Home తాజా వార్తలు భారత్-ఇంగ్లండ్ చివరి వన్డే నేడు

భారత్-ఇంగ్లండ్ చివరి వన్డే నేడు

dhoni

లీడ్స్: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే కోసం ఇటు ఆతిథ్య ఇంగ్లండ్, అటు భారత జట్టు అన్ని అస్త్రాలతో సిద్ధమయ్యాయి. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. రెండో వన్డేలో ఇంగ్లండ్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్ గెలవాలంటే మంగళవారం హెడింగ్లేలో జరిగే ఆఖరి వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇందులో గెలిచే జట్టుకు సిరీస్ సొంత మవుతుంది. తొలి వన్డేలో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన భారత్ లార్డ్ గడ్డపై బోల్తా పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేన ఘోర వైఫల్యం చవిచూసింది. దీంతో ఇంగ్లండ్ రెండో వన్డేలో ఘన విజయం సాధించి సిరీస్‌ను 11తో సమం చేసింది. కాగా, మూడో వన్డేలోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. అయితే లార్డ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవడమే కాకుండా సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్షంతో భారత్ చివరి వన్డేకు సిద్ధమైంది. కిందటిసారి జరిగిన పొరపాట్లకు తావులేకుండా విజయమే లక్షంగా పెట్టుకుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం. కిందటి మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన స్టార్ ఆటగాడు రూట్‌పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. భారత్ కూడా ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మలపై నమ్మకంతో ఉంది. రాహుల్ కూడా ఫాంలో ఉండడం టీమిండియాకు ఊరటనిస్తోంది. ఇక, కుల్దీప్ యాదవ్ కీలకమైన మూడో వన్డేలో చెలరేగేందుకు అతృతతో ఎదురు చూస్తున్నాడు.