Home రాజన్న సిరిసిల్ల సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించడానికే..

సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించడానికే..

cpi2*కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రస్తావన: చాడా

మన తెలంగాణ / సిరిసిల్ల : ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల దృష్టి మళ్లించడానికి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి థర్డ్ ఫ్రంట్ ప్రస్తావనతో ముందుకు వస్తున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం సిరిసిల్లలో సిపిఐ రెండవ జిల్లా మహాసభలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 4 సంవత్సరాలలో ఏ రకమైన అభివృద్ది సాధించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం ఉన్న పద్దతిలోనే ప్రస్తుతం తెలంగాణ ఉన్నదని నాలుగేళ్లలో ఏ రకమైన అభివృద్ది కనిపించలేదన్నారు. అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. 1.13 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే ఇప్పటికి 26 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. విద్యాలయాల్లో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో అనేక ఖాళీలున్నా ఖాళీలు భర్తీలు చేయడం లేదన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఇంఛార్జీలతోనే పాలన సాగిస్తున్నారన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల ప్రస్తావనే లేదన్నారు. లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని, 6 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు మాత్రమే కట్టించారని, కెసిఆర్‌వి అన్ని తుపాకీ రాముని మాటాల్లా మారాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్‌కు తగిన గుణపాఠం చెప్తామన్నారు. రాజ్యాంగ విరుద్దంగా పార్టీల ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్‌కు 61 మంది ఎమ్మెల్యేలే ఉండగా 93 మంది ఎమ్మెల్యేలు అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ నాటకాన్ని తెరమీదకు తెచ్చారన్నారు. గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేయించిన ఘనత కెసిఆర్‌దేనన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలవగా, తెలంగాణ రెండవ స్థానంలో నిలుస్తుందన్నారు. రైతుల సమస్యలపై మే నెలలో హైదరాబాద్ మార్చ్ ఛలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఎంతటి త్యాగాలకైనా సిద్దమన్నారు. సిద్దిపేట నుండి నేరెళ్ల వరకు 27 కిలోమీటర్ల పాదయాత్ర చేశామని నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని కెసిఆర్, కెటిఆర్ ల పై చర్యలు తీసుకునే వరకు ఉద్యమిస్తామన్నారు. నయీం బాధితుల సదస్సును ఈ నెల 22న భువనగిరిలో నిర్వహిస్తున్నామన్నారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ అభివృద్ది పనుల్లో పర్సంటేజీలు, కమీషన్ల రాజ్యం సాగుతున్న విషయాన్ని నిష్కల్మషంగా వెల్లడించారని, మంత్రి కెటిఆర్ అండతోనే కమీషన్లు తీసుకుంటున్నట్లు వెల్లడించడం గమనార్హం అన్నారు. ఆమెతో ఆగమేఘాల మీద రాజీనామా చేయించడం వారి పార్టీ అంతర్గత విషయమే అయినా సమస్యను మాత్రం వెలుగులోకి తెచ్చిందన్నారు. అభివృద్ది పనుల్లో పర్సంటేజీలు, కమీషన్ల రాజ్యం పోవాలని, ప్రజల రాజ్యం రావాలని, రాజకీయ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని, సామాజిక తెలంగాణ సాధన కోసం సిపిఐ ఉద్యమిస్తుందన్నారు. ఈ సమావేశానికి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కెవి అనసూర్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మంత్రి చంద్రన్న, నల్ల చంద్రమౌళి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సమావేశంలో ఆహ్వానసంఘం అధ్యక్షులు సామల మల్లేశం, జిల్లా కార్యదర్శి గుంటి వేణు ప్రసంగించారు. అమరులకు శ్రద్దాంజలి ఘటించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
సభా ప్రాంగణంలో లాల్‌బావుటాను చాడా వెంకటరెడ్డి ఆవిష్కరించారు. సమావేశాల్లో పది తీర్మాణాలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు సృజన, జిల్లా కార్యవర్గ సభ్యులు పోలు కొమురయ్య, బూర శ్రీనివాస్, వడ్డెపల్లి లక్ష్మణ్ తోపాటు వివిధ మండలాల కార్యదర్శులు, ప్రజా నాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు.