Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఇంధనంపై పన్నులో కోత ఉండదు

 పన్నులను నిజాయితీగా చెల్లిస్తే చమురుపై ఆధారపడే పరిస్థితి రాదు

 కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ

Arun-Jaitley

న్యూఢిల్లీ: ప్రజలు నిజాయితీగా పన్నులను చెల్లించాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కోరారు. నిజాయితీగా పన్నులను చెల్లిస్తే ప్రభుత్వం ఆదాయం వనరుగా చమురుపై ఆధారపడే పరిస్థితే రాదని ఆయన అన్నారు. అదే సమయంలో పెట్రో ధరలపైనా ఆయన స్పందించారు. పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఉండబోదని స్పష్టం చేశారు. వేతన తరగతి చెందిన వారు తమ వంతుగా పన్నులను చెల్లిస్తున్నారని, ఇతర వర్గాలు కూడా పన్నుల చెల్లింపును మెరుగుపర్చుకోవాలని కోరారు. ‘రాజకీయ నాయకులు, విశ్లేషకులకు నా గౌరవప్రదమైన విజ్ఞప్తి ఏమిటంటే.. ఇంధనేతర రంగాల్లో పన్నుల ఎగవేతను ఆపాలని కోరుతున్నాను. ప్రజలు తమ పన్నులను నిజాయితీగా చెల్లిస్తే చమురుపై విధించే పన్నులు తగ్గుముఖం పడతాయి’ అని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వ పన్ను జిడిపి నిష్పత్తి 10 శాతం నుంచి 11.5 శాతానికి మెరుగుపడింది. దీనిలో సగం 0.72 శాతం ఇంధనేతర పన్ను జిడిపిలో పెరుగుదల అని అన్నారు. 2017-18 జిడిపిలో ఇంధనేతర రంగం నుంచి వచ్చిన పన్నుల వాటా 9.8 శాతంగా ఉందని, 2007-08 తర్వాత ఇదే అత్యధికమని జైట్లీ తెలిపారు. దీంతోపాటు ఇంధనంపై రాష్ట్రాలు విధిస్తున్న పన్నులను తప్పుపట్టారు. వినియోగదారులు ఆర్థికంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే చమురు ధరల్లో ఉపశమనం లభిస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా బలపడుతుందని అన్నారు.
రాష్ట్రాలు అదనంగా విధించే పన్నుల కారణంగానే చమురు ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా కేంద్రం తలుచుకుంటే చమురు ధరను రూ.25 తగ్గించవచ్చని ఇటీవల కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించడంపై జైట్లీ స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా మోసపూరితమైనవని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమలు కారణంగా జిడిపి వృద్ధి రెండు శాతం పడిపోతుందని కొంతమంది చెప్పిన జోస్యం తప్పని రుజువైంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలో ఒక భాగస్వామిగా ఉండాలని భావించామని, నాలుగో త్రైమాసికంలో 7.7శాతం వృద్ధిని సాధించడమే నిదర్శనమని అన్నారు. జిఎస్‌టిలో కేంద్రం, రాష్ట్రాలు స్థానిక పన్నులతో వసూళ్లు చేపడుతున్నాయని అన్నారు. పెట్రోలియంపై పన్నుల విషయంలో స్వతంత్రత ఉందని, రాష్ట్రాలు వీటి ద్వారా అత్యధికంగా ఆధాయాన్ని పొందుతున్నాయని అన్నారు.

Comments

comments