Home ఆఫ్ బీట్ సంతోషం సొంతం కావాలంటే…!

సంతోషం సొంతం కావాలంటే…!

 

సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఎవరికి తోచిన పద్ధతులను వారు పాటిస్తుంటారు. చాలా మంది లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే డబ్బు వుంటే చాలు, మంచి ఉద్యోగం వుంటే చాలు ఇలా రకరకాలుగా అనుకుంటారు. కానీ జీవితాన్ని సంతోషంగా గడపడానికి కావాల్సిన సౌకర్యాలు మాత్రమే వుంటే సరిపోదు. సంతోషాన్ని వస్తువులలో, డబ్బులో వెతకాల్సిన అవసరం కూడా లేదు. మీకు నచ్చింది చేస్తే సంతోషం మీ దరి చేరుతుంది. మీరు ఏది అనుకుంటే అది చేయండి, మీలా మీరుండండి అప్పుడు అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే సంఘటనలు మనల్ని చిక్కుల ముడిలో పడేసి ఆనందానికి దూరం చేస్తాయి. అలాంటి పరిస్థితులలో కూడా ముఖంపై చిరునవ్వుతో సంతోషాలను సృష్టించుకుంటూ ముందుకు సాగితే ప్రపంచంలో మన కన్నా గొప్ప వ్యక్తి ఎవరూ ఉండరు. అలాంటి జీవితం కోసం చిన్న చిట్కాలు మీకోసం.

ప్రేమను వ్యక్త పరచడానికి చాలా మార్గాలుంటాయి. కానీ మనం వ్యక్తపరిచే విధానం మన ఆత్మీయులను మరింత స్పెషల్‌గా ఫీల్ చెయ్యాలి. మనలోని భావాలను ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులలో తెలుపుతూ వారి మనస్సుకి దగ్గరగా వుండటానికి ప్రయత్నించాలి. అలాంటి మ్యాజిక్ జరగాలంటే వోల్డ్ ఈజ్ గోల్డ్ అన్న విషయాన్ని గుర్తుచేసుకొని ఉత్తరం ద్వారా మీ ప్రేమను వారికి తెలియజేయండి. మనసులో భావాలను అక్షర రూపంలో వండిస్తే ఇష్టపడని వారు ఎవరూ వుండరు. అందువల్ల ఇలాంటి వోల్డ్ ట్రెండ్స్‌తోప్రేమను తెలుపుతూ సరికొత్త సంతోషాలను చేరుకోండి.
మీకు సంతోషాన్ని కలిగించిన విషయాలను రాయండి:
ఈ ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త విరామం ఇచ్చి రోజులో మీ అనుభవాలను, సంతోషాన్ని కలిగించిన విషయాలను నోట్ చేసుకోండి. బాధలో వున్నప్పుడు ఒక్కసారి మీకు సంతోషాన్ని పంచిన విషయాలను చదవండి. మీ ముఖంలోని విచారం కాస్త ఆనందంగా మారిపోతుంది.
బ్రేక్ ఫాస్ట్‌ని మరవకండి….
మనం రోజూ తీసుకునే తొలి ఆహారం బ్రేక్‌ఫాస్ట్. రోజువారీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన శక్తిని ఇవ్వడంలో అల్పాహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఉదయాన్నే తీసుకునే ఆహారంలో ఫలాలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే అవి మన రోజు మొత్తాన్ని ఉత్సాహంగా వుంచుతాయి.
క్షమాగుణాన్ని కలిగివుండండి
మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించండి. ఇది కష్టమే కాని ప్రయత్నించండి. క్షమగుణాన్ని మించింది ఇంకొకటి లేదని గుర్తుపెట్టుకోండి. చిన్న విషయాలను మనస్సులో పెట్టుకొని ఎదుటి వారిని దూరం చేసుకోకండి. వారిని క్షమించి ఇంకొక అవకాశమిచ్చి చూడండి.
మీ బాధను వ్యక్తపరచండి
మీ బాధను, కోపాన్ని మీలోనే దాచుకోకండి. కొన్ని సందర్భాల్లో వాటిని అణిచివేయడం కంటే వ్యక్తపరచడమే మంచిది. ఎక్కువ సేపు ఒకే విషయం గురించి చింతించకుండా మీ బాధను దాని వల్ల వచ్చిన కోపాన్ని చూపించండి. ఇలా చేయడం వల్ల మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది.
ప్రతికూల ఆలోచనలకు దూరంగా వుండండి
నెగిటివిటీ మనల్ని మాత్రమే కాదు మన చుట్టూ వున్న పరిసరాలను కూడా కలుషితం చేస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రతికూల ఆలోచనలకు దూరంగా వుండడి. సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోండి. మీలోని నెగిటివ్ ఆలోచనలను పేపర్‌పై రాసి చెత్తకుప్పలో పడేయండి. మీలో వున్న చెడుపై మీరే పోరాడి గెలచి సంతోషాన్ని చేరుకోండి.
ప్రకృతిని ఆస్వాదించండి
ప్రకృతి దేవుడు ప్రసాదించిన గొప్ప వరం. పచ్చని పర్యావరణం ఆరోగ్యమైన జీవితంతో పాటు, మనస్సుకి ప్రశాంతతనిస్తుంది. అందమైన పక్షులు, జంతువులు, ఆకుపచ్చ మొక్కలు, నీలం ఆకాశం, భూమి, నడుస్తున్న నదులు, సముద్ర, అడవులు, గాలి, పర్వతాలు, లోయలు, కొండలు ఆనందలోకాలకు మనల్ని తీసుకెళ్తాయి. అందువల్ల కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిస్తూ అన్ని సమస్యలను మర్చిపోండి.
సోషల్ మీడియాకు తక్కువ సమయాన్ని కేటాయించండి
నేడు మనకు సోషల్ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు.ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతిక్షణాన్నీ, ప్రతి సందర్భాన్నీ ఒడిసి పట్టుకుని పోస్ట్ చేస్తూ ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాకే కేటాయిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది. అందువల్ల సోషల్ మీడియాకు తక్కువ సమయాన్ని కేటా యించి మనుషులతో కలిసి ప్రస్తుతంలో ఆనందాన్ని వెతుక్కోండి.
సంగీతాన్ని వినండి
ఆహ్లాదకరమైన సంగీతం మిమ్మల్ని రోజు మొత్తం ఉత్సాహంగా వుంచుతుంది. అంతే కాదు ఇష్టమైన పాట అన్ని సమస్యలను మర్చిపోయేలా చేసి కొత్త ఆనందలోకాలకు తీసుకెళ్తుంది. అందువల్ల వీలు దొరికితే మీకిష్టమైన పాటని ప్లే చేసుకొని ఎంజాయ్ చేయండి.
వ్యాయామం చేయండి
మీ శరీరానికి, మనస్సుకి విశ్రాంతి కలిగించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయా మాల్లో యోగా ఒకటి. యోగా మనిషిలోని ఒత్తిడిని తగ్గించి సంతోషకరమైన జీవితం వైపు అడుగులు వేయిస్తుంది. రోజు మొత్తాన్ని ప్రశాంతంగా వుంచు తుంది.అందువల్ల ఆనంద మయ జీవితం కోసం రోజూ కొద్ది సేపు యోగా చేయండి.

Tips for living Happy life