Home తాజా వార్తలు సమరోత్సాహంతో భారత్

సమరోత్సాహంతో భారత్

doni

 నేడు ఇంగ్లండ్‌తో తొలి వన్డే

నాటింగహామ్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా గురువారం ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇటీవలే జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌ను భారత్ 21తో గెలుచుకుంది. అంతేగాక ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను కూడా టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ సిరీస్‌ను కూడా గెలిచి టెస్టులకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని తహతహలాడుతోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా జోరుమీదుంది. ఆస్ట్రేలియా తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిం దే. భారత్‌పై కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షం తో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో వన్డే సిరీస్ హోరాహోరీ ఖాయమని చెప్పాలి.
జోరుమీదున్నారు..
ట్వంటీ20 సిరీస్‌లో భారత టాప్ ఆర్డర్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మ, వన్‌డౌన్‌లో వచ్చిన లోకేష్ రాహుల్‌లు శతకాలు కొట్టి సత్తా చాటారు. ఇద్దరు కూడా అసాధారణ బ్యాటింగ్‌తో భారత్‌కు సిరీస్ సాధించి పెట్టారు. ఈసారి కూడా జట్టు వీరిపైనే ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఫాంలోకి వచ్చాడు. ఇది టీమిండియాకు అనుకూలించే పరిణామం. అయితే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ నిరాశ పరచడం భారత్‌కు కలవర పరిచే అంశమే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా ధావన్ సొంతం. అయితే ట్వంటీ20 సిరీస్‌లో ధావన్ విఫలమయ్యాడు. కానీ, వన్డేల్లో పుంజుకునే సత్తా అతనికి ఉంది. టి20లతో పోల్చితే వన్డేల్లో ధావన్‌కు మంచి రికార్డు ఉంది. దీంతో అతను రాణించడం ఖాయమనే చెప్పాలి. ఇక, రోహిత్, రాహుల్‌లు జట్టుకు కీలకంగా మారారు. కిందటి సారి ఇంగ్లండ్ గడ్డపై అవమానకర రీతిలో ఓటమి పాలైన టీమిండియా ఈసారి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే టి20 సిరీస్ గెలిచి ఒక అడుగు ముందుకు వేసింది. వన్డేల్లోనూ గెలిచి ఇంగ్లండ్‌కు సమాధానం ఇవ్వాలనే లక్షం తో భారత్ కనిపిస్తోంది. ఇక, ఇంగ్లండ్ పిచ్‌లపై భారత బౌలర్లు మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్, సిద్ధార్థ్ కౌల్‌లతో ఫాస్ట్ బౌలింగ్ చాలా బలంగా మారింది. చాహల్, కుల్దీప్, అక్షర్ పటేల్‌లతో స్పిన్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచన వేయలేం..
మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును తక్కువ అంచన వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఇటీవల ముగిసిన ట్వంటీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మెరుగ్గా రాణించారు. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, జాసన్ రాయ్, బైర్‌స్టో, కెప్టెన్ మోర్గాన్‌లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 475 పరుగుల భారీ స్కోరును సాధించిన విషయం తెలిసిందే. భారత బౌలర్లు ఏమాత్రం పట్టు సడలించినా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చెలరేగి పోవడం ఖాయం. దీంతో ప్రారంభం నుంచే వీరిని కట్టడి చేయాల్సిన బాధ్యత బౌలర్లపై ఎంతైన ఉంది. ఇక, బెన్‌స్టోక్స్ చేరికతో ఇంగ్లండ్ మరింత బలోపేతంగా మారింది. బంతితో, బ్యాట్‌తో చెలరేగే స్టోక్స్‌తో భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది. మోయిన్ అలీ, మార్క్‌వుడ్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు ఇంగ్లండ్‌కు అందుబాటులో ఉన్నారు. అంతేగాక ఆదిల్ రషీద్ రూపంలో మ్యాచ్ విన్నర్ స్పిన్నర్ ఉండనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో భారత్‌కు విజయం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. మరోవైపు సొంత గడ్డపై ఆడుతున్న ఇంగ్లండ్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. రెండు జట్లు కూడా సమతూకంగా ఉండడంతో సిరీస్ హోరాహోరీగా సాగడం తథ్యం.