*కొనసాగుతున్న విచారణ
*దోషులెవరైనా శిక్షార్హులే
*ఎఫ్ఆర్ఓ రాంమోహన్‌రావు
మన తెలంగాణ/బెజ్జూర్ : పులిచర్మం మాయంపై దోషులెవరైనా శిక్షకు అర్హులైనని ఎఫ్ఆర్ఓ రాంమోహన్ అన్నారు. కుమ్రం భీం జిల్లా బెజ్జూర్ అటవీ రేంజ్ పరిధిలో గత ఏడాది స్వాధీనపర్చుకున్న పులిచర్మం మాయమైనట్లు ఎఫ్ఆర్ఓ రాంమోహన్‌రావు తెలిపారు. ఈ విషయంపై ఫారెస్టు అధికారులను విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. 2016 నవంబర్ 21వ తేదీన బెజ్జూర్ రేంజ్ పరిధిలోని హేటిగూడ సమీపంలో ద్విచక్ర వాహనంపై పులిచర్మాన్ని తరలిస్తుండగా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు స్వాధీన పర్చుకున్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని ఆళ్లపల్లి నుండి పులిచర్మాన్ని ఇద్దరు వ్యక్తులు తీసుకువచ్చినట్లు అధికారుల విచారణలో తేలింది. మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో ఆ పులిని హతమార్చిన 13 మందిపై మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ పులిచర్మాన్ని అప్పట్లో బెజ్జూర్ రేంజ్ పరిధిలో ఎఫ్ఎస్ఓ వేణుగోపాల్ ఆధ్వర్యంలో భద్రపర్చారు. ఇటీవల వేణుగోపాల్ పోడు వ్యవసాయంలో రైతుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అతన్ని విధుల నుండి తొలగించారు. అతని స్థానంలో బెజ్జూర్ సెక్షన్ అధికారిగా జంజిరాల శ్రావన్కుమార్కు బాధ్యలు అప్పగించే తరుణంలో పులిచర్మం మాయం అయినట్లు వెల్లడైంది. ఈ విషయంపై ఎఫ్ఆర్ఓ రాంమోహన్‌రావును సంప్రదించగా పులిచర్మం మాయంపై అన్ని కోణాల్లో అటవీశాఖ సిబ్బంది, అధికారులను విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బీట్, సెక్షన్ అధికారుల కస్టడిలో పులి చర్మం ఉండగా ఇదెలా జరిగిందని వారు ప్రశ్నిస్తున్నారు. నిందితులు దొరికినట్లయితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు.