Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

వ్యాపార సంస్థ టిజెఎస్

TJS State Leader jyotsna Resigned

రెండు లక్షలు వసూలు చేసిన దిలీప్‌కుమార్
ఎంఎల్‌ఎ టికెట్లను అమ్ముకుంటున్నారు
ఆ పార్టీలో వసూల్ రాజాలు, జోకుడుగాండ్లు ఉన్నారు
టిజెఎస్ మరో పిఆర్‌పి – తిరునగరి జ్యోత్స

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ జన సమితి వ్యాపార సంస్థగా మారిందని, మాజీ ఎంఎల్‌సి కపిలవాయి దిలీప్‌కుమార్ ఎంఎల్‌ఎ టికెట్లను అమ్ముకుంటున్నారని టిజెఎస్‌కు రాజీనామా చేసిన తిరునగిరి జ్యోత్న ఆరోపించారు. తన వద్ద నాలుగు నెలల క్రితం కపిలవాయి దిలీప్‌కుమార్ రూ.2 లక్షలను వసూలు చేశారని, ఈ విష యాన్ని  పదిరోజుల క్రితం ఆ పార్టీ అధ్యక్షులు కోదండరామ్ దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. ఆ పార్టీలో కొందరు వసూల్ రాజాలు, జోకుడు గాండ్లు  ఉన్నారన్నారు. టిజెఎస్ ఒక వ్యాపార సంస్థగా మారిందన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ రాజకీయాలు, ఉద్యమ ఆకాంక్షలను అమలు చేస్తానని కోదండరామ్ ప్రకటించడంతోనే ఆయన మీద అభిమానంతో పార్టీలో చేరారని, కానీ ఆ పార్టీలో మహిళలకు గౌరవం లేదన్నారు. కోదండరామ్ పేరుతో కొందరు డబ్బులు వసూ లు చేస్తున్నారని, ఈ విషయం ఆయనకు తెలుసో తెలియదో అని ఆమె వ్యాఖ్యానించారు.

టిజెఎస్‌లోని సత్యంగౌడ్ ద్వారా మాజీ ఎంఎల్‌సి కపిలవాయి దిలీప్‌కుమార్ తనపై అస త్య ఆరోపణలు చేపిస్తున్నారని ఆరోపించారు. దిలీప్‌కుమార్ అనుచరులతో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ విషయమై డిజిపికి ఫిర్యాదుచేస్తానని చెప్పారు. టిజెఎస్ ఉద్యమ ఆకాంక్షల మేరకు పనిచేయడం లేదన్నారు. అంబర్‌పేట్ టికెట్ రాకపోవడంతోనే తాను ఆరోపణలు చేస్తున్నానని ప్రచారం చేయడం అబద్ధమని అన్నారు. ఆ పార్టీలో మహిళలకు ప్రధాన్యత లేదన్నారు. కోదండరామ్ పార్టీ పెట్టిన లక్షం మేరకు పనిచేయడం లేదన్నారు. టిజెఎస్ మరో పిఆర్‌పి లాగ మారిందన్నారు. టిజెఎస్‌కు పొత్తుల మీద స్పష్టత లేదని, ఇప్పటి వరకు ఎంత మంది మహిళలకు టికెట్లు ఇస్తారనే విషయంపై కూడా స్పష్టత లేదన్నారు. టిజెఎస్‌లో కొందరు నాయకులు టికెట్లు అమ్ముకుంటున్నారని, దిలీప్‌కుమార్ తనను డబ్బులు అడిగాడని ఆరోపించారు. పార్టీలో పదవులు, టికెట్ల అడిగితే తమకు ఏమిస్తారని, కారు, బంగ్లా ఇస్తారా? అని అడుగుతున్నారని, టిజెఎస్‌లో కపిలవాయి దిలీప్‌కుమార్‌తో కలిపి ఆరుగురు నేతల కోటరీ ఉన్నదని వ్యాఖ్యానించారు. దిలీప్‌కుమార్‌కు పార్టీలో ఎందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కపిలవాయి దిలీప్‌కుమార్ మహిళలను అవమానిస్తున్నారని చెప్పారు. టికెట్ల పేరుతో కొందరు వ్యక్తులు కొన్ని కోట్ల రూపాయాలు వసూలుచేసి ఉంటారని ఆరోపించారు. కార్యకర్తల అభిష్టం మేరకు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు.

జ్యోత్స ఆరోపణలు అవాస్తవం: టిజెఎస్
తిరునగిరి జ్యోత్స టిజెఎస్‌పై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని టిజెఎస్ మహిళా నేతలు రాగులపల్లి లక్ష్మీ, అనంత లక్ష్మీ, మమత, ప్రసన్నలు తెలిపారు. టిజెఎస్‌లో మహిళలకు సరైన గౌరవం, ప్రాతినిధ్యం ఉన్నదని, భవిష్యత్తులో మహిళలకు మరిన్ని అవకాశాలు కూడా ఉంటాయన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను మాత్రమే నియమించారని, ఎంఎల్‌ఎ అభ్యర్థులను ప్రకటించలేదని వారు వివరించారు. మాజీ ఎంఎల్‌సి కపిలవాయి దిలీప్‌కుమార్ పై చేసిన ఆరోపణలు వారు ఖండించారు. పార్టీలో జ్యోత్స తన వ్యక్తిగత మైలేజ్ కోసమే పనిచేశారని ఆరోపించారు.

Comments

comments