Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఎత్తిపోతల పనుల్లో నాణ్యతకు తిలోదకాలు

crane

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : కోట్లాది రూపాయలు వెచ్చించి రైతుల పంట భూములకు సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఎత్తిపోతల పథకం నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ రైతుల భూములకు నీరు అందడం లేదు. పనుల్లో నాణ్యత లోపం కారణంగా చీటికి మాటికి పైపులైన్‌లు పగిలిపోవడం పలుచోట్ల లీకేజీల కారణంగా చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. పనుల్లో అక్రమాలు జరిగాయంటూ రైతు సంఘాల నాయకులు ఇటీవల హాజీపూర్, లక్షెట్టిపేట, గూడెంల వద్ద రాస్తారోకో చేశారు. నాసిరకం పైపుల వలన పలు లీకేజీల కారణంగా నీరు అందడం లేదని రైతులు కంట నీరు పెట్టుకుంటున్నారు. ఎత్తిపోతల పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి రైతుల కష్టాలు తీరలేదు. కడెం చివరి ఆయకట్టు  రైతుల సాగునీటి ఇబ్బందుల నేపథ్యంలో రూ.125 కోట్లతో గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని చేపట్టారు. 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పెట్టుకోగా కనీసం 50 శాతం భూములకు కూడా సాగునీరు అందడం లేదు. 11 కిలోమీటర్ల పొడవున పైపులైన్ నిర్మాణం చేపట్టగా ఆయ కట్టు పరిధి డి-30 నుంచి డి-42 వరకు ఏర్పాటు చేశారు. రెండు మోటర్ల ద్వారా 290 క్యూసెక్యుల నీటిని ఎత్తిపోస్తారు. గత యాసంగి సీజన్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎత్తిపోతల పథకం ద్వారా లక్షెట్టిపేట, హాజీపూర్, దండేపల్లి మండలాలోని చివరి ఆయకట్టు కూడా నీరు అందించడంతో గట్టెక్కారు. కాగా ఈ సంవత్సరం వర్షభావ పరిస్థితుల వలన కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే విషయంలో అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజులుగా ఎత్తిపోతల పథకం మోటర్లు కాలిపోవడం, పలుచోట్ల  పైపులైన్ లీకేజీల కారణంగా హజీపూర్ చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు అందడం లేదు. కడెం నీటిని విడుదల చేయాలని ఇప్పటికి ఎన్నో సార్లు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అధికారుల్లో చలనం కనిపించలేదు. దండేపల్లి మండలంలోని చింతపల్లి గ్రామ రైతుల ఆయ కట్టుకు ఎత్తిపోతల పథకం నీరు అందుతుందనే ఆశలో వరి పంటలు  చేసుకోగా ఎత్తిపోతల పథకం ద్వారా నీరు రాక పొలాలు ఎండిపోయాయని రైతులు వాపోతున్నారు. అదే విధంగా హాజీపూర్ మండలంలో రైతులు వరి నాట్లు వేసుకొని ఎత్తిపోతల పథకం నీటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎత్తిపోతల పథకం నీరు లీకేజీల కారణంగా హాజీపూర్ చివరి ఆయ కట్టు రాకపోవడం, మరోవైపు కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేసే విషయంలో అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో రైతులు ముందుకు సాగలేకపోతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పూర్తి చేసిన ఎత్తిపోతల పథకం నాసిరకం పనులతో తరచుగా మోటార్లు కాలిపోవడం పలుచోట్ల పైపులైన్‌ల లీకేజీ వలన ఆశించిన మేరకు ప్రయోజనాలు కలుగడం లేదని రైతులు వాపోతున్నారు. 30 వేల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్షంగా పెట్టుకున్న ప్రభుత్వం కనీసం 50 శాతం  పొలాలకు సాగు నీరు అందించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికి ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆందోళన చెందుతున్నారు. కడెం ప్రాజెక్టు నీటిని  విడుదల చేయకపోవడం వలన సాగునీరు అందక తీవ్ర నష్టాలకు గురవుతున్న సమయంలో ప్రభుత్వం స్పందించి గూడెం ఎత్తి పోతల పథకాన్ని నిర్మించగా తమ భూములకు సాగు నీరు అందుతుందని ఆశిస్తే కన్నీళ్లే మిగులుతున్నాయని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా వెంటనే పైపులైన్‌ల లీకేజీలను సవరించి చివరి ఆయకట్టుకు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments