Home ఆఫ్ బీట్ రామాయణ దృశ్యాల రామ్ గఢ్

రామాయణ దృశ్యాల రామ్ గఢ్

field in the name of Ramgarh in Surguja district

సర్‌గుజా జిల్లాలో రామగఢ్ అన్న పేరున ఒక క్షేత్రమున్నది. దానిని రామగిరి అని కూడా పిలుస్తారు. అది దట్టమైన అడవుల మధ్యన ఉన్న ఒక కొండ సర్‌గుజా జిల్లా కేంద్రమైన అంబికాపూర్ నుండి బిలాస్‌పూర్ వెళ్లే రహదారిపై నున్న ఉదయపూర్ తాలూకా కేంద్రానికి ఆగ్నేయంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరణ్య వాస కాలంలో సీతారామ లక్ష్మణులు ఈ కొండపైన నివాసమున్నారనీ ఐతిహ్యం. ఈ ప్రాంతాన్ని చిత్రకూటమని కూడా పిలుస్తారు. రమణీమైన ప్రకృతి, చుట్టూ ఎత్తైన కొండలు, ప్రక్కన ప్రవహించే మందాకిని ఇత్యాదులతో కూడిన ఈ స్థలం వాల్మీకి రామాయణంలోని చిత్రకూట వర్ణనకు సరిపోతుంది.

ఇతర ప్రాంతాలతో పోల్చినపుడు సర్గుజాలో శివ లింగాల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఆర్యులకు విష్ణువు ప్రధానదైవం. శివుడు ద్రావిడులకు ఆరాధ్య దైవం. ఈ కారణంగా ఇది ద్రావిడుల నివాస స్థానంగా ఇక్కడి వారు భావిస్తారు. చత్తీస్‌గఢ్, గోండ్వానాలు లంకా క్షేత్రంలో భాగాలనీ, రావణాసురుని పాలనలో ఈ ప్రాంతం ఉండినదనీ స్థానిక ప్రజల విశ్వాసం. వేల ఏండ్ల అనంతరం ఈనాటికీ ఇక్కడి ఆదివాసీలు తాము రావణుని వంశానికి చెందిన వారమని చెప్పుకుంటుంటారు. రావణాసురుని మాదిరిగానే తాము కూడా అత్యంత శివభక్తి పరాయణులమని కూడా ప్రకటించుకొంటారు. స్థానిక ఉర్రావ్ జాతిజనులు ఒంటిగానూ, ఎత్తుగానూ ఉండే శిఖరాలను ‘లంకా’ నామంతో వ్యవహరిస్తారు. 

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సర్‌గుజా అన్నపేరున ఒక జిల్లా ఉన్నది. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో డాండీర్ పేరున పిలువబడిన ఈ ప్రాంతానికి రామాయణ కాలాన్నుండి ఎడతెగని క్రమంలో చరిత్ర ఉన్నది. రామాయణ కాలంలో ఈ ప్రాంతం నేటి జార్ఖండ్ ప్రాంతంలో ఉండేది. పర్వతాలు, కొండలు, చిన్న చిన్న గుట్టలు, లోయలు, సెలయేళ్లు, నదులు, జలపాతాలు, దట్టమైన వనాలు, పక్షుల కిలకిలా రావాలు, వన్యమృగాల సంచారాలు ఒకటేమిటి భగవంతుడు ప్రత్యేకించి, వేరెవరికీ అప్పచెప్పకుండా స్వయంగా తన చేతులతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడా అనిపిస్తుంది. ఆ కారణంగానే కావచ్చును సర్‌గుజాకు ఒకసారి వచ్చిన వారు మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు. సర్‌గుజా అన్న పదానికి స్థానిక భాషలో స్వర్గధామం అని అర్థం.

