Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

పథకం సరే… ప్రసవం?

Paloncha-Area-Hospital

పిహెచ్‌సిలో వసతులు కరువు
భయాందోళనలో గర్భిణులు
దృష్టిసారించని ఉన్నతాధికారులు

పాల్వంచ: టిఆర్‌ఎస్ ప్రభుత్వం గర్భిణీలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే గర్భిణీలంతా ప్రసవించాలనే ధృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన స్త్రీకి మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడ బిడ్డ పుడితే రూ.13 వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఏజెన్సీ పల్లెల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీలకు ఎటువంటి వసతులు లేవు. ఆసుపత్రుల్లో సరైన వైద్యులు కూడా ఉండరు. ఉన్నావారు గర్భిణీ స్త్రీలకు మందులు మాత్రమే ఇస్తారు. లేదంటే మరో ఆసుపత్రికి వెళ్లమని చెబుతారు. ఇలా ఏజెన్సీ మారుమూల గ్రామాల గర్భిణీ స్త్రీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని పిహెచ్‌సిలు ప్రసవానికి సరిపోనందున 30, 40 కి.మీ.ల దూరం వెళ్ళాల్సివస్తుంది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచలలో మాత్రమే ఏరియా ఆసుపత్రులున్నాయి. పాల్వంచలో కాన్పులు చేసేందుకు సరైన వైద్యులు లేరు. మహిళా గైనకాలజిస్ట్ లేకపోవడంతో కాన్పులు చేసేందుకు బయట నుండి డాక్టర్లను పిలిపించి కాన్పులు చేస్తున్నారు.

కాన్పు సమయంలో తల్లికీ, బిడ్డకు వచ్చే జబ్బులను అనుభవజ్ఞులైన డాక్టర్లే చూడగలరు. అత్యవసర పరిస్థితులోస్తే అదుపు చేయగల ఎండి డిజిఒ, లేదా ఎంబిబిఎస్ డిజిఒ డాక్టరే ప్రసవాన్ని గ్యారంటీగా చేసే అవకాశం ఉంది. లక్షకు పైగా జనాభా కలిగిన పాల్వంచ పట్టణం, మండలాల్లో ఆసుపత్రులున్నా వైద్యులు లేకపోవడం విచారకరం. ప్రసవ సమయంలో ఎన్నో బాధలకోర్చి బిడ్డకు జన్మనిచ్చి, తాను మరో జన్మ పొందే మహిళకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆసుపత్రి పెద్దదైనా, అన్ని వసతులున్నా డాక్టర్లు లేకపోతే దేవుడు లేని దేవాలయంలా ఉంటుంది. అందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం సంకల్పించిన విధంగా ప్రసవాలు జరగాలంటే గర్భీణులు భయపడుతున్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి ముందు ఇచ్చే సదుపాయల కన్నా ప్రసవం జరగడానికి సరైన వసతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించడానికి జంకుతున్నారు. ఇప్పటికైనా ఏజెన్సీ, మారుమూల పల్లెల్లో ఉండే గర్భీణులకు ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానికి సరైన వసతులు, వైద్యులు ఉండే విధంగా చూసుకొని ఇటువంటి పథకాన్ని ప్రవేశపెడితే అందరికీ బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments