Home స్కోర్ రవిశాస్త్రికే ఛాన్స్!

రవిశాస్త్రికే ఛాన్స్!

  • నేడు టీమిండియా  ఎంపిక

Ravi-Shastri

ముంబయి: టీమిండియా ప్రధాన కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఎంపిక కావడం లాంఛనమే. భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం కోచ్ ఎంపిక పక్రియను నిర్వహిస్తోంది. దీని కోసం ఆరుగురిని ఇంటర్వూ చేయనున్నారు. ఆరుగురు బరిలో ఉన్నా కేవలం రవిశాస్త్రికే కోచ్ పదవి దక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. సలహా మండలి సభ్యులు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్‌ల త్రయం కోచ్ పదవి కోసం అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించనున్నారు. కాగా, కోచ్ పదవికి చాలా మంది దరఖాస్తు చేసుకున్నా కేవలం ఆరుగురినే సోమవారం జరిగే ఎంపికకు పిలిపించారు. రవిశాస్త్రితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, పైబస్, సిమన్స్, లాల్ చంద్ రాజ్‌పుత్‌లను మాత్రమే ఇంటర్వూలకు పిలిచారు. కాగా, టామ్ మూడీ, సెహ్వాగ్, శాస్త్రిల మధ్య కోచ్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే గతంలో టీమిండియా డైరెక్టర్ పని చేసిన అనుభవం శాస్త్రికి అదనపు అర్హతగా మారింది. అతని పర్యవేక్షణలో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. దీంతో అతన్ని కోచ్‌గా ఎంపిక చేయాలనే సూచనలు మాజీ క్రికెటర్ల నుంచి వస్తున్నాయి. భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం రవిశాస్త్రిని కోచ్‌గా నియమించడమే ఉత్తమమని సూచించాడు. ఇక, సలహా మండలి సభ్యుల్లో ఒకడైన సచిన్ కూడా రవికి మద్దతుగా ఉన్నాడు. అతని సలహాతోనే రవి కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు సమాచారం. అంతేగాక, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా శాస్త్రికి మద్దతుగా నిలిచాడు. కోహ్లి సహచరులు కూడా కోచ్‌గా రవిని ఎంపిక చేయడమే మంచిదని ఇటీవల బిసిసిఐ ప్రతినిధి రాహుల్ జోహ్రికి సూచించారు. అందరి మద్దతు ఉన్న రవిశాస్త్రి భారత ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గతంలో లాగా గంగూలీ చివరి నిమిషాల్లో చక్రం తిప్పితే పరిస్థితిలో మార్పు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇదే జరిగితే టామ్ మూడీకి మెరుగైన అవకాశాలు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఇది జరగడం దాదాపు అసాధ్యంగానే చెప్పవచ్చు. సలహా మండలితో సహా టీమిండియా కెప్టెన్, క్రికెటర్లతో పాటు భారత క్రికెట్ బోర్డు అధికారులు కూడా రవిశాస్త్రి అభ్యర్తిత్వంపైనే మొగ్గు చూపుతున్నారు. దీంతో రవి ఎంపిక లాంఛనంగా కనిపిస్తోంది.