Home జాతీయ వార్తలు ప్రాంతీయ పార్టీల ఐక్యతా మంత్రం!

ప్రాంతీయ పార్టీల ఐక్యతా మంత్రం!

బిజెపిని చిత్తు చేసేందుకు ఏకతాటిపైకి,కర్నాటక పరిణామాల తర్వాత మారుతున్న వైఖరులు,

CM-KCR

న్యూఢిల్లీ: కర్నాటక పరిణామాల అనంతరం ప్రాంతీయ పార్టీలు ఐక్యతా మంత్రం పఠిస్తున్నాయి. కలిసి ఉంటే కలదు బలం, బిజెపికి ఉండదు అవకాశం అని తేల్చుకున్నాయి. ఈ దశలోనే జాతీయ పార్టీ కాంగ్రెస్ వైఖరిలో సడలింపు ధోరణి ఉండాలని సూచిస్తున్నాయి. కర్నాటక ఎన్నికలలో జెడిఎస్‌కాంగ్రెస్ పొత్తు ఫలించిన తరుణంలో ప్రాంతీయ పార్టీలు మరింత ఉత్సాహానికి పుంజుకున్నాయి. కర్నాటకలో బిజెపి ఎత్తులను జిత్తులను కూటమితో దెబ్బతీయడం కీలక పరిణామంగా మారింది. ఇప్పటివరకూ ఎదురులేకుండా ఉన్న అమిత్ షా ఎన్నికల , అధికార స్థాపన వ్యూహాలను ఐక్యతా ఆయుధంతో దెబ్బతీశామని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇక తరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పరిస్థితిని బేరీజు వేసుకుని కర్నాటకలో తక్కువ సీట్లు వచ్చిన జెడిఎస్‌తో ఘట్‌బంధన్‌కు దిగడం కీలకంగా మారింది. ఇంజన్‌గానే ఉంటానంటూ భీష్మించుకున్న కాంగ్రెస్ చివరికి బోగీగా కూడా నిలిచి, బిజెపి చిత్తుకు ఉపకరించడం రాజకీయ కీలక పరిణామంగామారింది. కర్నాటకలో కాంగ్రెస్ అధికారం కోల్పొవడం కన్నా, అక్కడ బిజెపిని అధికారంలోకి రాకుండా చేయగలగడంలో కీలకపాత్ర పోషించడం ప్రధాన అంశం గా మారింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు జాతీయ స్థాయి రాజకీయాలలో మార్పుల ఘట్టంలో కర్నాటకం మైలురాయిగా మారనుంది. కర్నాటక అసెంబ్లీలో బల నిరూపణలో యడ్యూరప్ప చతికిలపడిపోవడం బిజెపిని కుంగదీసింది. మూడు రోజుల వ్యవధిలోనే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాల్సి రావడం, కాంగ్రెస్‌జెడిఎస్ సర్కారు ఏర్పాటుకు దారితీయడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. యడ్యూరప్ప పతనం దశలో ప్రాంతీయ పార్టీల నేతల నుంచి కర్నాటక నేతలకు అభినందనలు వెలువడ్డాయి.

కాంగ్రెస్ సముచిత చర్య : పవార్

రాష్ట్రంలో అధికార స్థాపనకు జెడిఎస్‌కు కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇవ్వడం పట్ల సీనియర్ నేత శరద్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది విజ్ఞత గల చర్య అని అభినందించారు. జెడిఎస్‌తో పోలిస్తే ఎక్కువ స్థానాలు వచ్చినా కాంగ్రెస్ ఇప్పుడు వేరే పార్టీ వారికి సిఎం పదవిని వదలడం కీలకమైన పరిణామం అని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. రాహు ల్ గాంధీ సముచిత వైఖరితోనే కర్నాటకలో బిజెపికి కళ్లెం పడిందని పవార్ తెలిపారు. అయితే బెంగాల్ సిఎం మమత బెనర్జీ తమ స్పందనలో రాహుల్‌ను ప్రస్తావించలేదు. కర్నాటక విజయం కేవ లం ప్రాంతీయ కూటమికే చెందుతుందని వ్యా ఖ్యానించారు. ప్రజాస్వామ్యం గెలిచింది. కర్నాటక ప్రజలకు శుభాకాంక్షలు, దేవెగౌడజీకి, కుమారస్వామి జీకి, కాంగ్రెస్‌కు ఇతరులకు అభినందనలు . ఇది ఖచ్చితంగా ప్రాంతీయ ఫ్రంట్ విజయం అని ఆమె సందేశం వెలువరించారు.

కాంగ్రెస్ సారథ్యంపై అసమ్మతి?

మమత బెనర్జీ, ఇతర నేతల వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రతిపక్షాల విస్తృత వేదికకు కాంగ్రెస్ సారథ్యంపై వ్యతిరేకత స్పష్టం అయి ంది. బిజెపిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల ఉమ్మ డి వేదిక అవస రం అని పలు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. అయితే కాంగ్రె స్ నాయక త్వం ఉండటంవల్ల ప్రయోజనం ఉండదని ప్రాం తీయ పార్టీల నేత లు స్పష్టం చేస్తున్నా రు. ఈ పరిణామం నిజానికి ప్రతిపక్ష ఐక్యతకు గండిగా మారుతుంది.

కాంగ్రెస్ వైఖరిలో మార్పు రావాలనేదే వాదన

కాంగ్రెస్ నేతలలో ఉండే అంతా తామే అనే వైఖరిలో నిర్థిష్టంగా ఇప్పటికైనా మార్పు రావాలని ప్రాంతీయ పార్టీల నేతలు కోరుతున్నారు. ఇది ఒక చారిత్రక అవసరం అని వారు సూచిస్తున్నారు. మహా కూటమి ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ మరింత ఉదారంగా వ్యవహరించాలని, అప్పుడే ఆ పార్టీకి కూడా మేలు జరుగుతుందని చెపుతున్నారు. బిజెపిని తెరవెనుక ఉన్న సంఘ్ పరివార్‌ను దెబ్బతీయాలంటే కాంగ్రెస్‌లోనే పట్టువిడుపులు అవసరం అని సిపిఐ నేత డి రాజా తెలిపారు. ప్రతిపక్ష ఫ్రంట్‌కు ఎవరు నాయకత్వం వహించాలనే దానిపై సమిష్టి నిర్ణయం ఉండాలని సూచించారు. కానీ ముందుగా ఫ్రంట్‌ను పటిష్టం చేసుకోవాలని, సారథి ఎవరనేది తరువాతి విషయం అని తేల్చిచెప్పారు. కర్నాటక ఎన్నికల సమయంలోనే రాహుల్ గాంధీ చేసిన ఒక ప్రకటన ప్రతిపక్షాలలో కలవరం పుట్టించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీకి మెరుగైన సీట్లు దక్కితే తామే ప్రధాని అభ్యర్థిని అవుతామని చెప్పారు. దీనిపై పవార్ ఇతర నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. చివరికి బిజెపికి, కాంగ్రెస్‌కు రాజకీయ పెత్తనం వైఖరిలో తేడా ఏమీ లేదని స్పందనలు వ్యక్తం అయ్యాయి. అయితే కర్నాటక పరిణామం తో కాంగ్రెస్‌కు ఐక్యత విషయం లో నిర్ఠిష్ట ఫలితా లు ఎదురయ్యాయి. ప్రాంతీయ పార్టీలను సం తృప్తిపర్చడం జరిగితేనే కాంగ్రెస్‌కు మేలు ఉంటుందని పార్టీ భావిస్తోంది. జెడిఎస్‌కు అనుబంధంగా కూడా ఉండేందుకు కాంగ్రెస్ సిద్ధపడటం ఆ పార్టీ నేతలలో వచ్చిన కీలక మార్పునకు నిదర్శనంగా భావిస్తున్నారు.

కలిసికట్టుగా బిజెపిని దెబ్బతీస్తాం : రాహుల్

బిజెపిని అన్ని స్థాయిలలో ఓడించేందుకు ప్రతిపక్షాలు సమిష్టిగా సమన్వయంతో వ్యవహరిస్తాయని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ వ్యాఖ్యానించారు. కర్నాటక పరిణామాల తరువాత ఆయన దేవెగౌడను కొనియాడుతూ ప్రకటన వెలువరించారు. సంకీర్ణ విజయంలో పెద్ద పాత్ర దేవెగౌడదే అని తేల్చిచెప్పారు. కలిసికట్టుగా బిజెపిని దెబ్బతీస్తామనే రాహుల్ వ్యాఖ్యలు పార్టీ వైఖరిలో సడలింపును ప్రతిఫలిస్తాయా? లేదా అనేది ముందుముందు తేలుతుం ది. బిజెపియేతర శక్తులన్నీ కలిసికట్టుగా సాగాల్సి ఉందని సందేశాలు వెలువరిస్తున్న నేతలు ఎందరో ఉన్నారు. డిఎంకె నేత స్టాలిన్ , శరద్ యాదవ్, కెసిఆర్, చంద్రబాబు నాయుడు, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ వంటి వారెందరో కర్నాటక పరిణామాలపై వెలువరించిన స్పందనలు ఆద్యంతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.