Home జాతీయ వార్తలు మూడు దిగ్గజ కంపెనీలు డీలాపడ్డాయ్!

మూడు దిగ్గజ కంపెనీలు డీలాపడ్డాయ్!

ITన్యూఢిల్లీ: గత వారం టాప్-10 కంపెనీల్లో మూడు కంపెనీలు భారీగా మార్కెట్ విలువ(ఎం-క్యాప్)ను కోల్పోయాయి. సుమారు రూ.51,472 కోట్లు ఈ సంస్థలు విలువను కోల్పోగా, వీటిలో ఐటి దిగ్గజం టిసిఎస్ కంపెనీ పెద్ద మొత్తంలో నష్టపోయాయి. మిగత ఏడు కంపెనీలు మార్కెట్ విలువను పెంచుకున్నాయి. మూడు దిగ్గజ కంపెనీలైన టిసిఎస్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మాల నష్టంతో మొత్తంగా ఎం-క్యాప్ తగ్గింది. వీటిలో టిసిఎస్ విలువ రూ.30,324.88 కోట్లు పడిపోయి రూ.4,87,868.11 కోట్లకు చేరింది. ఈ కంపెనీ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ఆశించినంతగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందారు. దీంతో స్టాక్ విలువ పడిపోయింది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.17,020.36 కోట్లు తగ్గి రూ.2,51,228.32 కోట్లకు చేరగా, మరోవైపు సన్‌ఫార్మా విలువ రూ.4,127.03 కోట్లు పతనమై రూ.2,13,980.32 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్ ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో డాలర్ రెవెన్యూ అంచనాను తగ్గించింది. దీంతో కంపెనీ షేరుపై మదుపర్లలో నిరుత్సాహం ఏర్పడింది. వీటికి విరుద్ధంగా మిగతా ఏడు కంపెనీలు రూ. 36,413.3 కోట్లను పెంచుకున్నాయి. వీటిలో ఎస్‌బిఐ భారీగా మార్కెట్ విలువను పెంచుకుంది.