Home ఎడిటోరియల్ టిఆర్‌ఎస్‌కు తొలిపరీక్ష

టిఆర్‌ఎస్‌కు తొలిపరీక్ష

TRS-Logoవరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులందరూ నామినేషన్‌లు దాఖలు చేశారు. దాదాపు 18మాసాల క్రితం కొత్తరాష్ట్రంలో తొలిగా అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్‌కిది తొలి పరీక్ష. ఉప ఎన్నికను అవసరం చేసింది కూడా ఆ పార్టీయే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కడియం శ్రీహరి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే రాష్ట్రప్రభుత్వంలో వైద్య-ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్న రాజయ్యను కొన్ని ఆరోపణల కారణంగా తొలగించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రివర్గంలో సామాజిక పొందికల పరిరక్షణ నిమిత్తం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవటంవల్ల ఉప ఎన్నిక అవసరమైంది. ఈ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పక్షాలు సీరియస్‌గా తీసుకుని అభ్యర్థుల ఎంపికపై పెద్ద కసరత్తు చేశాయి. టిఆర్‌ఎస్ ‘తెలంగాణ తల్లి’ రూపశిల్పి పసునూరి దయాకర్‌ను ఎంపిక చేయటం ఇతర ఆశావహుల్లో అసంతృప్తి కలిగించినా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నలుగురికీ నచ్చచెప్పి సర్దుబాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయివరకు అభిప్రాయసేకరణ జరిపి, చివరకు మాజీ ఎంపి, సిరిసిల్ల రాజయ్యకే టిక్కెట్ ఇచ్చింది. కీ॥శే॥ జి.వెంకటస్వామి కుమారుడు, మాజీ ఎంపి జి.వివేక్‌ను నిలబెట్టాలన్న ప్రయత్నాలను ఆయన సున్నితంగా తిరస్కరించటంతో రాజయ్య ఆటోమాటిక్ ఛాయిస్ అయినారు. బిజెపి-టిటిడిపిలతోకూడిన ఎన్‌డిఎ కూటమి సుదీర్ఘచర్చల అనంతరం ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ పగిడిపాటి దేవయ్య అభ్యర్థిత్వంపై అంగీకారానికి వచ్చారు. గత ఎన్నికల్లో పొత్తు ప్రకారం ఈ నియోజకవర్గంలో బిజెపి పోటీచేసింది. ఈ పర్యాయం పోటీచేయాలని టిడిపి తహతహలాడినప్పటికీ, పెద్దలు మిత్రధర్మం పాటించాలని నిర్ణయించటంవల్ల అభ్యర్థిత్వం బిజెపికి దక్కింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా పోటీచేస్తున్నది.
ఈ ఉప ఎన్నికలో ప్రత్యేకించి చెప్పుకోదగిన అంశం వామపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ నిర్ణయించటం. రాష్ట్రంలో 10వామపక్షపార్టీలు కలిసి రాజకీయ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థిని రంగంలో దించాలని ముందుగా నిర్ణయించాయి. ప్రజాగాయకుడు గద్దర్‌ను నిలబెట్టాలని వామపక్షాలు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. వినోద్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని వామపక్షాలతో పాటు ప్రజా, సామాజిక సంఘాలు కూడా బలపరుస్తున్నాయి.
వరంగల్ నగరం, దాని చుట్టుపట్ల అసెంబ్లీ విభాగాలతోకూడిన పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయంగా చైతన్యయుతమైన ప్రాంతం. వామపక్ష భావజాలానికి కూడా ఇది ముఖ్యమైన ప్రాంతం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రముఖంగా నిలిచింది. ఉస్మానియా యూనివర్శిటీ తదుపరి కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు ముందుపీఠీన ఉన్నారు. తెలంగాణకు సాంస్కృతిక కేంద్రమనదగినది ఓరుగల్లు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో పట్టణ ఓటర్లకన్నా గ్రామీణ ఓటర్లే అధికం. వరంగల్ నగరాభివృద్ధికి ప్రభుత్వం చేబట్టిన కార్యక్రమాలు, కేంద్రం ప్రారంభించిన స్మార్ట్‌సిటీ, అమృత్‌వంటి పథకాల్లో వరంగల్ చేరి వుండటం, వీటికితోడు గా తమ ‘మిషన్ కాకతీయ’, వాటర్‌గ్రిడ్ వంటి బృహత్ పథకాలు తమ అభ్యర్థిని సునాయాసంగా గెలిపిస్తాయన్న ధీమా టిఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ, ఏమాత్రం తాత్సారం పనికిరాదని, సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించింది. తమ ప్రభుత్వ పాలనపై ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని భావిస్తున్నది. కాగా ప్రతిపక్షాలు టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, వాగ్దాన భంగాలు, రైతుల ఆత్మహత్యలు, పెరుగుతున్న ధరల నియంత్రణలో వైఫల్యం, అన్నిటికీ మించి ముఖ్యమంత్రి ఏకపక్షపాలన తీరుపై విమర్శలు సంధించటం ద్వారా టిఆర్‌ఎస్‌ను నిలువరించాలని భావిస్తున్నాయి. సాధారణంగా, ఉప ఎన్నికలు పాలక పార్టీపట్ల మొగ్గుచూపుతాయి. ఎందుకంటే ఆ పార్టీ అభ్యర్థికి అర్ధబలం, అంగబలం పుష్కలంగా ఉంటాయి. బహుముఖ పోటీ, ఎంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే తప్ప, ఆ అభ్యర్థికే లాభిస్తుంది. అయితే గత లోక్‌సభ ఎన్నికల తదుపరి ఉప ఎన్నికల్లో యు.పి., బీహార్‌లలో బిజెపి అరడజను సిట్టింగ్ సీట్లు కోల్పోయింది. ఓటర్ల మనోగతం పసిగట్టటం చాలాకష్టం. టిఆర్‌ఎస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేక ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు ప్రజల్లో “ప్రభుత్వ వ్యతిరేక” భావన ఏర్పడిందా-తెలుసుకునేందుకు ఈ ఉప ఎన్నిక కొలబద్ద కానుంది. కాబట్టి ఇక పాలకపార్టీ, ప్రతిపక్షాలు రెండింటికీ కీలకమే.