Home తాజా వార్తలు రెండు బృహత్ పథకాలకు నేడే శ్రీకారం

రెండు బృహత్ పథకాలకు నేడే శ్రీకారం

 Today is the journey to two martial schemes

పంద్రాగస్టున రైతుబీమా, కంటివెలుగు పథకాలను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రతిష్ఠాత్మకమైన పథకాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ పంద్రాగస్టు సందర్భంగా బుధవారం ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ‘రైతుబీమా’ కార్యక్రమా న్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో, రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ ఉచితంగా కంటి వైద్యపరీక్షలు చేసే ‘కంటి వెలుగు’ను మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ‘రైతుబీమా’ పథకానికి ఇప్పటికే రూ. 636 కోట్లను విడుదల చేయడంతో పాటు ‘కంటి వెలుగు’ కోసం రూ. 120 కోట్లను విడుదల చేశారు. సుమారు 40 లక్షల కళ్ళజోళ్ళను ఇప్పటికే సిద్ధం చేశారు. ‘రైతుబంధు’ పథకం ద్వారా మే నెలలో రూ. 6000 కోట్లను ఖర్చుచేసి సుమారు 50 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం చేయగా, మళ్ళీ అక్టోబరు చివర్లో రెండవ విడతగా ‘రైతుబంధు’ చెక్కులను అందించనున్నారు.

పంద్రాగస్టు సందర్భంగా గోల్కొండ కోట నుంచి ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో ఈ అంశాలను పేర్కొనడంతో పాటు నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. రజకులు, నాయీ బ్రాహ్మణులు తదితర వెనకబడినవర్గాలకు వంద శాతం సబ్సిడీతో వృత్తిపై ఆధారపడే ఉపకరణాలను కొనుగోలు చేసేందుకు గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. పంద్రాగస్టుకల్లా అన్ని గ్రామాలకూ ‘మిషన్ భగీరధ’ పథకం కిద బల్క్ నీటిని సరఫరా చేయాలని ఇటీవల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేసినందువల్ల ఆ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 80% గ్రామాలకు బల్క్‌నీటిని అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఐదేళ్ళుగా గోల్కొండ కోటపై పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొంటున్న కెసిఆర్ ఈసారి తన ప్రసంగంలో ప్రజలను ఆకట్టుకునే తీరులో కొత్త పథకాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఎన్నికల ‘మూడ్’లోకి వెళ్ళిపోయినట్లు స్వయంగా ముఖ్యమంత్రే సోమవారం పార్టీ కార్యాలయంలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే కొన్ని అంశాలను గోల్కొండకోట ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామీణాభివృద్ధితో పాటు జనరంజకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్న రాష్ట్రంగా ఇప్పటికే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిన నేపథ్యంలో ఆరోగ్య తెలంగాణ దిశగా ‘కంటివెలుగు’ను లాంఛనంగా ప్రారంభిస్తుండడం గమనార్హం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి కులవృత్తులపై ఆధారపడినవారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రైతులకు ఆపదలో ఉపయోగపడేలా ‘రైతుబీమా’కు కూడా అంకురార్పణ చేస్తున్నారు. ఇప్పటికే ‘రైతుబంధు’ ద్వారా సుమారు యాభై లక్షల మందికి పంట పెట్టుబడి సాయం చేసిన సిఎం పంటలకు కనీస మద్దతు ధర గురించి కేంద్రానికి ఇప్పటికే డిమాండ్లు పెట్టిన దృష్టా పంద్రాగస్టు ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.