది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉన్నప్పుడు వాజ్‌పేయీ యువ నాయకుడు. నెహ్రూ ఆయన్ను చాలా గౌరవించేవారు. ప్రజాస్వామ్యంలో అసమ్మతి, అభిప్రాయభేదాలను వాజ్‌పేయీ గౌరవించేవారు. అసమ్మతితోను చర్చించేవారు, తన పార్టీ లోను, పార్టీ బయట ఉన్న భేదాభిప్రాయాలను గౌరవిస్తూ వారితో చర్చల్లో పాల్గొనేవారు. అభిప్రాయభేదాలను చర్చలతో సంప్రదింపులతో పరిష్కరించుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటిది. ఇప్పుడీ పాఠం మరింత అవసరముంది.

వాజ్‌పేయీ గురించి మరో ముఖ్యవిషయం, ఆయన్ను అందరూ అభిమానించేవారు. 1957 నుంచి 2009 వరకు ఆయన పార్లమెంటులో సభ్యుడిగా ఉన్నారు. అంటే అయిదు దశాబ్దాల పాటు. లోక్ సభకు పదిసార్లు వరుసగా ఎన్నికయ్యారు. చట్టసభలో చట్టాలను చేయడం చాలా బాధ్యతతో కూడుకున్న పని, ఆ పని కోసం కొత్తగా సభలోకి వచ్చే సభ్యులకు శిక్షణ అవసరమని ప్రతిపాదించారు. పరిపాలనకు సంబంధించి జాతీయ ఎజెండాను ప్రతిపాదిస్తూ పార్లమెంటేరియన్ల పాత్రపై అధికశ్రద్ధ చూపించారు. ప్రభుత్వంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా ఒక పార్లమెంటు సభ్యుడి లక్ష్యం ఏమిటన్నది స్పష్టంగా తెలిసిన రాజకీయ నాయకుడు వాజ్‌పేయీ. వాజ్‌పేయీ విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు. 1996లో కేవలం 13 రోజుల్లో ఆయన ప్రభుత్వం పడిపోయింది. లోక్ సభలో బలం నిరూపించుకోలేకపోయారు.

ఆ తర్వాత 1998లో ఆయన ప్రధానిగా ఏర్పడిన ప్రభుత్వం కేవలం 13 నెలల కాలంలోనే పడిపోయింది. కేవలం ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఎలాంటి సందర్భంలో కూడా ఆయన తన విలువల విషయంలో రాజీపడలేదు. ఆయన చాలా ఆశావాదంతో వ్యవహరించేవారు. మనం చేసే రాజకీయాలు సరయిన మార్గంలో ఉంటే ప్రజలు తప్పక గుర్తిస్తారని నమ్మేవారు. ఆయన రాసిన పంక్తులు “అంధేరా ఫిర్ హటేగా, ఏక్ నయా సవేరా ఆయేగా” (చీకటి మళ్ళీ తొలగిపోతుంది. కొత్త ఉదయం ఒకటి వస్తుంది), లేదా ఆయన రాసిన కవిత “గీత్ నయా గాతా హూం” (కొత్త పాట పాడుతున్నాను) పరిశీలిస్తే ఆయన ఆశావాదం తెలుస్తుంది. పరాజయాలను స్వీకరించి, విజయాల దిశగా అడుగువేసే పట్టుదల కనిపిస్తుంది. 1999లో ప్రజలు ఆయ న్ను పూర్తి మెజారిటీతో గెలుచుకున్నా రు. పూర్తి కాలం ప్రధానిగా పనిచేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర నాయకుడు ఆయన మాత్రమే.

వాజ్‌పేయీ నూటికి నూరుపాళ్ళు జాతీయవాది. అయితే ఆయన అవలంభించింది, ప్రోత్సహించింది పాజిటివ్ నేషనలిజం. ఐక్యరాజ్యసమితిలో హిందీ మాట్లాడిన మొట్టమొదటి నాయకుడూ ఆయనే. జనరల్ అసెంబ్లీలో మాట్లాడారు. భారత సంస్కృతి విలువలకు అత్యుత్తమ ఉదాహరణగా అక్కడ తన వాణి వినిపించారు.