ఇతర ప్రాంతాలతో పోల్చినపుడు సర్గుజాలో శివ లింగాల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఆర్యులకు విష్ణువు ప్రధానదైవం. శివుడు ద్రావిడులకు ఆరాధ్య దైవం. ఈ కారణంగా ఇది ద్రావిడుల నివాస స్థానంగా ఇక్కడి వారు భావిస్తారు. చత్తీస్‌గఢ్, గోండ్వానాలు లంకా క్షేత్రంలో భాగాలనీ, రావణాసురుని పాలనలో ఈ ప్రాంతం ఉండినదనీ స్థానిక ప్రజల విశ్వాసం. వేల ఏండ్ల అనంతరం ఈనాటికీ ఇక్కడి ఆదివాసీలు తాము రావణుని వంశానికి చెందిన వారమని చెప్పుకుంటుంటారు. రావణాసురుని మాదిరిగానే తాము కూడా అత్యంత శివభక్తి పరాయణులమని కూడా ప్రకటించుకొంటారు. స్థానిక ఉర్రావ్ జాతిజనులు ఒంటిగానూ, ఎత్తుగానూ ఉండే శిఖరాలను ‘లంకా’ నామంతో వ్యవహరిస్తారు.

సర్‌గుజా జిల్లాలో రామగఢ్ అన్న పేరున ఒక క్షేత్రమున్నది. దానిని రామగిరి అని కూడా పిలుస్తారు. అది దట్టమైన అడవుల మధ్యన ఉన్న ఒక కొండ. సర్‌గుజా జిల్లా కేంద్రమైన అంబికాపూర్ నుండి బిలాస్‌పూర్ వెళ్లే రహదారిపై నున్న ఉదయపూర్ తాలూకా కేంద్రానికి ఆగ్నేయంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అరణ్య వాస కాలంలో సీతా రామ లక్ష్మణులు ఈ కొండపైన నివాసమున్నారనీ ఐతిహ్యం. ఈ ప్రాంతాన్ని చిత్రకూటమని కూడా పిలుస్తారు. రమణీమైన ప్రకృతి, చుట్టూ ఎత్తైన కొండలు, ప్రక్కన ప్రవహించే మందాకిని ఇత్యాదులతో కూడిన ఈ స్థలం వాల్మీకి రామాయణంలోని చిత్రకూట వర్ణనకు సరిపోతుంది.

కొండపైన కొంత ఎత్తులో కొండలోనికి తొలువబడిన రెండు కక్షలున్నాయి. ఒకటి సీతారాముల నిమిత్తము. దానిని ‘సీతా బేంగరా’ అని పిలుస్తారు. రెండవది లక్ష్మణ స్వామి నివాసము. దానిని ‘జోగీమారా’ అని పిలుస్తారు. అరణ్య వాసంలో సీతారాముల సేనతో పాటుగా వారి రక్షణ బాధ్యతను కూడా నిర్నిమేషంగానూ, నిర్వికారంగానూ, నిస్వార్థంగానూ నిర్వహంచిన లక్ష్మణుడు ఒక యోగి అని స్థానికుల భావన. ఈ కారణంగా లక్ష్మణ స్వామి నివాసం ‘జోగీమారా’ అయిందన్నమాట. ‘జోగీ మారా’ నుండి చూస్తే ‘సీతా బేంగరా’ బయటి ప్రదేశమంతా విపులంగా కనిపిస్తుంటుంది. కాపలాకు అనుకూలంగా ఉండిందన్నమాట.

కోసల నుండి బయలుదేరిన సీతారామలక్ష్మణులు వనవాస కాలంలో తిరుగుతూ తిరుగుతూ అక్కడకు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న రుషులూ, మునులూ రాక్షసుల వేధింపులను తాము తట్టుకోలేకపోతున్నామని శ్రీరామ చంద్రునికి విన్నవించుకొన్నారు. రాక్షసులు భోంచేసి వదిలేసిన ఋషి, మునుల అస్థిపంజరాల గుట్టను వారాయనకు చూపించారు. వారిని రక్షిస్తానని మాట ఇచ్చిన శ్రీరామ చంద్రుడు అనంతర కాలంలో రాక్షస గణాలను కూల్చివేశాడు. రామగఢ్ సమీపంలో ‘రక్సా గండా’ అన్న పేరున్న చిన్నగుట్ట ఉన్నది. ‘రక్సా గండా’ అంటే రాక్షస దిబ్బ అని అర్థం. శ్రీరాముడు మర్దించిన రాక్షసుల కళేబరాలు ఒక గుట్టగా ఏర్పడినాయన్న మాట.

