Home తాజా వార్తలు వేములవాడలో యువకుడి దారుణ హత్య..

వేములవాడలో యువకుడి దారుణ హత్య..

young man killed

 

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడలో నడిరోడ్డుపై వేట కొడవళ్లతో ఓ యువకుడిని దారుణంగా నరికి చంపిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేటకు చెందిన వారు దాదాపు 20ఏళ్ల నుండి వేములవాడలో నివాసం ఉంటున్నారు. మూడు నెలలుగా సుబ్రహ్మణ్యం నగర్‌లో అద్దెకు ఉంటు, తమ కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ఏడేళ్ల క్రితం రవి ఓ అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరూ ఇళ్లు విడిచి వేళ్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిద్దరి ఆచూకీ తెలుసుకుని వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించారు. అనంతరం ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగింది.

కొంతకాలం బాగానే ఉన్నప్పటికి ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య మళ్లీ చనువు పెరిగి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. అనంతరం విషయం తెలుసుకున్న మహిళ భర్త రవిని హతామర్చాలని, కిరాయి హంతకులతో కలిసి ప్లాన్ చేశాడు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం రవి బయటకు వెళ్లేందుకు వస్తుండగా అతని ఇంటికి కొద్ది దూరంలోనే మాటు వేసిన ముగ్గురు వ్యక్తులు రవిని నడిరోడ్డుపై వేట కొడవళ్లతో నరికి చంపేశారు.సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని బైక్‌లో ఇరుక్కుపోయి, గొడ్డలి గాట్లతో ఉన్న మృతదేహాన్ని తీయబోతుంటే, తీయవద్దంటూ రవి తమ్ముడు సరిల్, తల్లి దేవవ్వ, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతుని కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహానీ ఉందని వారు ఆవేధన వ్యక్తం చేశారు.

దీంతో డిఎస్ పి వెంకటరమణ ఈ ఘటనపై స్పందించి మీకు రక్షణ కల్పిస్తామని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇళ్లల్లోని సీసీ కెమెరా లో ఫుటేజ్ ల ఆదారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Three youth brutally killed a young man in vemulawada