Home కలం సమాజ హితం కోసమే ఈ కవిత్వం

సమాజ హితం కోసమే ఈ కవిత్వం

Dimak-Kharab

సాహిత్య ప్రక్రియలో కవిత్వం మార్మికతగా వస్తు వును చెప్పడం ఒకప్పటి ఆనవాయితీ. సంప్రదాయ కవిత్వం గ్రాంధిక భాషను వాహికగా చేసుకొని జీవిం చింది, ప్రజల భాషలో కవిత్వం రాయటం మొదలయి నప్పుడు అభ్యుదయ కవిత్వం, మార్క్సిస్టు భావజాలంతో కూడిన కవిత్వం వచ్చింది. మండల్ కమీషన్ ఉద్యమం తరువాత మహాత్మ జ్యోతీరావ్ ఫూలే, డా.అంబేద్కర్‌ల భావజాలంతో కవిత్వం రావటం ఆరంభమయింది. నానీల ప్రక్రియ మొదలయింది.
ఎన్ని రకాల కవిత్వం వచ్చినా సాహిత్యానికి వస్తువు అంతిమంగా మనిషితో మొదలై, మనిషితోనే ముగిస్తుందనే అభిప్రాయం బహుజనవాదంతోనే వచ్చింది. ఎందుకంటే, మార్క్సిజానికి సమాజం ముఖ్యం, మనిషి (వ్యక్తి) రెండవ అంశంగా గుర్తిస్తుంది. సామూహికత్వానికి ప్రాధాన్యత తగ్గి కుల సమూహాలను గుర్తించడం, వారి కష్టనష్టాలకు కారణాలను వెతకడం ఆరంభమైంది. ఇది భారత దేశానికి వున్న ప్రత్యేకమైన కులం, అది సృష్టించి అఘాతాలను వెలుగులోకి తెచ్చింది.
ఆధునిక సమాజ విమర్శకు అద్భుతమైన నిర్వచనం ఈ “దిమాక్ ఖరాబ్‌” పుస్తకం. ఆధునిక సమాజం మన ముందు ఎన్ని సౌకర్యాలు ఏర్పరుస్తుందో, అంత కంటే ఎక్కువే మన దగ్గర నుండి అన్ని రకాలుగా దోపిడీ చేస్తుంది. అది అన్ని సందర్భాలలో బహిరంగంగా కనిపించదు, కొన్ని సార్లు ఎవరు మన స్వేచ్ఛ, మన హక్కులను తీసివేస్తున్నారో, దానికి యజమాని ఎవరోకూడా అర్ధం కాదు. పెట్టుబడిదారీ సమాజం ఇలాగే వుంటుంది, ఇందులో మనిషిని, మనిషి దోపిడి చేసుకొని బతకటం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పుతుంటారు. ఇలాంటి సమాజాన్ని ఎంతో ఓర్పుతో, నేర్పుతో తనదైన శైలితో రచనలు చేసిన మోహన్ రుషి కవి, విమర్శకుడు, దార్శనికుడు.
ఇందులోని ఒక్కో వాక్యంతో ఒక్కో వ్యాసాన్ని రాయవచ్చు. అంత లోతుగా వుంది కవి పరిశీలన. ఈ పుస్తకంలోని మొట్టమొదటి వ్యాఖ్య “ఉద్యమ ఫలాలు ఫ్రూట్ మార్కెట్లో దొరకవంటే వినవు కదా?!” తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన పరిణామాలను ఒక్క వాక్యంతో చెప్పాడు. ఉద్యమంలో ముందుండి పోరాడడం వేరు, ఉద్యమం సఫలం అయినాక అందులో భాగస్వామ్యం కావడం అందరివల్ల కాదు అనేది మన ముందున్న సత్యం. ఎన్నడు ఉద్యమంలో లేనివాళ్ళు, ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు, ఉద్యమంలో ఏనాడు ముందుండని, త్యాగాలు చేయని అగ్ర కుల సామాజిక వర్గం ఈ రోజు పాలక పక్షంలో ముందుంది, పాలకులకు సలహాదారులుగా ముందు వరుసలో వున్నారు. “చేప, మందు ఫ్రీగా ఇచ్చినప్పుడే, బంగారు తెలంగాణ వచ్చినట్టు!” తెలంగాణకు ప్రత్యేకమైన చేపమందు ఉచిత పంపిణీ పథకాన్ని, ఒక “కామా” గుర్తుతో దాని అర్థమే మార్చిన భాష రచయిత ప్రావీణ్యానికి చిహ్నం.