రావణాసురుడు సీతమ్మ వారిని ఇక్కడి నుండే అపహరించినాడు అని కూడా ఐతిహ్యమున్నది. ‘సీతా బేంగరా’ వాకిటి ముందర ఆనాడు లక్ష్మణ స్వామి గీసిన లక్ష్మణ రేఖల మాదిరి రేఖలు అలాగే ఉన్నాయి. లక్ష్మణ రేఖలకు సమీపంలో బయటివైపున రావణాసురుని పాదముద్రలని భావించేవి కూడా ఉన్నాయి.

రామగఢ్ కొండ ‘మృగడాండ్’ అన్న గ్రామం క్రిందకు వస్తుంది. ‘డాండ్’ అంటే చిన్న గుట్ట అని అర్థము. జింకలకు (మృగాలకు) నివాసంగా ఉన్న ఆ గుట్ట నుండే బంగారు జింక రావడం సీతమ్మ చూడడం తటస్థించి ఉండొచ్చని భావిస్తారు.

‘జోగోమారా’ గుహలో కొన్ని ‘భిత్తి చిత్రాలున్నాయి. రాతి గోడలపై చెక్కిన చిత్రాలన్నమాట. అవి జైన మత సంబంధాలని విజ్ఞుల అభిప్రాయం. క్రీస్తు పూర్వం 126 ప్రాంతలో సర్‌గుజా ప్రాంతం ఖారవేలుని పాలనలోనికి వచ్చింది. పద్మాసనం తొలుత జైన సంబంధమని, తదుపరి బౌద్ధులు అనుసరించారని, పద్మాసనములోనున్న ఈ గుహలోని భిత్తి చిత్రాలు ఖారవేలుని కాలములో చెక్కబడి ఉండవలెనని రామకృష్ణ దాసు అభిప్రాయం. ఈ చిత్రాలలో కొన్ని మాత్రమే జైన ధర్మ సంబంధితాలని, జైన తత్తం లోతు పాతులను తెలిపేవిగా ఉన్న ఆ చిత్రములున్నవని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పురాతత్త శాస్త్రవేత్త పండిత లోచన ప్రసాద్ గారి అభిప్రాయం.

క్రీస్తు పూర్వం 3వ శతాబ్దికి చెందిన శిలాశాసనం లభించిన కారణంగా రామగఢ్ శ్రమణులకు సైతం ఆశ్రమమిచ్చిందని, ‘జోగీ రామా’ గుహ శ్రమణకులకు పూజాస్థలిగానూ, మునులకు దీక్ష నిచ్చే స్థలంగానూ ప్రసిద్ధి చెందినదని తెలుస్తున్నది. (శ్రమణకులు బౌద్ధానికన్నా ముందటి సంప్రదాయానికి చెందిన వారు)ఇప్పుడు కూడా గుర్‌గుజా ప్రాంతంలో బాగా చదువుకున్న వారిని ఋషి అని ముని అని వ్యవహరించే సంప్రదాయమున్నది. దిగంబర జైన మునులైన కులభూషణుడు, దేశ భూషణుడు ఇక్కడ తమ సాధనను కొసాగించి సమాధి నొందినారని చరిత్ర చెప్తున్నది. మహావీర భగవానుని పరంపరలోని ఉగ్రాదిత్యాచార్యులలో రెండువేల శ్లోకాలతో కూడిన వేషక గ్రంథాన్ని రామగఢ్‌లో నివాస ముండి రచించినారు. జైన పరంపరలో ‘జోగీ మారా’ గుహ ఒక మందిరంగానూ చైత్యాలయంగానూ పనిచేసిన కారణంగా రామగఢ్ ప్రాంతమంతా జైనుల సేవలో తలమునకలైందని చెప్పవచ్చును. చత్తీస్‌గఢ్ ప్రాంతము మానవాళి నాగరికతకు జన్మభూమిగా ఉండినదని, సర్‌గుజా జిల్లా అందుకు సాక్షంగా నిలుస్తుందని పురాతత్త శాస్త్రవేత్త, పండిత లోచన్ ప్రసాద్ పాండేయగారి అభిప్రాయం.

