Search
Wednesday 21 November 2018
  • :
  • :

థైరాయిడిజమ్‌తో ఒళ్లునొప్పులు?

Thyroid Gland Diseases and Problems

థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల తలెత్తే హైపోథైరాయిడిజమ్ బాధితుల్లో చాలామంది ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు వస్తున్నాయనీ చెబుతుంటారు. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా, తక్కువైనా నిస్సత్తువ, ఒళ్లునొప్పులు, బలహీనత వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా కాళ్లు, పాదాలు, చేతులు, వీపు భాగంలో నొప్పులు వస్తుంటాయి. కొందరిలో ఇవి మామూలుగా ఉంటే కొందరిలో తీవ్రంగానూ ఉండొచ్చు.
కాబట్టి ముందుగా థైరాయిడ్ హార్మోన్ స్థాయులు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవటం మంచిది. థైరాయిడ్ హార్మోన్ స్థాయులు తగినంతగా లేకపోతే మందుల మోతాదులను మార్చాల్సి ఉంటుంది. హైపోథైరాయిడిజమ్ అనేది చాలావరకు ఆటోఇమ్యూన్‌తో ముడిపడిన సమస్య. అంటే మన రోగనిరోధకశక్తి పొరపాటున మన శరీరం మీదే దాడి చేయటం వల్ల ముంచుకొచ్చే సమస్యన్నమాట. ఒక ఆటోఇమ్యూన్ సమస్య గలవారిలో ఇతరత్రా ఆటోఇమ్యూన్ సమస్యలు కూడా ఉండే అవకాశముంది. అందువల్ల రుమటాయిడ్ ఆర్రరైటీస్, ల్యూపస్ వంటి ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాలి. వీటిల్లోనూ ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు వస్తుంటాయి. కాబట్టి ఎముకలు గుల్లబారటం (ఆస్టియో ఆర్థ్రయిటిస్) కూడా ఉండి ఉండొచ్చు. ఇది వయసుతో పాటు వచ్చే సమస్య. ఇందులో క్యాల్షియం క్షీణించటం వల్ల ఎముకలు గుల్లబారుతుంటాయి. ఇది నొప్పులకు దారితీస్తుంది. నెలసరి నిలిచిన వారికి (మెనోపాజ్) ఎముకల్లో క్యాల్షియం మరింత వేగంగానూ క్షీణిస్తుంటుంది. ఎముక సాంద్రతను తెలిపే డెక్సా స్కాన్ పరీక్షతో దీన్ని నిర్ధరించొచ్చు.
విటమిన్ డి లోపం, ఐరన్ లోపంతోనూ ఒళ్లునొప్పులు రావొచ్చు. అవసరమైతే వీటి మోతాదులనూ చూడాల్సి ఉం టుంది. క్యాల్షియం, ఐరన్, విట మిన్ డి మాత్రలతో వీటి లోపాలను సరిచేసుకోవచ్చు. రోజూ కాసేపు చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవటం ద్వారా విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవచ్చు. నిపుణులైన వైద్యులను సంప్రదిస్తే కారణాన్ని గుర్తించి చికిత్స చేస్తారు.

Comments

comments