Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

24 గంటల్లో శ్రీశైలం.. తిరుమల దర్శనం..!

Srisailam-Tirumalaహైదరాబాద్ : హైదరాబాద్, విజయవాడ నుంచి 24 గంటల్లోనే శ్రీశైలం, తిరుమలకు వెళ్లి విఐపి దర్శనం చేసుకుని అక్కడ అన్ని సౌకర్యాలను పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు కల్పించింది. దేవాలయ పర్యాటక ప్రాజెక్టులో భాగంగా హెలికాఫ్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రెండుమూడు రోజుల్లో ఈ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ హెలికాఫ్టర్‌లో ఆరుగురు ప్రయాణించవచ్చు. ఢిల్లీకి చెందిన సమ్మిట్ అనే ఏవియేషన్ సంస్థ హెలికాఫ్టర్‌లను ఏర్పాటు చేస్తుంది. హెలికాప్టర్‌లో ప్రయాణించే భక్తులు, పర్యాటకులకు ఆయా దేవాలయాల వద్ద దర్శనం, ప్రత్యేక పూజల బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది. సమ్మిట్ సంస్థ ఎండీ నీరజ్ భాటియా, రెసిడెంట్ డైరెక్టర్ ఎన్‌వీఆర్ సురేష్ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ ట్రయల్న్ నిర్వహించారు. ప్రస్తుతానికి హైదరాబాద్, విజయవాడ నుంచి శ్రీశైలానికి ఒక వైపు మాత్రమే ఒక్కొక్కరికీ రూ.14,840గా నిర్ణయించారు. ఇందులోనే శ్రీశైలంలో దర్శనం, చుట్టుపక్కల ఉన్న సుందర ప్రాంతాల సందర్శన కలిసి ఉంటుంది. భాటియా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడలో కలిసిన తర్వాత పూర్తి ప్యాకేజీని ఖరారు చేయనున్నారు.
24 గంటల ప్రయాణం ఇలా…

  • విజయవాడ నుంచి ఉదయం 8 గంటల సమయంలో హెలికాప్టర్ బయల్దేరుతుంది. అరగంటకు శ్రీశైలం చేరుకుంటుంది. అక్కడ సున్నిపెంటలో హెలిప్యాడ్ నుంచి భక్తులను కారులో శ్రీశైలం దేవస్థానానికి తీసుకెళ్తారు. అక్కడ అభిషేకం, కుంకుమపూజ చేయిస్తారు. పాతాళగంగకు తాడు మార్గంలో తీసుకువెళ్లి బోట్ షికారు చేయిస్తారు. స్థానికంగా చుట్టుపక్కల ఉన్న సుందర ప్రాంతాలను చూపిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో 12:30 గంటలకు బయల్దేరి 1:30గంటలకు తిరుపతి తీసుకెళ్తారు. అక్కడ నుంచి కారులో తీసుకెళ్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి దర్శనం చేయిస్తారు. రాత్రికి తిరుమలలో వసతి ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం చేయిస్తారు. 7:30గంటల ప్రాంతంలో హెలికాప్టర్ విజయవాడకు బయల్దేరుతుంది. 8:30గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
  • ఇదే తరహాలో హైదరాబాద్-శ్రీశైలం-తిరుపతికి మరో ప్యాకేజీ ఉంటుంది.
  • శ్రీశైలంలో ఉదయం వేచి ఉండే 3గంటలు, తిరుపతిలో సాయంత్రం మరో 3 గంటలు జాయ్ రైడ్ పేరుతో స్థానికులకు హెలికాప్టర్‌లో తిరిగే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకోసం ప్రతి 10 నిమిషాలకు ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున ధర నిర్ణయించారు.

Comments

comments