Home లైఫ్ స్టైల్ కుంచె నుంచి ఉట్టిపడే గ్రామీణ సౌందర్యం

కుంచె నుంచి ఉట్టిపడే గ్రామీణ సౌందర్యం

They are interested in the art of life on the canvas

వారికి కళలపై ఉన్న ఆసక్తి కాన్వాస్‌పై ప్రాణం పోస్తున్నాయి… వారు వేసిన పెయింటింగ్‌లు గ్రామీణ ప్రాంతాలకు సజీవశిల్పంగా మారుతున్నాయి. వారి చిత్రాల్లో ఎక్కువగా గ్రామీణ సౌందర్యమే తొణికిసలాడుతోంది…చారిత్రక ప్రదేశాల కళ్లకు కట్టినట్టుగా వారు గీసే చిత్రాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. వారిద్దరూ కవలలు. ఒకరికొకరు తోడుగా ఎలా ఉంటున్నారో వారు గీసే చిత్రాలు కూడా ఒకదానిని మించి మరొకటి సజీవ చిత్రాలుగా నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆశతో ముందడుగు వేస్తున్నారు. ఎవరైనా ప్రోత్సహిస్తే కచ్చితంగా తమ పెయింటింగ్‌లతో రాష్ట్రానికి, దేశానికి పేరు, ప్రతిష్టలు తీసుకొస్తామని వారు పేర్కొంటున్నారు. సుచేత, సుచీర్‌లు ప్రస్తుతం పెయింటింగ్ ఆర్టిస్ట్‌లుగా ప్రతిభను చూపుతూనే, చదువులోనూ రాణిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుకుసాగుతున్నారు. వారు జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నారో, ఎలాంటి ఆలోచనలకు రూపం ఇవ్వాలనుకుంటున్నారో మనతెలంగాణతో ముచ్చటించారు..

ఊహలకు, ఆలోచనలకు పదును
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన వేంగళ మధుసూదన్, పద్మ దంపతులు. కొన్ని సంవత్సరాల క్రితం కీసర మండల పరిధిలోని నాగారం గ్రామంలోని సత్యనారాయణ కాలనీలో స్థిరపడ్డారు. వారికి సుచేత, సుచీర్ కవలలున్నారు. వారిద్దరూ ఆరవ తరగతి నుంచే పెయింటింగ్‌పై ఆసక్తి కనబరచడంతో వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. మొదటగా క్రేయాన్ పెయింటింగ్‌తో తమ ఆలోచనలకు తుది రూపునిచ్చి అంచలంచెలుగా ఆక్రాలిక్(కాన్వాస్)పై పెయింటింగ్ వేసే స్థాయికి వారు ఎదిగారు. 4 సంవత్సరాల కాలంలో ఈ కళను వారు వంటబట్టించుకున్నారు. వారిద్దరూ తమ కుంచెతో చిత్రాలను ప్రాణం పోస్తున్నారు. తమ ఊహాలను, ఆలోచనలను పదునుపెడుతూ చూపురులను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం చిత్రలేఖనంలో పేరు పొందిన యాప్రాల్‌కు చెందిన నారాయణ వద్ద 4 సంవత్సరాలుగా సలహాలు, సూచనలు తీసుకుంటూ తమ ప్రతిభకు మరింత పదునుపెడుతున్నారు.

మరిన్ని చిత్రాలు కాన్వాస్‌పై గీయడానికి…
వీరిది మధ్య తరగతి కుటుంబం… అయినా ఏడాదికి సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చు చేసి రంగులు, బోర్డులు ఇతర సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. తమ సృజనాత్మకతను జోడించి పలు చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. పాఠశాలలకు సెలవులు రాగానే మరిన్ని చిత్రాలను కాన్వాస్‌పై గీయడానికి మొగ్గుచూపుతు న్నారు. ఇదంతా తమ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాము చిత్రలేఖన రంగంలో రాణిస్తున్నామని వారు పేర్కొంటున్నారు. దాతలు సహకరిస్తే తాము వేసిన పెయింటింగ్‌లను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తామని వారు పేర్కొంటున్నారు.

2013 చెన్నైలో గ్లోబల్ ఆర్ట్ నిర్వహించిన జాతీయ స్థాయి కలర్ క్యాంపు పోటీల్లో సుచేత, సుచీర్ వేసిన పెయింటింగ్ ద్వితీయ బహుమతి సాధించింది. పెయింటింగ్‌లో బ్లాక్ పెన్సిల్, క్రెయాన్, క్రెయాన్ షెడింగ్ వాటర్ కలర్, అక్రిలీక్ రంగులతో చిత్రాలను వేస్తూ వివిధ స్థాయిలో రాణిస్తున్నారు. దీంతోపాటు చాలా అవార్డులను వారు గెలుచుకున్నారు. 2013 సంవత్సరంలో సుచేత గోల్డ్‌మెడల్‌ను సాధించారు.

కళ.. కలగా మారకుండా మరిన్ని మెళకువలు…
ఇది మొదటి నుంచి అబ్బిన కళ అని దీంతో పాటు వేరే రంగంలో కూడా రాణించడానికి తమ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు వారు పేర్కొంటున్నారు. తాము అనుకున్న లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇప్పటినుంచే దానికి తగిన విధంగా ప్రణాళికలను వారు రూపొందించుకుంటున్నారు. తమకు నచ్చిన, వచ్చిన కళను కలగా మారకుండా దానికి మరింత మెరుగులు దిద్దుతూ ముందుకు సాగుతున్నారు. గురువు ఇచ్చే సలహాలను, సూచనలను పాటిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే చిత్రాలను వేయడానికి వారు ముందుకెళుతున్నారు. ఇప్పటివరకు వారిద్దరూ 3వేల రకాల వివిధ పోటీల్లో పాల్గొన్నారు. అందులో బిగ్‌బజార్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, క్యామ్‌లిన్ కంపెనీలతో పాటు తదితర సంస్థలు నిర్వహించిన పోటీల్లో వారిద్దరూ పాల్గొని గెలుపే లక్షంగా ముందుకు దూసుకెళుతున్నారు. ప్రస్తుతం వారిద్దరూ 10వ తరగతి చదువుతున్నారు. పెయింటింగ్‌లో ఉన్న శ్రద్ధను చదువులోనూ చూపిస్తున్నారు. అక్కడ వెనుకబడకుండా ముందుకు సాగుతున్నారు.

ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణిస్తా
చదువు, పెయింటింగ్‌తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించాలని లక్షం నిర్ధేశించుకున్నా. పెయింటింగ్‌లో రాణించేందుకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల సహకారం ఎప్పటికి మరువలేను. అదే విధంగా తమ గురువు ఇచ్చిన సలహాలు, సూచనలతో పెయింటింగ్‌లో రాణిస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులను, రివార్డులను గెలుచుకోవాలన్న తపనతో కృషి చేస్తున్నా.
 – వేంగళ సుచేత, పెయింటర్, 10వ తరగతి

మెకానిక్ రంగలో రాణిస్తా
మెకానిక్ రంగంలో రాణించడానికి కృషి చేస్తున్నా. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించుకుంటున్నా. చిన్నతనం నుంచే వ్యర్థపదార్ధాలను ఉపయోగించి కార్లను తయారుచేస్తున్నా. ఇదే స్ఫూర్తితో తల్లిదండ్రుల సహకారంతో కొత్త పరికరాలను రూపొందించే విషయమై మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. పెయింటింగ్ అంటే నాకు ప్రాణం. త్వరలో ఆయిల్ పెయింటింగ్ పై దృష్టి సారిస్తా. దీనిని నేర్చుకోవడానికి 4 సంవత్సరాలు పడుతుంది. దానిపై పూర్తిగా పట్టు సాధిస్తా. మరిన్ని అవార్డులను గెలుచుకుంటా.
– వేంగళ సుచీర్, పెయింటర్

                                                                                                                                         – ఎల్. వెంకటేశం
మనతెలంగాణ ప్రతినిధి