Home ఎడిటోరియల్ ప్రతిపక్షాలకు పరాభవమే

ప్రతిపక్షాలకు పరాభవమే

There is surely Defeat to the oppositionఎన్నికల ప్రకటన వెలువడినది లగాయతు.. సీట్ల పంపకం కోసం కొట్టుకోవడమే మహాకూటమికి సరిపోతున్నది. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో టిఫిన్ చెయ్యడం, గోల్కొండ రిసారట్స్‌కు వెళ్లి పిచ్చాపాటీ మాట్లాడుకుని భోజనం చెయ్యడం, ఇంటికి వెళ్లడం, మరునాడు మళ్ళీ అదే తంతు…కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు తక్కువ, నాయకులు ఎక్కువ.  సర్పంచ్‌గా కూడా చేయనివాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు ఆ పార్టీలో.  అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం మొదలవుతుంది. వారికి వారే వెన్నుపోట్లు పొడుచుకుంటారు. తమకు ముప్పయి సీట్లు కావాలని టీజేఎస్, తమకు నలభై కావాలని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నాయి. 

అది సామాన్యుడి సర్వే కావచ్చు.. ఏదైనా జాతీయ మీడియా లేదా సంస్థలు చేసిన సర్వే కావచ్చు. అంతిమ ఫలితం మాత్రం రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిదే విజయం అని తేటతెల్లం. మొన్న రిపబ్లిక్ టీవీ – సి ఓటర్ సర్వే , నిన్న ఎన్డీటీవీ పోల్ అఫ్ ఒపీనియన్ పోల్స్ చేసిన సర్వే సారాంశం ఒకటే. తెలంగాణ సచివాలయం మీద మళ్ళీ గులాబీ జెండా మాత్రమే ఎగురుతుంది! ఆ మధ్య ఒక తెలుగు ఛానెల్ ప్రకటించిన సర్వే చూసుకుంటే తొంభై సీట్లవరకు తెరాస గెలుస్తుంది అని స్పష్టమైంది. ఏమైనా ఇంచుమించుగా ఎనభై – తొంభై సీట్ల మధ్యన తెరాస గెలుచుకునే అవకాశం ఉన్నదనేది మాత్రం నిప్పులాంటి నిజం. సాధారణంగా నాలుగైదు సంస్థలు సర్వేలు చేసినపుడు భిన్నఫలితాలు వెలువడుతుంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని ఏజెన్సీలు ప్రకటించిన వివరాలను పరిశీలిస్తే కొందరు ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతుండగా మరికొందరు యూపీఏ కు కూడా అవకాశం ఉన్నదని చెబుతున్నాయి. అలాగే బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని కొందరు చెప్పగా, బీజేపీ కి సీట్లు చాలా తగ్గుతాయని మరికొందరు ప్రకటిస్తారు. కానీ, తెలంగాణ విషయం వచ్చేసరికి ప్రతిఒక్కరూ తెరాసదే విజయం కుండబద్దలు కొడుతున్నారు.

తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. తెలంగాణలోని ప్రముఖ రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీ, మజ్లీస్. కోదండరాం సాధ్యం లోని టీజేఎస్, పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన శక్తి ఏమిటో మనకు తెలియదు. తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటించినా, ఆయన వైఖరి చూస్తుంటే ఎన్నికలకు దూరం అని అర్ధమవుతుంది. ఇక గత ఎన్నికల్లో కొన్ని స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. వారి పరిధి ఏమిటో వారు గుర్తెరిగి ప్రాప్తకాలజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక గత నలభై ఏళ్లుగా తాను ద్వేషిస్తున్న కాంగ్రెస్ పార్టీతో జతకట్టడానికి దిగజారిపోయి, తమ సిద్ధాంతాలకు ఉప్పుపాతర వేసింది.

నాలుగు సీట్లు ఇస్తామంటే చాలు, ఎంతటి నైచ్యానికైనా దిగజారడం ఆ పార్టీ అధినాయకుడికి ఉగ్గుపాలతో తెలిసిన విద్య. రాజకీయపార్టీలు ఇంత సిద్ధాంతారాహిత్యంగా ఎలా మనగలుగుతాయి అనేది ఆశ్చర్యం. ఇటీవలే మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తాను కెసిఆర్ తో పొత్తుకోసం ప్రయత్నించానని కానీ, కెసిఆర్ ఛీ కొట్టారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు, కేసులు పెడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో అని కరకట్టకు పారిపోయిన చంద్రబాబు, జాతీయస్థాయిలో ఆంధ్రుల పరువును మంటకలిపిన చంద్రబాబు … మళ్ళీ కేసీఆర్ తో పొత్తుకు ప్రయత్నించాను అని చెప్పడం కంటే సిగ్గులేనితనం మరొకటి ఉంటుందా?

ఇక ఎన్నికల ప్రచారం గూర్చి చర్చించుకుంటే.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాదే విజయం అని, ఎనభై స్థానాలు మావే అని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ…ఎన్నికల కురుక్షేత్రంలోకి దూకకుండా, ఎన్నికలను అడ్డుకోవడానికి న్యాయస్థానాలను, ఎన్నికల కమీషన్ ను ఉపయోగించుకుంటున్నది. ఎవరి తలుపు తట్టినా, కాంగ్రెస్ కు చీత్కారాలే స్వాగతం పలుకుతున్నాయి. వెళ్లిన ప్రతిచోటా శృంగభంగం తప్పడం లేదు. అయిదేళ్లనుంచి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఎన్నికల ప్రకటన వెలువడింది ఆలస్యం, సమరోత్సాహంతో దూకకుండా, ఇతర ప్రతిపక్షాలతో కూటమి కట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఉద్యమ సమయంలో తమను చెప్పలేని విధంగా నిందించిన టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తో జట్టు కట్టాలని ప్రయత్నిస్తున్నది. అలాగే తమ బద్ధశత్రువు తెలుగుదేశం పార్టీతో పొత్తుకోసం అంగలారుస్తున్నది. అంటే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ పలికినవి అన్నీ బీరాలేనని, కేసీఆర్ ను ఒక త్రివిక్రమావతారంగా, ఆయన ముందు తాము అంగుష్ఠమాత్రులమే అని వారు గుర్తించారని భావిస్తే తప్పు లేదు.

