Home జాతీయ వార్తలు మోడీ షా ద్వయంతో దేశానికి ముప్పు

మోడీ షా ద్వయంతో దేశానికి ముప్పు

నాలుగేళ్ల పాలనపై కాంగ్రెస్ విశ్లేషణ, 40 ప్రశ్నల సంధింపు

Gulam-Nabi-Azad

న్యూఢిల్లీ : మోడీషా ద్వయం దేశానికి హానికరం అని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలకు దిగింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న దశలో కాంగ్రెస్ స్పందించింది. అన్ని రంగాలలో మోడీ ప్రభు త్వం ఘోరంగా విఫలం అయిందని కాంగ్రెస్ పేర్కొంది. బిజెపి అంటే బిట్రేయల్ జనతా పార్టీ లేదా విద్రోహపు వంచనల పార్టీ అని మండిపడింది. ద్రోహం , జిత్తులు, ప్రతీకారం, అసత్యాల కలయికగా బిజెపి ప్రభుత్వం మారిందని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉధృత స్థాయిలో దాడికి దిగింది. ప్రధాని మోడీ సంక్లిష్ట మనస్తత్వపు వ్యక్తి అని, దేనిపైనా సరైన సుదీర్ఘ శ్రద్ధ వహించే రకం కాదని రాహుల్ తేల్చిచెప్పారు. ఎన్‌డిఎ ప్రభుత్వ పనితీరు పూర్తిగా వైఫల్యాల మయంగా మారిందని విమర్శించారు. నాలుగేళ్ల పాలనపై రాహుల్ తమ ప్రొగ్రెస్ రిపోర్టును జారీ చేశారు. ఇందులో వివిధ రకాలుగా గ్రేడ్‌లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో మోడీ ప్రభుత్వానికి ఎఫ్ గ్రేడ్ ఇచ్చారు. ఇక విదేశాంగ విధానం, ఉద్యోగ సృష్టిలో కూడా ఇదే స్థాయిలో ఉం దని, అయితే ఊకదంపుడు నినాదాల కల్పన, గప్పాలు కొట్టుకోవడంలో ఎ గ్రేడ్ ఇస్తున్నట్లు తెలిపారు.

వివిధ రంగాలకు సంబంధించి ఈ రిపోర్టులో ఇచ్చిన గ్రేడ్‌లు ఈ విధంగా ఉన్నాయి. యోగా, తమను తాము గొప్పగా చెప్పుకోవడంలో ఎక్కువ మార్కులు, తరువాతి స్థానంలో వ్యాఖ్యలు, మాటలు చెప్పడం, పొంతన లేని వైఖరి, దేనిమీదా శ్రద్ధ లేకపోవడం వంటి వాటికి మార్కులు దక్కాయని ఇందులో తెలిపారు. ఇక మోడీ పాలనపై కాంగ్రెస్ పార్టీ తరఫున విడిగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. దేశంలో భయోత్పాత వాతావరణం నెలకొందని, విద్వేషం రెచ్చగొడుతున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, రణదీప్ సూర్జేవాలా ఏకంగా 40 ప్రశ్నలను సంధించారు. నాలుగేళ్ల పాలన సందర్భంగా కాంగ్రెస్ విద్రోహ దినం పాటించింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశంలో నెలకొన్న వాతావరణంపై కాంగ్రెస్ పార్టీ తరఫున లఘుచిత్రం విడుదల చేశారు. నాలుగేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం ప్రజలకు చివరికి మిగిల్చింది కేవలం విద్రోహం, జిత్తులమారితనం, ప్రతీకారం, అవాస్తవాలు అని వెల్లడైందని, ప్రజలు వీటిని గ్రహించారని తెలిపారు. దేశంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై దాడుల పట్ల గులాం నబీ ఆజాద్ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశ భద్రత అత్యవసరం అని , ఇందులో రాజకీయాలు తగవని, అయితే దీనిని ప్రాతిపదికగా చేసుకుని మోడీ ఎన్నికలలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఓట్లు కొట్టేశాడని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. జాతీయ భద్రత అనేది పలు కోణాలలో ఉంటుందని, ఇది కేవలం ప్రాదేశిక భద్రతకు సంబంధించిందే కాదని, బడుగులు, మైనార్టీలు, ఎస్‌సి, ఎస్‌టిలు ఈ విధంగా అన్ని వర్గాల వారూ భయం లేకుండా ఉండగలగాలని తేల్చిచెప్పారు. ఏమీ లేని వారు భద్రంగా ఉండగల్గుతున్నారా? లేదు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందా? లేదు, మీడియా భద్రంగా ఉందా? అది కూడా లేదని ఆజాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రధాని మోడీ వాగాఢంరపు ప్రసంగాలతో నెగ్గుకు వస్తుండవచ్చునని, ఛలోక్తులు, పిట్టకథలతో కాలం గడుపుతూ ఉండొచ్చునని, అయితే ఇవి ఎంతకాలం సాగుతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ తెలిపారు.  మోడీ చివరికి కశ్మీర్ వంటి అంశాలను కూడా వివిధ చోట్ల ఎన్నికల సమయాలలో వాడుకున్నారని గులాం నబీ ఆజాద్ విమర్శించారు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జమ్మూ కశ్మీర్‌లో అత్యధిక సంఖ్యలో పౌరులు , జవాన్లు బలి అయ్యారని తెలిపారు. బ్యాంకులకు భారీ స్థాయిలో రుణాల ఎగవేతదార్ల గురించి ఏమంటారు? ప్రజల ఖాతాలలోకి రూ 15లక్షల ధనం జమ ఎప్పుడు? రాఫెల్ డీల్‌తో ప్రభుత్వ ఖజానాకు పడిన భారం ఎంత? రైతుల రుణమాఫీలపై బిజెపి ఎందుకు మౌనంగా ఉంటోంది? పంట  బీమా కంపెనీలకు బిజెపి ఎందుకు వెన్నుదన్నుగా ఉంటోంది? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల మాట ఏమైంది? దేశంలో వివిధ ప్రాంతాలలో పరీక్షల మాఫియాకు ప్రధాని సాయం ఎందుకు అందించారు? వంటి అంశాలతో  కాంగ్రెస్ మొత్తం 40 ప్రశ్నలను సంధించింది.