భారతదేశానికి సంబంధించిన గంగాజమునా తెహజీబ్ (సర్వమత సామరస్య సంస్కృతి)కి సంపూర్ణ ప్రతినిధిగా కనిపించే ఏకైక హిందూత్వ నాయకుడు ఆయన మాత్రమే. లక్నోలో హిందువులు, ముస్లిములు అందరూ ఆయన్ను అభిమానించేవారు. లక్నో నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో ఆయన గెలుపొందారు. చాలా మంది ముస్లిములు కూడా ఆయనకు ఓటు వేశారు. గుజరాత్ ఘోరకలి జరిగినప్పుడు ఆయన రాజధర్మం గురించి మాట్లాడుతూ తీవ్రంగా విమర్శించారు. ఒక హిందువుగా ఆయన ఫిలాసఫీ ఆయన రాసిన కవిత ”హిందూ తన్ మన్, హిందూ జీవన్‌“లో స్పష్టంగా ప్రకటించారు.
భారతదేశంలో ఇన్ ఫ్రాస్టక్చర్ విప్లవం తీసుకొచ్చిన నాయకుడు వాజపేయి. ఆయన అందరినీ కలుపుకుని ప్రగతి పథాన నడిపించారు. సగటు పౌరుడికి ప్రగతి ఫలాలు అందేలా చూశారు. రవాణా సదుపాయాల కోసం ఢిల్లీ మెట్రో రైలు ఆయన చొరవవల్లనే వచ్చింది. తర్వాత ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్ళేలా కాంగ్రెసు నాయకురాలు షీలా దీక్షిత్‌ను ప్రోత్సహించారు. నేషనల్ హై వే డెవలప్ మెంట్ ఫ్రాజెక్టు ఆయనదే. తూర్పు, పడమర, ఉత్తర దక్షిణ కారిడార్ల గోల్డెన్ చతురస్రం ఆయన చొరవ వల్లనే సాధ్యమయ్యింది. బి.సి.ఖండూరికి ఈ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రాజెక్టు వల్ల భారతదేశంలో రోడ్డు రవాణా విప్లవాత్మక ప్రగతి సాధించింది. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన ఆయనదే. దేశంలో గ్రామీణ ప్రాంతాలను రోడ్డుమార్గాన కలపడంలో ఈ పథకం ఎంతో తోడ్పడింది. 1999 లో ఆయన తీసుకువచ్చిన కొత్త టెలీకాం పాలసీ భారతీయ టెలీకాం రంగంలో విప్లవాత్మకమైన మార్పుకు కారణమైంది.

ఆయన శాంతి దూత. అనేక అడ్డంకులను, అవరోధాలను అధిగమించి 1999లో ఆయన స్వయంగా లాహోరు బస్సు ఎక్కి భారత పాకిస్తాన్ దేశాల మధ్య శాంతికి ప్రయత్నించారు. ఆ బస్సులో అనేకమంది భారత ప్రముఖులు కూడా వెళ్ళారు. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ లోని మిలిటరీ పెద్దలు పౌరప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కానీయలేదు. శాంతి ప్రక్రియ ముందుకు సాగనీయలేదు. కార్గిల్ యుద్ధం మొదలైంది. కార్గిల్ యుద్ధసమయంలో నియంత్రణ రేఖ దాటి ముందుకు వెళ్ళకుండా సహనం వహించి, న్యూక్లియర్ దేశాల మధ్య యుద్ధపరిస్థితి అదుపు తప్పకుండా, భారతదేశం దుడుకుగా వ్యవహరించిందన్న ఆరోపణలు ప్రపంచంలో ఎక్కడా వినబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఆయన శాంతి సాధనకు అవకాశాలున్నాయేమో అన్వేషించేవారు.

సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆయన చాలా ప్రోత్సాహమిచ్చారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కీలకపాత్ర పోషించిన డా.ఎపిజె అబ్దుల్ కలామ్ తర్వాత రాష్ట్రపతి అయ్యారు. తర్వాత ఆయన ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. “జైజవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్‌” నినాదాన్ని సృష్టించింది వాజపేయి. ఆయన శాస్త్రీయ స్ఫూర్తిని ప్రోత్సహించారు. కేవలం సాంకేతిక ప్రగతికి మాత్రమే పరిమితం కాలేదు. ఆర్దినెన్సుల ద్వారా పరిపాలనను ఆయన వ్యతిరేకించేవారు. టెర్రరిస్టు నిరోధక చట్టం “పోటో” ను “పోటా” గా అంటే ఆర్డినెన్సును చట్టంగా మార్చడంలో ఆయన ప్రతిపక్షంలో అందరిని ఒప్పించారు. టీ పార్టీ డిప్లమసీ ద్వారా ఆయన తీవ్రంగా వ్యతిరేకించే ప్రతిపక్ష సభ్యులను కూడా ఒప్పించి చట్టం వచ్చేలా చూశారు. ఆయన ప్రతిపక్షాలతో సంప్రదింపుల ద్వారా పనిచేసే నాయకుడు. మిత్రపక్షాల్లో ఏకాభిప్రాయం సాధించడానికి కృషి చేసేవారు. ఆయన ప్రభుత్వం 24 పార్టీల కూటమి. అకాలీదళ్, శివసేన పార్టీలు ఇప్పుడు కూడా వాజ్‌పేయీ మాదిరి వ్యవహారశైలి కోసం మాట్లాడడం జరుగుతోంది. వ్యక్తిగా కాని, రాజకీయ నేతగా కాని కాపట్యం తెలియని నాయకుడు. ఆయన చెప్పిన మాట “ఐ యామ్ బాచిలర్ (అవివాహితుడిని) బట్ నాట్ ఏ బ్రహ్మచారి” ఆయన నిజాయితికి నిదర్శనం. ఆయన ఏ విషయంలో అయినా భేదాభిప్రాయం ఉంటే నిక్కచ్చిగా చెప్పేవారు.

