Home సినిమా ముచ్చటగా మూడోసారి

ముచ్చటగా మూడోసారి

Balaiahవెంకటేష్‌తో చేసిన ‘బాబు బంగారం’ తర్వాత మరో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయలేదు నయనతార. అడపాదడపా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పలకరిస్తున్నప్పటికీ… వాటికి పెద్దగా స్పందన రావడం లేదు. మళ్లీ ఇన్నాళ్లకు మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకు సైన్ చేసింది ఈ బ్యూటీ. బాలకృష్ణ సరసన మరోసారి మెరువనుంది నయనతార. ఈ  హిట్ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు విజయవంతమైన సినిమాలు వచ్చాయి. 2010లో బాలకృష్ణ సరసన ‘సింహా’లో  నటించిన నయనతార… 2011లో ‘శ్రీరామరాజ్యం’ సినిమా చేసింది. ఇప్పుడు మరోసారి ఈ స్టార్ హీరో సినిమాలో ఆమె దర్శనమివ్వనుంది. బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్‌పైకి రాబోతున్న సినిమాలో నయనతారను హీరోయిన్‌గా తీసుకున్నారు. నిజానికి తన వందో సినిమాలోనే నయన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాడు బాలకృష్ణ. ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో కాల్షీట్లు కేటాయించలేకపోయింది ఈ భామ. ఇప్పుడు తన 102వ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే ప్రకటించిన ఈ ప్రాజెక్టును ఈ నెలాఖరున ప్రారంభిస్తారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఈ సినిమాకు ‘రెడ్డిగారు’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం.