Home వార్తలు కోతి తెచ్చిన కమ్మని కబురు

కోతి తెచ్చిన కమ్మని కబురు

Tigerఅడవిలో పులి గాండ్రిస్తూ పరుగు తీసింది. వన్య ప్రాణులు తమ నివాసాలు వదలి వచ్చి పులి పరుగెత్తిన వైపు చూశాయి. పులికి ఇవాళ ఏమైంది?… ఏన్నడూ లేని విధంగా భీకరంగా గాండ్రిస్తూ పరుగు లంకించుకుంది? అంది కుందేలు. లేత వయసు లేడి ఏదైనా కనిపించిందేమో…దాన్ని చంపి కడుపు నింపుకోవాలన్న కోరికతో పరుగు తీసి ఉంటుంది అన్నది ఎలుగు. నిజమే…పాముకు కప్ప లాగా, పిల్లికి ఎలుక లాగా, కొంగకు చేప లాగా సింహానికి ఏనుగు మెదడు లాగా పులికి జింక మాంసం అంటే ఇష్టం. అందుకే ఆవురావురుమంటూ ఆత్రంగా వెళ్ళి ఉంటుంది అంది పంది.
పొట్ట నింపుకోవటానికి కంట పడ్డ ప్రాణిని మట్టు పెట్టడానికి పులి గుట్టుగా పోతుంది. కానీ గాండ్రిస్తూ ఎందుకు వెళ్తుంది?…అందువల్ల మరో కారణం ఏదైనా ఉండవచ్చు అంది ఉడుత. ఒంటె కడుపులో ఎప్పుడూ నీళ్ళు ఉడేట్టుగానే పులిలో ఎప్పుడూ కర్కశత్వం కరడు గట్టుకుని ఉంటుంది. అందుకే దాన్ని క్రూర మృగం అన్నారు. ఒకవేళ పక్క అడవిలో నుంచి మరో పులి ఏదైనా వచ్చి ఉంటే దానికంటే తాను మిన్న అనిపించుకునేందుకు దానితో పోరాడాలని పరుగు తీసిందేమో అంది మరో జంతువు. పొరుగున ఉన్న అడవి నుంచి మరో పులి రావడం లాంటిదేమీ ఉండదు. గుహలో తన పిల్లలు కనిపించకుంటే వేదనతో గాండ్రిస్తూ వెదకటానికి వెళ్ళిందేమో అంది జిరాఫీ తన పొడవాటి మెడను పులి వెళ్ళిన వైపు తిప్పుతూ. అడవి దున్నకు ఆశ్చర్యం వేసింది. పులి అంటే జంకని జంతువు ఉండదు. ఎందుకంటే అది ఎంతటికైనా తెగించే దుష్ట జంతువు. దాని పళ్ళు, గోళ్ళు చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది, అటువంటి దాని పిల్లలు కనిపించకుండా ఎక్కడికి పోతాయి? పులి పిల్లలు కనుక ఏ జంతువులూ వాటి జోలికి పోవు. పిల్లను వెదకటానికి పులి పరుగు తీసి ఉంటుందనటం సరికాదు అంది అడవి దున్న. దున్న మాటలు వాస్తవం అనిపిస్తున్నాయి. మరి పులి ఎందుకు పరుగెత్తినట్టు?…
గంతులేస్తూ అప్పుడే చెట్టు కొమ్మ కొనకు వచ్చిన కోతి నాకు తెలుసు… నేను ఇప్పుడే అక్కడినుంచి వచ్చాను అంది.
ఏమిటి నీవంటున్నది?…ఇంతకీ ఏం జరిగింది? అడిగింది జిరాఫీ ఆకులు నములుతూ.
ఒకమారు ఇద్దరు వేటగాళ్ళు పులిని తుపాకీ గొట్టాలతో కాల్చబోతే ఏనుగు ఆ ఇద్దరినీ తొండంతో బాది పులిని కాపాడింది. అప్పటినుంచి ఆ రెండింటికీ వల్లమాలిన స్నేహం. ఈ రోజు ఏనుగును నలుగురు దుండగులు గొలుసులతో బంధించబోతే ఏనుగు ఘీంకారాలు చేయసాగింది. వాటిని విన్న పులి కోపంతో రెచ్చిపోయి పట్టరాని ఆగ్రహంతో గాండ్రిస్తూ పరుగులు తీసి వారిపై దాడి చేసి ఏనుగును రక్షించింది… అని వివరించింది కోతి. సదా సాటి ప్రాణుల మేలు కోరే ఏనుగుకు ముప్పు తప్పిందని కోతి తెచ్చిన కమ్మని కబురుకు జంతువులన్నీ ఎంతగానో సంతోషించాయి.
నీతి…ఎదుటి వారి మేలు కోరుకుంటే ఎప్పటికైనా రక్షణ లభిస్తుంది.