Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) ‘మెట్రో’ స్టేషన్‌కు ముప్పు

‘మెట్రో’ స్టేషన్‌కు ముప్పు

నాగోల్ మెట్రో రైల్వేస్టేషన్ కింద పగిలిన జలమండలి పైప్‌లైన్
ఆరు నెలలుగా కిలోమీటర్ పొడవునా ఆగని లీకేజీ
నీటిలో నానిపోతున్న స్టేషన్ పిల్లర్లు, రోడ్లు శిథిలం, రెండు హైటెన్షన్
స్తంభాలకు ప్రమాదం అయినా స్పందన లేని వివిధ శాఖల అధికారులు
శాఖల మధ్య సమన్వయ లోపమే పెద్ద సమస్య

Metro

మన తెలంగాణ/ ఉప్పల్ : ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపంలో నిర్మించిన నాగోల్ మెట్రోస్టేషన్‌కు ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొంటున్నాయి. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా అభివృద్ధి పనుల్లో ఆటంకంతో ప్రజలు నానాయాతనలు పడుతున్నారు. జలమండలి, జిహెచ్‌ఎంసి, పోలీస్, ఫైర్‌శాఖ, రెవిన్యూ శాఖలతో పాటు మరికొన్ని అత్యవసర సర్వీసులు ఆయా శాఖలకు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే 24 గంటల్లో యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశాలున్నా అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడడం లేదు. అసలే భాగ్యనగరంలో నిర్మాణ దశలోనే ఉన్న బ్రిడ్జిలు, హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఎప్పుడు కూలిపోతాయోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.

ఇటీవల కొత్తగా నిర్మాణం చేపట్టిన నాగోల్ మెట్రో రైల్వేస్టేషన్ కింద జలమండలి ట్రాన్స్‌మిషన్ డివిజన్ పెద్దలైను పగిలి నీరు లీకేజీ అవుతోంది. గత ఆరు నెలలుగా ఇదే తీరు. లీకేజీ కారణంగా ఇక్కడ పెద్ద గుంత ఏర్పడింది. దీంతో అక్కడేవున్న మెట్రో స్టేషన్ పిల్లర్లు కుంగిపోయే ప్రమాదం పొంచివుంది. పైగా, లీకేజీ అయిన నీరు కిలోమీటర్ దూరం వరకు ప్రవహిస్తుండడంతో రోడ్డంతా శిథిలమైంది. కొంతదూరం హైవే రోడ్డులో వెళ్తే అక్కడ పెద్దలైను లీకేజీతో గల్లీ రోడ్డంతా పాడయింది. అదే ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ రెండు స్తంభాలు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం స్థానికులను వెంటాడుతోంది. అసలే నగరంలో ఏ బ్రిడ్జిలు ఎప్పుడు కూలిపోతాయో, ఏ భవనాలు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయాందోళన నెలకొంది.

మెట్రో రేల్వే స్టేషన్ కింద జలమండలి పెద్ద పైప్‌లైన్ లీకేజీ అయి ఆరె నెలలు దాటుతున్నా అటు జలమండలి వివిద విభాగాల అధికారులు, కమిషనర్లు, జిహెచ్‌ఎంసి, విద్యుత్ అధికారులు, నేషనల్ హైవే, ఇరిగేషన్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్, ఆర్‌టిసి అధికారులు కాని పట్టించుకోక పోవడం శోచనీయం. ఆయా శాఖల్లో జిఎంలు, ఎజిఎంలు, ఎస్‌సి, డిఇలు, ఎడిలు, ఎఇలు, డిప్యూటీ కమిషనర్లు ఇంతమంది అధికారులున్నా, లక్షల పైబడి జీతాలు తీసుకున్నా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. లీకేజీ నీటిలో ఉండడంతో మెట్రోస్టేషన్ పిల్లర్లు, హై టెన్షన్ స్థంభాలు ఎప్పుడు కూలీపోతాయోనని బాటసారులు, భయాందోళనకు గురవుతున్నారు.
ఉప్పల్ రింగురోడ్డు నాగోల్ బస్టాప్ సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్‌లో జలమండలి ట్రాన్స్‌మిషన్ డివిజన్ పెద్ద పైపులైన్ పగిలి రోడ్డుపైన ఆరునెలలు పైబడింది. జలమండలి ట్రాన్స్‌మిషన్ డివిజన్ పెద్ద పైపులైన్ ద్వారానే తాగునీరు వెలుగుగుట్ట, మౌలాలి హౌసింగ్ బోర్డు, సైనిక్‌పురి రిజర్వాయర్లకు వెళ్లి అనంతరం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఆయా పట్టణ ప్రాంతాలకు వస్తుంది.

