Search
Friday 21 September 2018
  • :
  • :

ఫేవరెట్‌గా టీమిండియా

vrt

నేడు ఐర్లాండ్‌తో  టి20 పోరు

డబ్లిన్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు భారత క్రికెట్ జట్టు బుధవారం శ్రీకారం చుట్టనుంది. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు సన్నాహకంగా ఐర్లాండ్‌తో రెండు ట్వంటీ20 మ్యాచ్‌లలో భారత్ తలపడనుంది. బుధవారం డబ్లిన్ వేదికగా తొలి టి20 మ్యాచ్ జరుగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌లలో కూడా గెలిచి రానున్న ఇంగ్లండ్ సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండడంతో అందరి దృష్టి కోహ్లి సేనపై నిలిచింది. ఐర్లాండ్‌తో పోల్చితే భారత జట్టు చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ మ్యాచ్ ప్రత్యేకంగా మారింది. ఇంగ్లండ్ సిరీస్‌కు సన్నాహకంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే పట్టుదలతో కోహ్లి ఉన్నాడు. కొంత కాలంగా ఫిట్‌నెస్ లేమితో బాధపడుతున్న కోహ్లి ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతేగాక వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఈ సిరీస్ కీలకంగా మారింది. కొంతకాలంగా పేలవమైన ఫాంతో సతమతమవుతున్న రోహిత్‌కు ఈ సిరీస్ సవాలుగా తయారైంది. రానున్న ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో ఇందులో మెరుగ్గా రాణించాల్సిన బాధ్యత రోహిత్‌పై నెలకొంది. ఒకవేళ ఇందులోనూ విఫలమైతే రోహిత్ కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. కాగా, ఐపిఎల్‌లో నిలకడగా రాణించిన లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, సురేశ్ రైనాలపై అందరి దృష్టి నిలిచింది. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని రైనా భావిస్తున్నాడు. బుమ్రా, భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. కాగా, విలియమ్ పోర్టర్‌ఫీల్డ్, పాల్ స్టిర్లింగ్, కెవిన్ ఓబ్రియాన్ తదితరులతో కూడిన ఐర్లాండ్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. అంతేగాక సొంతగడ్డపై ఆడుతున్న ఐర్లాండ్ భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.

Comments

comments