క్రీస్తు పూర్వము రెండవ, మూడవ శతాబ్దాల కాలంలోనే రామగఢ్‌లోని ‘సీతాబేంగరా’ లలిత కళలకు కాణాచిగా నిలచింది. నేటికి రెండున్నర వేలేండ్ల క్రితమే ఈ చుట్టు పక్కల ప్రాంతమంతా లలితకళా ప్రేమికులతో సందడిగా ఉండేదని లభించిన శిలా లేఖనాల ద్వారా, సీతా బేంగరాలోని భిత్తి చిత్రాల ద్వారా తెలుస్తున్నది. సీతా బేంగరా నాట్యశాలగానూ, చుట్టు పక్కల గుహలు దేవదాసీలకు నివాస స్థానంగా ఉండేవి. నాట్య శాస్త్రాచార్యుడు భరతముని రచనల్లో సీతా బేంగరాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. సీతా బేంగరా ముందు భాగం రంగస్థలంగానూ, చుట్టూ వున్న పెద్దపెద్ద రాళ్లను ప్రేక్షకులు కూర్చునేందుకు అనువుగా (నేటి గ్యాలరీలవలె) చెక్కి చదును చేసి పెట్టారు. ఈ గ్యాలరీకి సర్హోచ్ఛ స్థానం రాజుగారికి విడిగా కేటాయించబడింది. నాట్యశాలలోని ఏ భాగాన్నుండి చూచినా రంగస్థల కార్యక్రమం స్పష్టంగా కనిపించే ఏర్పాటుండింది.

రసపుత్ర రాజు యశోవర్ధనుని ఆస్థాన పండితుడు, సంస్కృత నాటక కర్త భవభూతి ఉత్తర రామ చరితం సీతాబేంగరా వేదికపైన ప్రదర్శింపబడింది. దేవదీన్ అన్న కళాకారుడు కాశీ నుండి వచ్చి మరీ ఈ నాటకంలో పాల్గొన్నాడు. స్థానిక దేవదాసి సుతమక సీత పాత్రను పోషించింది. ఈ ప్రాచీన నాట్యశాలలోని దేవదాసి సుతమకను నాట్య నిర్దేశకుడు, రాజ కుమారుడు దేవదత్తుడు ప్రేమించినాడు. వారి ప్రణయగాథ రామగఢ్ లోని ఈ ప్రాచీన నాట్యశాలలో భిత్తి చిత్రాలుగా చెక్కబడి ఉన్నవి. బ్రాహ్మీలిపిలో చెక్కబడి ఉన్న కారణంగా ఈ ప్రణయ గాథ క్రీస్తు పూర్వం మూడవ లేక రెండవ శతాబ్దికి చెందినదని అనుకొనవలసి వస్తున్నది. విశ్వంలోని అత్యంత ప్రాచీనమైన ప్రణయగాధకు ఈ శిలాక్షరాలు సాక్షిగా నిలుస్తున్నాయి. శాతవాహనుల కాలంలో కూడా నాట్యశాస్త్ర సంబంధిత కార్యక్రమాలూ, రచనలూ ఇక్కడ జరుగుతుండేవి. అత్యంత ప్రాచీనమైన నాటకరంగ ప్రేక్షక గృహంగా రామగఢ్ గుహల ప్రాంతాన్ని భావింపవలసి ఉన్నదంటారు అసిత్‌కుమార్ హల్‌ధర్. మహాకవి కాళిదాసు మేఘ సందేశాన్ని (ఉత్తరాది వారు ‘మేఘ దూత’ అని పిలుస్తారు) రామ గఢ్ నుండే రచించినాడని ప్రశస్తి. మేఘ సందేశం కథ రామగిరి నుండి ప్రారంభమౌతుంది. కావ్యంలోని రామగిరి వర్ణన సర్‌గుజా జిల్లాలోని రామగిరి రూపురేఖలతో సరిపోతవి. కావ్యంలోని యక్షుడు ‘జోగీమారా’ గుహలో నివసించే వాడని ఐతిహ్యం. ఇక్కడి నుండి పయనించిన మేఘం అలకాపురికి వెళ్లిన మార్గ వర్ణన కూడా ఈ ప్రదేశానికి సరిపోవడమే కాక కాళిదాసుకు గల అపారమైన భారతదేశ నైసర్గిక జ్ఞానాన్ని వెల్లడిస్తుంది. కార్యారంభ శ్లోకాలకూ, రామగఢ్ గుహలతో శిలలపై చెక్కబడిన శ్లోకాలకూ గల సాదృశ్యత కారణంగా కాళిదాసు తన కావ్య రచనను ఇక్కడనే చేసినాడన్న నమ్మకానికి బలం కలుగుతున్నది.

