Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సారూ.. ఇదేం తీరు

There are no students in disarray but three teachers

ఉమ్మడి జిల్లాలో ఏక విద్యార్థి పాఠశాలలు
ఖమ్మం జిల్లాలో పది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 99
అనాసాగరంలో విద్యార్థులే లేరు కానీ ముగ్గురు ఉపాధ్యాయులు
వాంకుడోత్ తండాలో ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు

ఒకప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు వాటితో పాటు ఏక విద్యార్థి పాఠశాలలు వెలిశాయి. బడిబాట, ఇంకా ఇతర ప్రచారాలు ఏవీ ప్రభుత్వ బడిలోకి పిల్లలను ఆకర్షించలేకపోయాయి. ప్రభుత్వ పాఠశాలల పరి స్థితి నానాటికి తీసికట్టు నానంబొట్టు అన్న సామెతలా తయారైంది. మైదాన ప్రాంతమైన ఖమ్మంజిల్లాలోనే 99 ప్రభుత్వ పాఠశాలల్లో 10 లోపు మంది విద్యార్థులు ఉన్నారంటే పరిస్థితిని అవగతం చేసుకోవచ్చు. ఇక విద్యాశాఖాధికా రుల తీరు ఏవిధంగా ఉందంటే  దున్న ఈనింది అంటే గాటికి కట్టెయ్యమన్నట్టు ఉంది. విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేని పరిస్థితి. మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడం జిల్లా అధికారులు కార్యాలయాలను వీడక పోవడం ఈ దుస్థితికి కారణమవుతుంది. ప్రైవేటు విద్య, ప్రభుత్వ విద్యను మింగేస్తుంది. కొన్ని పాఠశా లలు పశువుల కొట్టాలుగా మారుతున్నాయి. ఇప్పటికైనా మేలుకోకపోతే ఇక ప్రభుత్వ విద్య కనుమరుగు కాక తప్పదు.

మన తెలంగాణ / ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల పరిస్థితికి నానాటికి దిగజారుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు మోజులో మునిగి తేలుతుండడంతో ప్రభుత్వ విద్య హంపశయ్యకు చేరింది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నా ఇంగ్లీష్ మీడియంలో బోధన అని చెప్పినా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపే పరిస్థితి కన్పించడం లేదు. ప్రైవేటు మోజుతో పాటు విద్యాశాఖ నిర్లక్షం ఈ దుస్థితికి కారణమైంది. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య చూస్తే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుస్తుంది. తల్లాడ మండలం నర్సింహారావుపేట ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు మాత్రమే విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కారేపల్లి మండలం రామలింగాలపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక పాఠశాలను మూసివేయగా ప్రస్తుతం ఆ పాఠశాల పశువుల శాలగా మారింది. నేలకొండపల్లి మండలం అనాసాగరం పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులుండగా ఒక్క విద్యార్థి కూడా లేని దుస్థితి. రఘునాథపాలెం మండలం వాంకుడోత్ తండాలో ఒక్క విద్యార్థి ఉండగా ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. ఇదే మండలం సూర్యాతండాలో నలుగురు విద్యార్థులు, సుకునితండాలో ఇద్దరు, ఎన్‌వి బంజర చింతగుర్తి ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు చొప్పున విద్యార్థులుండగా ఒక్కో ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఆ పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఖమ్మం నడిబొడ్డున ఉన్న రస్తోగి నగర్ ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులుంటే ఇద్దరు జగ్గయ్య మిల్లు సమీపంలోని పిఎస్‌లోనూ 10 మంది విద్యార్థులుండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాఠశాలలు ఇదే జాబితాలో ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు, కొన్ని ఉన్నత పాఠశాలలది ఇదే పరిస్థితి. రాపల్లి, జాలిమూడి, విప్పలమడక, మల్లారం, కిష్టాపురం, రామన్నపాలెం, గోపాలపురం మొదలైన యూపిఎస్‌లలో 40 లోపు విద్యార్థులకు ఆరు నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులను పంపేవిధంగా తల్లిదండ్రులను ఆకర్షించడంలో విద్యాశాఖ విఫలమవుతుంది. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇష్టానుసారంగా ఇచ్చేస్తున్నారు. ప్రతి గ్రామానికి ప్రైవేటు పాఠశాలల బస్సులు వెళ్తుండడంతో తల్లిదండ్రులు అదే తోవలో నడుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యను బతికించాలంటే ప్రైవేటు పాఠశాలలను మూసివేయాల్సిందే. లేదంటే ప్రభుత్వ పాఠశాలలు మూతపడక తప్పదు. ప్రైవేటు పాఠశాలలను కనీసం మండల కేంద్రాలకే పరిమితం చేయాలి. ప్రభుత్వ బడుల మూసివేతపై ఆందోళనలు చేసే ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు నడుం బిగించాలి. విద్యాశాఖాధికారుల తీరు సైతం మారాలి. బిల్లు, బెల్లు ఉపాధ్యాయులను, ప్రైవేటు వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Comments

comments