కాని ఎక్కడి నీరు అక్కడే లీకేజీలు అయితే తాగునీరుకు ఇబ్బందులే. కాని ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్లో జలమండలి పెద్ద పైపులైన్ లీకై మెట్రో స్టేషన్ బస్టాండ్‌లో పెద్ద గొయ్యి ఏర్పడింది. మెయిన్ రోడ్డంతా పాడై నలువైపులా కిలోమీటర్ దూరం నీరు పారుతూ లింకురోడ్లన్ని పాడవుతున్నా సంబంధిత అధికారులకు చిత్త శుద్ది లేకపోవడం గమనార్హం. ఈ విషయమై ‘మన తెలంగాణ’ జలమండలి, విధ్యుత్,జీహెచ్‌ఎంసి అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో పలు మార్లు సంప్రదించినా “మాకు సంబంధం లేదు నే ను లెటర్ పెట్టా… నేను లెటర్ పెట్టా” అని తప్పించుకోవడమే తప్ప వారు చేసింది శూన్యం. ఇండియన్ బ్యాంకు వద్ద లీకేజీ కోసం 33 కేవి స్తంభాలు కూలి పోతాయని జలమండలి వారు, వారు పనిచేస్తామంటే మేము వద్దాన్నామా అని విద్యుత్ అధికారులు, ట్రాఫిక్‌ను మళ్లిస్తామని పోలీసులు,తాత్కలికంగా బస్టాండ్ మారుస్తామని ఆర్‌టిసి వారు అయినా ఒకరికి ఒకరికి పొంతన లేని మాటలతో కాలం వెల్లబుచ్చుతున్నారు. దీంతో మెట్రో రైల్వే స్టేషన్ కింద పిల్లర్లు గుంతలో నిలిచిన నీరు ప్రవాహానికి పిల్లర్లు కుంగి మెట్రో స్టేషన్ కూడా కుంగిపోయే ప్రమాదం ఏర్పడింది.

జలమండలికి సహకరిస్తాం

ఉప్పల్ టూ నాగోల్ రోడ్డులో ఇండియన్ బ్యాంకు వద్ద 33 కేవి పెద్ద పోల్స్ వద్ద సైతం తాగునీరు పెద్ద పైపులైన్లు లీకయి వాటర్ పారడంతో అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్టా సంబంధిత ఎఇ వినోద్‌ను వివరణ కోరడంతో తనకు ఒక్కరోజు ముందు చెబితే తాను లైన్ బంద్ చేసి తమ ఉద్యోగులంతా సహకరిస్తామని చెప్పారు. తనకు ఇంతవరకు జలమండలి వారు ఈ విషయమే చెప్పలేదన్నారు.

– ఎఇ వినోద్, విద్యుత్ 33 కెవి

లీకేజీని త్వరలో బాగుచేస్తాం మెట్రోస్టేషన్ కింది వాటర్ లీకేజీ కోసం జలమండలి జిఎం దశరథ రెడ్డిని ‘మన తెలంగాణ’ వివరణ కోరగా ఆ ప్రాంతంలో లీకేజీ అయి పెద్ద గుంత పడ్డ విషయం విదితమే. కాని ఆ పనుల కోసం రూ.5.8 లక్షల టెండర్లు వేశామని, టెండర్లు పూర్తయ్యాయని త్వరలో పనులు చేపడుతామన్నారు.

– జిఎం దశరథరెడ్డి, జలమండలి

రోడ్లన్నీ పాడయ్యాయి మెట్రో రైల్వేస్టేషన్ ఉప్పల్ రింగు రోడ్డులో తాగు నీరు లీకయి తమ ఇంటర్నల్ రోడ్లు నలుదిక్కులు నీరు పారడంతో తమ రోడ్లన్ని పాడయ్యాయని పలు మార్లు జలమండలి వారికి వివరించినా కాని ఇంతవరకు స్పందన లేదని ఈ విషయం కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని ఉప్పల్ డిసి విజయ్ కృష్ణ సమాధానం ఇచ్చారు.

– ఉప్పల్ డిసి, విజయ్ కృష్ణ