Search
Tuesday 17 July 2018
  • :
  • :

ఇంగ్లండ్‌తో క్రొయేషియా అమీతుమీ

sprts

 నేడు రెండో సెమీ ఫైనల్
మాస్కో: ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన ఇంగ్లండ్, క్రొయేషియా జట్లు అసాధారణ ఆటతో సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్, క్రొయేషియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇంగ్లండ్‌లో 1966లో ప్రపంచకప్ విజేతగా నిలిచింది. అయితే క్రొయేషియా ఒక్కసారి కూడా ఫైనల్‌కు కూడా చేరలేదు. అయితే ఈసారి మాత్రం ఇంగ్లండ్‌ను ఓడించి టైటిల్ పోరుకు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆతిథ్య రష్యాతో జరిగిన హోరాహోరీ సమరంలో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకొచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్ పోరులో స్వీడన్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో క్రొయేషియాతో పోల్చితే ఇంగ్లండ్‌కే మెరుగైన అవకాశాలున్నాయి. అయితే రష్యా వేదికగా జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్రొయేషియా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచింది. లీగ్ దశలో ఆడిన మూడు పోటీల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. బలమైన అర్జెంటీనా లీగ్ మ్యాచ్‌లో 30తో చిత్తు చేసి పెను ప్రకంపనలు సృష్టించింది. అంతేగాక నైజీరియా, ఐస్‌లాండ్ వంటి జట్లను కూడా క్రొయేషియా చిత్తు చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో కూడా క్రొయేషియా అద్భుతంగా ఆడింది. బలమైన డెన్మార్క్‌ను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో కూడా క్రొయేషియా అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. ఆతిథ్య రష్యాతో హోరాహోరీగా సాగిన పోరులో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. పెనాల్టీ షూటౌట్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో క్రొయేషియా ఒత్తిడిని సైతం తట్టుకుంటూ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఆటను కనబరుస్తోంది. టోర్నీ ప్రారంభంలో ఇంగ్లండ్ ఎవరికి పెద్దగా ఆశలు లేవు. ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకు వెళ్లడం కష్టమని విశ్లేషకులు సైతం అంచన వేశారు. అయితే ఇంగ్లండ్ మాత్రం అందరి అంచనాలను తారు మారు చేసింది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ నాకౌట్‌లోనూ మెరుగ్గా ఆడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన కొలంబియాను ఓడించింది. పెనాల్టీ షూటౌట్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇక, స్వీడన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా విజయాన్ని అందుకుంది. బలమైన స్వీడన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ సునాయాస విజయంతో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో పటిష్టమైన క్రొయేషియాను ఓడించాలనే పట్టుదలతో ఉంది.

Comments

comments