Home మంచిర్యాల రెచ్చిపోతున్న భూ బకాసురులు

రెచ్చిపోతున్న భూ బకాసురులు

Tired of officers in arranging boundaries

పాఠశాలల భూములనూ వదలని అక్రమార్కులు                                                                                                    ప్రహరీ గోడలు లేకపోవడంతో విలువైన భూములు అన్యాక్రాంతం                                                                                      హద్దులను ఏర్పాటు చేయడంలో అధికారుల అలసత్వం                                                                                          కుంచించుకుపోతున్న పాఠశాలల క్రీడా మైదానాలు                                                                                              జిల్లాలో భూముల ధరలకు రెక్కలు                                                                                                                            అడ్డుకునే వారు లేక యథేచ్ఛగా ఆక్రమణలు 

మన తెలంగాణ/మంచిర్యాల : జిల్లాలో భూ బకాసురులు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు, డ్రైనేజీల అడుగు భూములు, చెరువులు, కుంటలు, దేవుని మాన్యం భూములు ఆక్రమించుకున్న అక్రమార్కులు చివరికి పాఠశాలల భూములను కూడా వదలడం లేదు. ప్రభుత్వ పాఠశాలలకు క్రీడామైదానం ఇతర అవసరాల కోసం ఐదు ఎకరాలకు పైగానే భూములు కేటాయించగా ప్రస్తుతం ఆక్రమణలతో భూములు కుంచించుకుపోయి క్రీడా స్థలా లు లేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో భూ బకాసురులపై చట్టపరంగా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అడ్డు అదుపు లేకుండా చివరికి పాఠశాలల స్థలాలను కూడా ఆక్రమించుకుంటున్నారు. అధికారుల సహకారంతో రాజకీయ అండదండలతో భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నప్పటికీ అడ్డుకునే వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో 354 పాఠశాలలకు ప్రహరీగోడలు లేకపోగా స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 671 ఉండగా 45, 250 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన భూముల కబ్జాల వ్యవహారం పల్లెలకు చేరగా వారికి కళ్ల ముందు కనబడే పాఠశాలల భూములను సైతం ఆక్రమించుకుంటున్నారు. జిల్లాలోని కొన్ని పాఠశాలలకు రెండు ఎకరాల నుండి ఏడు ఎకరాల వరకు కేటాయించగా ప్రస్తుతం విద్యార్థులకు క్రీడా మైదానాలు లేకుండా పోయాయి. అధికారులు హద్దులు నిర్ణయించకపోవడంతో అసలు భూములు ఎంత ఉన్నాయో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. సంబంధిత విద్యాశాఖ అధికారులు కూడా జన నివాసాల్లో ఉండే పాఠశాలలకు చెందిన విలువైన భూములు అన్యాక్రాంతానికి గురువుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కోటపల్లి మండలంలోని సిర్సా ఉన్నత పాఠశాలకు మూడున్నర ఎకరాల భూమిని కేటాయించగా ఇందులో రెండు ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రహరీగోడలు లేకపోవడంతో సమీప ఇండ్ల వారు చొచ్చుకొని వస్తుండగా మరికొందరు ఏకంగా పాఠశాల స్థలంలోనే ఇండ్లను నిర్మించుకుంటున్నారు. దండేపల్లి మండలం గుడిరేవు ఉన్నత పాఠశాలకు ఐదు ఎకరాలు కేటాయించగా ఈ పాఠశాల రహదారి పక్కనే ఉండడంతో భూములు కబ్జాకు గురువుతున్నాయి. ఇందులో 450 మంది విద్యార్థులు చదువుతుండగా ఇందులోనే ప్రాథమిక, అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. చెన్నూర్ మండలం లంబడిపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఒకే చోట కొనసాగుతుండగా ప్రహరీగోడ నిర్మించకపోవడంతో సుమారు 8 గుంటల భూములు హద్దులు లేకపోవడంతో అన్యాక్రాంతమయ్యాయి. కోటపల్లి మండలంలోని పారిపెల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 5 వేల చదరపు మీటర్ల స్థలంలో దాదాపు 3 వేల చదరపు మీటర్ల స్థలం కబ్జాకు గురయింది. జననివాసాల్లో ప్రధానంగా పాఠశాలలు ఉండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లాలోని పలు పాఠశాలలకు ఎకరాల కొద్ది స్థలాలు కేటాయించగా కుచించుకుపోయి గుంటల్లోకి మారుతున్నాయి. స్థానికులు అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు మరింగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాఠశాలల భూముల హద్దులను నిర్ణయించి ప్రహరీగోడలు నిర్మించకపోయినట్లయితే మరి కొద్దిరోజుల్లో పాఠశాలల స్థలాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.