Home స్కోర్ ఈ జోరు సాగాలి ఇలాగే!

ఈ జోరు సాగాలి ఇలాగే!

INDIAN-Teamమన తెలంగాణ క్రీడా విభాగం
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో టీమిండియా రోజు రోజుకు అత్యంత బలమైన జట్టుగా ఎదుగుతుందనడానికి శ్రీలంకపై భారత విజయమే ఓ నిదర్శనంగా చెప్పవచ్చు. గతంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు మాత్రమే ఇలా ఏకపక్ష విజయాలు సాధించేవి. ప్రస్తుతం భారత్ కూడా ఈ రెండు జట్ల బాటలోనే నడుస్తోంది. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. భారత్ సాధించిన మూడు విజయాల్లో కూడా సమష్టితత్వం దాగివుంది. గతానికి భిన్నంగా ఒక ఆటగాడిపైనే ఆధారపడకుండా కలిసికట్టుగా పోరాడి భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత్ సమష్టిగా రాణించింది. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్‌తో మొదలుకుని టయిలెండర్ల వరకు తమవంతు పాత్ర పోషించారు. బౌలింగ్‌లో కూడా ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు సమష్టిగా రాణించారు. ఇది భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిందని చెప్పాలి. ప్రారంభ మ్యాచ్‌లో శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లిలు అద్భుత ఆటను కనబరిచారు. తర్వాతి మ్యాచ్‌లో అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలు జట్టును ఆదుకున్నారు. చివరి మ్యాచ్‌లో శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు జట్టుకు అండగా నిలిచారు. ఇలా ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరూ జట్టును ముందుండి నడిపించారు. ఇది జట్టుకు శుభపరిణామంగా చెప్పవచ్చు. గతంలో శ్రీలంక గడ్డపై భారత్‌కు టెస్టుల్లో చేదు అనుభవాలు ఎదురైన విషయం తెలిసిందే. ఈసారి ఆ లోటు ఎక్కడా కనిపించలేదు. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన టీమిండియా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
కనీస పోటీ లేకుండానే..
ఈ సిరీస్‌లో భారత్‌కు ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన కూడా ఎదురు కాలేదనే చెప్పాలి. మూడు మ్యాచుల్లో కూడా భారత్ సునాయాస విజయాలే సాధించింది. తొలి రెండు మ్యాచులను నాలుగు రోజుల్లో గెలుచుకున్న టీమిండియా మూడో టెస్టును మాత్రం రెండున్నర రోజుల్లోనే ముగించడం విశేషం. గతంలో ఏ భారత జట్టు కూడా సాధించని అరుదైన రికార్డును ఈసారి టీమిండియా సొంతం చేసుకుంది. శ్రీలంకపై వారి సొంత గడ్డపై క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా కోహ్లి సేన కొత్త చరిత్ర సృష్టించింది. చివరి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా వంటి అగ్రశ్రేణి ఆటగాడు లేకుండానే భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించడం సామన్య విషయం కాదు. అది కూడా లంక సొంత గడ్డపై అంటే మాటలు కాదు. దీన్ని బట్టి భారత జట్టు ఎంత బలోపేతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ వంటి అగ్రశ్రేణి ఆటగాడు సైతం పెవిలియన్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా పేరొందిన రోహిత్‌కు మూడు టెస్టుల్లోనూ జట్టులో చోటు దక్కలేదు. భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మల వంటి స్పీడ్‌స్టర్లు కూడా బెంచ్‌లకే పరిమితం కాక తప్పలేదు. ఇక జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం కెఎల్.రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్‌ల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొంది. అభినవ్ ముకుంద్ కూడా తుది జట్టులో స్థానం కోసం తహతహలాడుతున్నాడు. మరోవైపు టెస్టుల్లో తుది జట్టులో స్థానం కోసం టీమిండియా ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది.
సమరోత్సాహంతో వన్డేలకు..
టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆడిన టీమిండియా వన్డే సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. కీలక ఆటగాళ్లంద రూ ఫాంలో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు మెరుపులు మెరిపించేందుకు తహతహలాడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ లో అద్భుతంగా ఆడిన వీరిద్దరూ ఈసారి కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. టెస్టుల్లో తుది జట్టులో చోటు సంపాదించడంలో విఫలమైన రోహిత్ వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్‌ను కూడా మిడిలార్డర్‌లో బరిలోకి దించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇదే జరిగితే మనీష్ పాండేకు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది. కాగా, శ్రీలంకపై వన్డేల్లో అద్భుత రికార్డు కలిగిన టీమిండియా ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కొ నసాగించాలని భావిస్తోంది. అంతేగాక ఛాంపియన్స్ ట్రో ఫీలో శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీ ర్చుకోవాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ వి భాగాల్లో టీమిండియా చాలా బలంగా ఉంది. దీంతో కోహ్లి సేన మరో క్లీన్‌స్వీప్ దృష్టి పెట్టింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆదివారం తెరలేవనుంది. అన్ని మ్యాచుల్లో కూడా గెలిచి చరిత్ర సృష్టించాలనే లక్షంతో కోహ్లి సేన వన్డేలకు సిద్ధమవుతోంది. సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో బలహీనంగా మారిన లంకకు భారత్‌తో సిరీస్ ఓ సవాలుగా మారిందనే చెప్పాలి. ఇప్పటికే టెస్టుల్లో ఘోర పరాజయం చవిచూడడంతో లంక తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో భారత్‌తో జరిగే వన్డే సిరీస్ ఆతిథ్య లంకకు చావోరేవోగా మారిందనడంలో సందేహం లేదు.