Search
Sunday 23 September 2018
  • :
  • :

ఇంజినీరింగ్‌కు ఇదే చివరి ఎంసెట్?

eng

 వచ్చేసారి జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష
 విద్యార్థులకు తగ్గనున్న పరీక్షల భారం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌కు ఇదే చివరిది కానుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. జాతీయస్థాయిలో నిర్వహించే జెఇఇ మెయిన్ ద్వారానే ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటిలతోపాటు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కళాశాలల్లోని సీట్లను భర్తీ చేసే అంశంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది నుంచి జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించాలని భావించినా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడంతో వాయిదా పడింది. వచ్చే ఏడాది అమలుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా సేకరించి బాధ్యతను ఎఐసిటిఇకి అప్పగించింది.
విద్యార్థులకు ఉపశమనం
ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష అమలులోకి వస్తే వివిధ ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ సీటు కోసం ఒక్కో విద్యార్థి కనీసం ఐదారు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఒక్కో పరీక్షకు ఒక్కో రకమైన సిలబస్ ఉంటుండంతో ఏ పరీక్షపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఇంజినీరింగ్ కళాశాలలు సరైన ప్రమాణాలు పాటించడం లేదన్న భావనతో వేలాదిమంది విద్యార్థులు కనీసం 3-4 డీమ్డ్ వర్సిటీల ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. అలాగే ఎన్‌ఐటి, ఐఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌తో పాటు తెలంగాణ, ఎపి ఎంసెట్ పరీక్షలకూ హాజరవుతున్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ‘నీట్’ తరహాలో జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష అమలులోకి వస్తే విద్యార్థులు, తల్లిదండ్రుల ఇబ్బందులు తగ్గుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజి విధానం ఉంది. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో ఒకే పరీక్ష నిర్వహిస్తే అందులో వెయిటేజి ఉంటుందా..? లేదా..? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని, తమ అభిప్రాయాన్ని ఎఐసిటిఇకి లేఖ రాయనున్నట్లు తెలిసింది.
ఎంసెట్‌కు తగ్గనున్న ప్రాధాన్యత
ఎంసెట్ నుంచి వైద్య విద్య తొలగిపోవడంతోనే ఈ పరీక్షకు ప్రాధాన్యత తగ్గగా, ఇంజనీరింగ్ కోర్సులు కూడా తొలగిస్తే ఎంసెట్ ప్రాధాన్యత మరింతగా తగ్గుతుంది. ప్రస్తుతం ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ, బి.ఎస్సీ(అగ్రికల్చరల్), వెటర్నరీ కోర్సులలో సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇందులో బి.ఎస్సీ(అగ్రికల్చరల్), వెటర్నరీ కోర్సులకు డిమాండ్ ఉండగా, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు మాత్రం అంతగా డిమాండ్ ఉండటం లేదు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ డిమాండ్ పడిపోతుండటంతో ఎంసెట్ అవసరమే లేదన్న అభిప్రాయలూ వ్యక్తమవుతున్నాయి. ఇంజనీరింగ్‌లో కొన్ని కళాశాలలు మినహా మిగతా కళాశాలల్లో ప్రతీ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. ఏటా ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉంటున్నాయి.

Comments

comments