ఆదిలాబాద్: కుమ్రంభీం జిల్లా ఉట్నూర్‌లో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనకు నిరసనగా శనివారం ఉట్నూర్, ఆదిలాబాద్ మన్యంలో నిరసన కారులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌తో మన్యంలోని విద్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఉట్నూరు మన్యంలో పలు ప్రాంతాలలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ డిఐజి, ఆదిలాబాద్ ఎస్పిలు మన్యంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఉట్నూరు ఏజెన్సీలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. ఉట్నూరు ఘటనపై మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నిజమాబాద్ జిల్లా ఇందల్వాల్ మండలం గన్నారం దేవితండా దగ్గర లంబాడీలు రాస్తారోకో చేశారు. లంబడీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తుల్జారావుపేటలో జాతీయరహదారి పై నిరసన కారులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్జామైంది.