ఎన్నికల ప్రకటన వెలువడినది లగాయతు.. సీట్ల పంపకం కోసం కొట్టుకోవడమే మహాకూటమికి సరిపోతున్నది. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో టిఫిన్ చెయ్యడం, గోల్కొండ రిసారట్స్‌కు వెళ్లి పిచ్చాపాటీ మాట్లాడుకుని భోజనం చెయ్యడం, ఇంటికి వెళ్లడం, మరునాడు మళ్ళీ అదే తంతు…కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు తక్కువ, నాయకులు ఎక్కువ. సర్పంచ్ గా కూడా చేయనివాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు ఆ పార్టీలో. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం మొదలవుతుంది. వారికి వారే వెన్నుపోట్లు పొడుచుకుంటారు. తమకు ముప్ఫయి సీట్లు కావాలని టీజేఎస్, తమకు నలభై కావాలని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. లేకపోతె తమ దారి తాము చూసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నాయి. ఆ రెండు పార్టీలకే అరవై డ్బ్బై స్థానాలు ఇచ్చి ఇక కాంగ్రెస్ పోటీ చేసేది ఎన్ని స్థానాలలో??? నవ్వు రావడం లేదూ? ఎన్నికలు అయ్యేంతవరకూ పరస్పరం కలహించుకోవడంలోనే కాలక్షేపం చేసే మహాకూటమి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం అయ్యేపనేనా?

ఇక తెలంగాణ రాష్ట్రసమితి విషయానికి వస్తే… శాసనసభను రద్దు చేసిన రోజే నూట అయిదు స్థానాలలో అభ్యర్థులను ప్రకటించి రాజకీయ పరిశీలనను విస్మయపరచిన కేసీఆర్ సారధ్యంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్నది. మిగిలిన స్థానాలకు నేడో రేపో అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఇందూరు సభలో ఎన్నికల పాంచజన్యాన్ని పూరించిన కేసీఆర్ ఆ తరువాత నల్లగొండ, వనపర్తి సభల్లో దుమ్మురేపారు. తనదైన శైలిలో మహాకూటమికి ముచ్చెమటలు పోయించారు. కేసీఆర్ విమర్శలకు జవాబులు చెప్పుకోలేని నిస్సహాయ స్థితికి ప్రతిపక్షాలను నెట్టేశారు. ఈరోజు వరకు కేసీఆర్ ను ఎలా ఎదుర్కోవాలో, ఎలా సమాధానం చెప్పాలో తెలియని అసందిగ్ధస్థితిలో ప్రతిపక్షాలు కూరుకుని పోయాయి. అన్ని జిల్లాల్లో గులాబీ హోరు, జోరు ఎవ్వరూ అందుకోలేనంతగా ఉవ్వెత్తున వేస్తున్నది.

అభ్యర్థులు, కార్యకర్తలు ప్రచారంలో అందరికంటే ముందంజలో ఉన్నారు. ఎవరిలో చూసినా ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. గత నాలుగున్నర ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకుంటూ తెరాస ఓట్లు అడుగుతుండగా, ప్రజలకు ఏమని చెప్పి ఓట్లు అడగాలో మహాకూటమికి అర్ధం కావడం లేదు. అర్ధం పర్ధం లేని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడానికి తెగబడుతున్నది. లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని, ఉద్యోగుల తల్లితండ్రులకు పింఛన్ ఇస్తామని కల్లబొల్లి వాగ్దానాలు చేస్తూ అపహాస్యం పాలవుతున్నది. విశ్వసనీయతను రుజువు చేసుకున్న కేసీఆర్ వాగ్దానాలను నమ్ముతారా లేక విశ్వసనీయత లేశమాత్రం కూడా లేని మహాకూటమి మాటలను జనం నమ్ముతారా అనేది రాబోయే ఎన్నికలు తెలుస్తాయి.

ఇక నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి పన్నెండు ప్రశ్నలను సంధించారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకుని, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసి, ఏడు మండలాలను కాజేసి, హైకోర్టు విభజనను అడ్డుకుంటున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం ఏవిధంగా నైతికమని హరీష్ రావు వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ నుంచి సమాధానమే లేదు. కళ్ళముందు కనిపిస్తున్న సంఘటనలను మసిపూసి మారేడుగాయ చెయ్యడం ఎలా సాధ్యం అవుతుంది? కాంగ్రెస్ పార్టీ పట్ల అంతో ఇంతో సానుభూతి కలిగినవారు కూడా కాంగ్రెస్, టీజేఎస్ పార్టీలు తెలుగుదేశం తో పొత్తు పెట్టుకోవడాన్ని అసహ్యించుకుంటున్నారు. ఈ ఎన్నికలు ప్రతిపక్షాలకు గతంలో ఎన్నడూ చూడని పరాభవాన్ని మిగల్చ బోతున్నాయి.

* ఇలపావులూరి మురళి మోహన రావు
(రాజకీయ విశ్లేషకులు) 

There is surely Defeat to the opposition