కాళిదాసు ఈ చుట్టుముట్టు ప్రాంతము వాడే అని ఒక నమ్మకము. డా॥ బలదేవ ప్రసాద్ మిశ్రా గారు తమ పరిశోధనలో కాళిదాసు రామగఢ్ సమీప గ్రామస్తుడయి ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

ఈ విషయమై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రెవెన్యూశాఖలో తహశీల్దార్‌గా పనిచేస్తున్న డా॥ రామ విజయ్ శర్మ లోతైన పరశోధన చేసినారు. వారు చరిత్రను అధ్యయన విషయంగా తీసుకొని ఎం.ఏ, పి.హెచ్.డి. పూర్తి చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్ర పరిశోధనా సంస్థకు సలహాదారుగా ఉన్నారు. వారు పండో ఆదివాసీ సమాజశోధ్ సలాహ్ కార్ కూడా! వారి పరిశోధనల ఫలంగా తేలిందేమంటే కాళిదాసు జన్మస్థలం రామగఢ్ పర్వతాన్ని ఆనుకొని వున్న ‘మృగడాండ్’ గ్రామం. మృగడాండ్ గ్రామంలోని వారంతా పండో జాతికి చెందిన ఆదివాసీలు. కాళిదాసు కూడా పండో ఆదివాసీ జాతికి చెందిన వాడేనని డా॥ రామవిజయ్ శర్మ ప్రతిపాదన.

డా॥ రామ విజయ్ శర్మ పరశోధనల ప్రకారం 15న నవంబర్ 350 (క్రీస్తు శకం) నాడు జన్మించిన కాళిదాసు నిండు నూరేళ్లు జీవించి 15 మార్చి 450 నాడు పరమపదించినారు.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పండో జాతి వారి విన్నపాన్ని మన్నించి డా॥ రామ విజయ్ శర్మ పరిశోధనలు అంగీకరించింది. రామగఢ్‌లో మహాకవి కాళిదాసు వేదికను నిర్మించింది. విగ్రహం ఏర్పాటుకు యత్నాలు చేస్తున్నది. 2014 నుండి ప్రతి ఏటా మహాకవి కాళిదాసు జయంతి ఉత్సవాలు మృగడాండ్ లో జరుగుతున్నాయి. 2015 నవంబర్ 15 ఉత్సవాలలో ఈ వ్యాసకర్త పాల్గొన్నాడు. మృగడాండ్ లోని ప్రతి ఇంటా వాళ్ల తాతగారి జన్మ దినాన్ని స్వయంగా జరుపుకుంటున్న ఆనందం, ఉత్సాహంఆ పండో జాతి వారిలో కనిపించింది. ఆ రోజు రాత్రి ఊరి వా రందరకూ ఒకే చోట వంట. ఒకే పంక్తి భోజనం. రాత్రి తెల్లవార్లూ ఆటలూ, పాట లు,నృత్యాలూ కాళిదాసును తలుచుకోవడాలూ. ‘మహాకవి పోతన జయంతిని మనమిలా జరుపుకోవద్దా!’ అనిపించింది.