ఆరెస్సెస్ నాయకుడు గోవిందాచార్య ఆయన్ను “ముఖోటా” (ముసుగు) అని పిలిచినప్పుడు, ఆ మాట రాజకీయంగా ప్రచారం పొందకుండా వాజపేయి వ్యవహరించారు. గోవిందాచార్య నేటికి కూడా రాజకీయాల్లో అనామకంగానే మిగిలిపోయారు. ఆయన హిందూత్వ రాజకీయ నాయకుడు. క్విట్ ఇండియా కాలంలో యువనాయకుడిగా కొంతకాలం కమ్యూనిస్టులతో ఉన్నారు. అయినా ఆయన బహుళత్వం ప్రధానమైన అనేక మతాలు, సంస్కృతులు, భాషలు ఉన్న భారతదేశానికి నిజమైన నాయకుడు. ఆయనకు రాజకీయాల్లో చర్చలు, సంప్రదింపులు ప్రధానం. శాంతియుతమైన, ప్రజలందరి భాగస్వామ్యం ఉన్న మార్గమే మంచిదని భావించేవారు. ఒక గొప్ప నాయకుడిని దేశం కోల్పోయింది.

ప్రజాస్వామ్య రాజకీయాలపై వాజ్‌పేయీ

అధికార, ప్రతిపక్షాల మధ్య సుహృద్భావ సంబంధాలపై ప్రధానిగా వాజ్‌పేయీ ఒకసారి లోక్‌సభలో చేసిన ప్రసంగం ఇలా సాగింది. “సౌత్ బ్లాక్‌లో నెహ్రూ చిత్రపటం ఉండేది. నేను అక్కడి నుండి వస్తూ, పోతూ ఉన్నప్పుడు దానిని చూస్తుండేవాడిని. నెహ్రూతో సభలో గొడవ కూడా పడుతుండేవాడిని. నేను ఎంపిగా కొత్తవాడిని కాబట్టి వెనుక వరుసలో కూర్చునేవాడిని. అప్పుడప్పుడు మాట్లాడే అవకాశం కోసం వాకౌట్ కూడా చేయాల్సి వస్తుండేది. కాని నెమ్మది నెమ్మదిగా స్థానాన్ని సంపాదించగలిగాను. ముందుకు సాగాను. నేను విదేశాంగ మంత్రి అయినప్పుడు అక్కడ నెహ్రూ చిత్ర పటం కనిపించలేదు. ఆ ఫోటో ఎటుపోయిందని నేను అడిగాను. ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. దానిని మళ్ళీ అక్కడ పెట్టారు. ఇలాంటి భావనలకు విలువ ఉందా? దేశంలో ఈ భావనలకు స్థానం ఉందా? నెహ్రూతో నాకు అభిప్రాయ భేదాలు లేవని కాదు. చర్చల సందర్భంగా అవి చాలా తీవ్రంగా ఉండేవి. నేనొకసారి పండిట్‌జీతో ‘మీలో రెండు భిన్న వ్యక్తిత్వాలు ఉన్నాయి. మీలో చర్చిల్ ఉన్నాడు, చాంబర్లీన్ కూడా ఉన్నాడని (ఇద్దరు బ్రిటీష్ ప్రధానులుగా పనిచేశారు)’ అన్నాను. ఆయన అందుకు కోపం తెచ్చుకోలేదు. సాయంత్రం ఒక విందులో కలిసినప్పుడు ఈ రోజు చాలా గట్టి ప్రసంగం చేశావని అంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇవాళ రేపు ఇలాంటి ఆలోచనలు చేయగలమా? శతృవును బలోపేతం చేస్తారా? ఒకరికొకరు మాట్లాడుకోవడమే మానేస్తారు.

జెనీవా సమ్మేళనంలో మన పొరుగుదేశం కశ్మీర్ సమస్యను లేవనెత్తాలని నిర్ణయించుకున్నప్పుడు నాటి ప్రధాని పి.వి.నరసింహారావు దృష్టి నా మీద పడింది. నేను భారతదేశం ప్రతినిధిగా అక్కడికి వెళ్ళాలని ఆయన అనుకున్నారు. మన పొరుగుదేశానికి చాలా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ నాయకులకు విస్మయం చెందారు. అప్పటికీ ఒక నాయకుడు ‘భారత దేశ ప్రజాస్వామ్యం విచిత్రమైంది. ప్రతిపక్ష నేత తమ ప్రభుత్వ వాదనకు మద్దతిచ్చేందుకు జెనీవా వెళ్తున్నాడు. కానీ మా ప్రతిపక్ష నేత దేశం బైటే ఉంటే తీసుకువచ్చే కష్టాలతో మన అంతర్జాతీయ కష్టాలు మరిన్ని పెరుగుతాయ’ని అన్నారు. మరికొందరేమో నరసింహారావు మాములు మనిషి కాదని, చాలా తెలివైన వాడని, అతను కేవలం దేశం ఐక్యతను ప్రదర్శించేందుకే కాకుండా, మనకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే, తప్పులో భాగం పంచేందుకు వాజ్‌పేయిని బలిపశువుగా పంపుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. కాని ఆ మాటలను నేను విశ్వసించలేదు.

                                                                                                                   – ఉజ్వల్ కే చౌదరి (దక్కన్ క్రానికల్)