Search
Wednesday 14 November 2018
  • :
  • :

కస్తూర్బాల్లో ఇంటర్

This year's inter-classes are a little late

వేగవంతంగా ఖాళీల భర్తీ ప్రక్రియ
పిజిసిఆర్‌టి, సిఆర్‌టి, ఎస్‌ఓ పోస్టుల నియామకం
ఈ ఏడాది ఇంటర్ తరగతులు కొద్దిగా ఆలస్యం
మంచిర్యాల, తాండూర్ విద్యాలయాల్లో ఇంటర్
ప్రభుత్వ నిర్ణయాన్ని సద్వినియోగం చేసు కుంటున్న విద్యార్థులు

మన తెలంగాణ/మంచిర్యాల: బడి మానేసిన గ్రామీణ నిరుపేద బాలికలకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్న కస్తూర్బా విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యను ప్రవేశపెట్టింది. జిల్లాలో మంచిర్యాల, తాండూర్ కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ కొనసాగించేందుకు నిర్ణయించారు. దీంతో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కస్తూర్బా విద్యాలయాల్లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థినీలకు బయటకు వెళ్లకుండా అదే కస్తూర్బా విద్యాలయాల్లో ఉచిత వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బడుగు బలహీన వర్గాల విద్యార్థినీల కోసం దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 2004లో కస్తూర్బా విద్యాలయాలను ప్రారంభించింది. ఇందులో ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు నిర్వహించేందుకు కేంద్రం నిధులు అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో పదవ తరగతి వరకు కొనసాగిస్తుంది. కస్తూర్బాలో మెరుగైన బోధన అందిస్తుండడంతో విద్యార్థినీలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం నుంచి ఇంటర్ విద్యను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థినీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ విద్యలో భాగంగా కస్తూర్బా విద్యాలయాల్లో గత కొన్ని ఏళ్లుగా ఉన్న ఖాళీల భర్తీకి అవకాశం లభించింది. గతంలో ఖాళీలతో పాటు ఇటీవల పలు ఉద్యోగాలకు ఎంపికైన సిఆర్‌టి పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కస్తూర్బాల్లో ఇంటర్ విద్యకు అవసరమైన పిజిసిఆర్‌టిల పోస్టులను కూడా సంబంధిత శాఖ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం మంచిర్యాల, తాండూర్ విద్యాలయాల్లో ఇంటర్ విద్యకు అనుమతులు రాగా ఇప్పటికే ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకున్నారు. ఈనెల 25 నుంచి తరగతులను ప్రారంభించాలని భావించినప్పటికీ ఈ సంవత్సరం పిజిసిఆర్‌టిల నియామక ప్రక్రియలో ప్రభుత్వం మార్పులు చేయడం వలన కొద్దిగా తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. నియామకాల ప్రక్రియను వేగవంతం చేసిన అధికారులు జులై రెండోవ వారం లోపు తరగతులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని మంచిర్యాల, తాండూర్ కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ విద్య కోసం 14 కొత్త పోస్టులను మంజూరు చేశారు. ప్రతి గ్రూపుల్లో 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. జిల్లాలో 14 మంది పిజిసిఆర్‌టిలు అవసరం ఉండగా ఇందు కోసం 356 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఎంపిక ప్రక్రియను ఈనెల 25లోపు పూర్తి చేసి, తరగతులను ప్రారంభించాలని భావించినప్పటికీ తాజాగా సంబంధిత శాఖ సంచాలకులు కొత్త నిబంధనలతో ఉత్తర్వులను జారీ చేశారు. ఇంటర్ విద్యకు అవసరమైన పిజిసిఆర్‌టిలతో పాటు కస్తూర్బాల్లో ఖాళీగా ఉన్న ఎస్‌ఓ, సిఆర్‌టి, పిఈటి పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వులతో దరఖాస్తులు చేసుకున్నవారు సైతం మళ్లీ అన్‌లైన్ ద్వారా కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదిఏమైనా కస్తూర్బాల్లో ఇంటర్ తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి.

Comments

comments