Home ఎడిటోరియల్ ఆకలి మరణాలు సిగ్గుచేటు

ఆకలి మరణాలు సిగ్గుచేటు

Three years old sister of ten sisters hungry dead

దేశ రాజధాని ఢిల్లీ మహానగరం శివారులో పార్లమెంటు భవనానికి 12 కిలోమీటర్ల దూరంలో పదేళ్లలోపు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆకలి మహమ్మారికి బలికావటం యావద్దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషాదం; ప్రపంచం లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం నెత్తిపై సమ్మెట పోటు. రాజకీయ ఆరోపణల్లో మునిగితేలుతున్న రాజకీయ వ్యవస్థ ఈ ఘోర ఉదంతంపై కూడా పరస్పర నిందారోపణలకు దిగటం అవమానకరం, హాస్యాస్పదం. ప్రజలు పన్నులరూపేణా చెల్లించే సొమ్ముతో డంబాచార ప్రచారం చేసుకుంటూ ఓట్లకు గాలమేస్తున్న పాలక పార్టీలు పేదరికం నిర్మూలనలో తామెక్కడున్నామో వాస్తవాలు తనిఖీ చేసుకో వలసిన అవసరం గూర్చి ఈ ఘటన హెచ్చరిక చేస్తున్నది. 20 కోట్ల మంది ప్రజలు అర్ధాకలితో, ఒక్కొక్కసారి ఆహారం లేకుండా నీళ్లుతాగి నిద్రలోకి జారుకుంటున్నట్లు సర్వేలు హెచ్చరిస్తున్నాయి.ఇటీవల విడుదలైన ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి నివేదిక, 2016, ప్రకారం మన దేశం ర్యాంక్ 159 దేశాల్లో 131. శ్రీలంక (73), చైనా (90) ర్యాంకులతో ఉన్నత అభివృద్ధి తరగతి దేశాల్లో ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల కొలబద్దతో చూచినపుడు మన దేశ జనాభాలో 55 శాతం పేదరికంతో బాధపడుతున్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఆనంద సూచీలో మన దేశం స్థానం 2016లోని 118 నుంచి 2017లో 122కు దిగజారటం విచారకరం. దక్షిణాసియా దేశాల్లో, ఇరుగుపొరుగు సార్క్ దేశాల్లో మన దేశం అతితక్కువ ర్యాంక్‌లో ఉంది. వాస్తవాలు ఇలా ఉండటానికి మూలకారణం సృష్టి అయిన సంపద పంపిణీలో తీవ్రమైన అసమానత. సంపదలో 73 శాతం జనాభాలో 1 శాతం కుబేరుల బొక్కసాల్లోకి వెళుతున్న వాస్తవం విస్మరించరానిది. బిలియనీర్లు పెరగటం మన ‘అభివృద్ధి’ ఘనతగా చంకలు చరుచుకుం దామా? 20 కోట్ల మంది అర్ధాకలితో జీవచ్ఛవాల్లా బతుకుతున్నందుకు సిగ్గుపడదామా? ఆలోచించాలి.
ఢిల్లీలో ముగ్గురు చిన్నారులు ఆకలి మరణం అధికారుల గణాంకాలు, పాలకుల ‘అభివృద్ధి’ మంత్రతంత్రాలకు భిన్నంగా దారిద్య్ర తాండవానికి నిప్పులాంటి నిదర్శనం. రిక్షా పుల్లర్ కుటుంబానికి చెందిన ముగ్గురు బిడ్డలను (మాన్సి8సం., శిఖా 4, పరుల్ 2) అమాయకురాలైన తల్లి మరో స్నేహితురాలి సహాయంతో మంగళవారం మయూర్ విహార్‌లోని లాల్‌బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తెచ్చేసరికే వారు చనిపోయారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్ల ప్రకారం, “వారి దేహాల్లో కండ మచ్చుకుకూడా లేదు. కడుపు పూర్తిగా ఖాళీగా ఉంది. 8-9 రోజులుగా ఆహారం తీసుకోనట్లుంది. ముఖాలు కోతి ముఖాల్లా జారిపోయాయి. ఒంటిపై గాయాలేమీ లేవు. పోషకాహారంలేమికి ఇది విలక్షణ నిదర్శనం.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంగళ్ కుటుంబం 1015 ఏళ్ల క్రితం పొట్టచేతబట్టుకుని ఢిల్లీ వచ్చి మందావలి ఫజల్‌పూర్‌లో నివసిస్తోంది. గత మూడు మాసాలుగా 13వ నెంబర్ గదిలో ఉన్న కుటుంబం, శనివారం ఒక మిత్రుని సహాయంతో అక్కడికి కొద్ది కిలోమీటర్లలోని గదికి మారింది. మంగళ్ రిక్షా పోవటంతో పని వెదుక్కుంటూ వెళ్లాడు. కొన్ని రోజులు ఇంటికి రాకపోవటం అతడికి అలవాటేనట. మద్యం ప్రియుడు కూడానట. అతడి కోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లుగా ఢిల్లీలో పేదలు నివసించే ప్రాంతంలో కాపురముంటున్న ఆ కుటుంబానికి రేషన్ కార్డు లేదా, చౌక గోధుమలు ఎందుకు అందటం లేదు. ఆ కుటుంబంలోని చిన్నారుల ఆకలి మరణానికి ఆమ్ ఆద్మీపార్టీ ఢిల్లీ ప్రభుత్వం బాధ్యత వహించాలని బిజెపి, కాంగ్రెస్ నిందించగా, రేషన్‌ను గడపగడపకు అందించే తమ ప్రభుత్వ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అడ్డుకోవటమే కారణమని ఆప్ ప్రభుత్వం ప్రత్యారోపణ చేసింది. స్థానిక ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణను ఆదేశించగా, కేంద్ర పౌర సరఫరాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ న్యాయ విచారణకు ఆదేశించారు.
ఈ విషాద ఘటన యావద్దేశానికీ హెచ్చరిక. ప్రభుత్వాలు పేదల్లోకెల్లా పేదలను గుర్తించి ఉచితంగా ఆహార పదార్థాల సరఫరాకు చర్యలు తీసుకోకపోతే, ఆహార భద్రత పథకాన్ని ప్రతి మారుమూలకూ చేర్చి సక్రమంగా అమలు జరపకపోతే ఢిల్లీలో లాంటి హృదయ విదారక మరణాలు ఎక్కడైనా సంభవించవచ్చు.ఢిల్లీ కాబట్టి ఈ మరణాలు వెంటనే వెలుగులోకి వచ్చా యి. అవే మారుమూల పల్లెల్లో సంభవిస్తే…? విషాదం సంభవించాక సానుభూతి ఏడ్పులు ఏడ్చేకన్నా అటువంటివి జరక్కుండా నిరోధించటమే పరిపాలనా సమర్థతకు గీటురాయి.