“ఇంజనీరింగ్ విద్య ఇప్పుడు మోక్షగుండం కాదు, అగ్ని గుండం!” ఈ వ్యాఖ్య ఆధునిక సమాజం మనిషిలో ఎన్నో ఆశలు రేపుతుంది. నా కొడుకు, నా బిడ్డ ఇంజనీరు అని, పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి అని గొప్పగా చెప్పుకునే రోజు పోయింది. ఇప్పుడు నాకొడుకు, నాబిడ్డ ఇంజనీరింగ్ చేసిండు కానీ ఉద్యోగం రాలేదు.
ఇందులో తప్పెవరిది చదివిన విద్యార్థిదా, నాణ్యత లేని కాలేజీలు నడిపిన యాజమాన్యాలదా, లేక కండ్లుమూసుకొని వున్న ప్రభుత్వాలదా! ఇదే మోహన్ రుషి ఆవేదన అంతర్లీనంగా వుంది.“నేతల్ని మించిన కళాకారులు వుండే అవకాశం లేదు!” ఇంత కంటే గొప్ప సెటైర్ రాజకీయ వ్యవస్థ మీద వెయ్యగలమా. ఒక సామాజిక అంశాన్ని ఒక పేజీ వివరించినంతగా దాన్ని కుదించి ఒక వ్యాఖ్యలో చెప్పటం అనే కళ “మైక్రో ఆర్టు” ఈ వ్యాఖ్యకు ఎన్ని వివరణలు, ఉదాహరణలు అయినా ఇవ్వవచ్చు. రాజకీయ వ్యవస్థ మీద మరో సెటైర్ “రాజ్యాంగేతర శక్తుల్ని రాజ్యాంగ శక్తులుగా మార్చడమే ప్రజాస్వామ్యం!” ఇప్పుడున్న హిందూ భావజాలంతో కూడుకున్న రాజ్యాధికార వ్యవస్థ చేస్తున్న అన్ని చట్ట వ్యతిరేక దాడులమీద ఒక సెటైర్.
“బుద్ధి మంతుడిగా వుండడమంత బుద్ధి లేనితనం లేదు!” ఈ దేశంలో బుద్దిమంతుడు అంటే ఎవరు అనే ప్రశ్న ముందు వేసుకొంటే దీనికి అర్థం వస్తుంది. ఈ దేశంలో బుద్దిమంతుడు కులం ఆధిపత్యాన్ని, మతం ఆధిపత్యాన్ని, జెండర్ వివక్షను ప్రశ్నించకుండా వుండేవాడు బుద్దిమంతుడు అంటుంది. మన ప్రస్తుత కుల, మత, వర్గ, జెండర్ సమాజం. ఒక వేళ ప్రశ్నిస్తే సమాజం దృష్టిలో చెడిపోయినవాడు, సంప్రదాయ వ్యతిరేకి అంటుందీ ఈ సమాజం.ఇలా ఎన్ని వ్యాఖ్యలు తీసుకొని అయినా విశ్లేషించవచ్చు. మోహన్ రుషి ఈ రచనలు విమర్శ కోసమే రాయలేదు అనేది నా అభిప్రాయం. రచయిత తనకు కనపడిన సమాజాన్ని ప్రజలకు పరిచయం చేస్తూనే దాని అవలక్షణాలనుబట్ట బయలుచేసే క్రియ మొదల వుతుంది. ఈ పుస్తకం ఆధునిక సమాజ అవలక్ష ణాలతో పాటుగా దాని ఎంత వరకు వీలైతే అంత లోతుగా మన ముందుంచాడు. మన పని ఈ పుస్తకం చదివి ఎంత వరకు జ్ఞానాన్ని పెంచు కుంటామో అంత సూటిగా సమాజాన్ని, రాజ్యాన్ని, మనిషిలోని అవ లక్షణాలను ప్రశ్నించగలం.