Home ఆఫ్ బీట్ నేడు ముద్దపప్పు బతుకమ్మ

నేడు ముద్దపప్పు బతుకమ్మ

Today is the muddapappu bathukamma festival celebrations

బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉన్నట్టు మూడవ రోజు బతుకమ్మను ముద్ద పప్పు బతుకమ్మగా పిలుస్తారు. దీనిలో భాగంగానే  ఈ రోజుకూడా  మహిళలు, ఆడపిల్లలు     ఎంతో  సంబరంగా   పూల తో బతుకమ్మను పేర్చి  ఆడుతూ పాడుతూ బతుకమ్మ చుట్టూ  తిరుగుతూ పాటలు పాడుతారు. 

ముద్ద పప్పు బతుకమ్మను పురస్కరించుకుని అమ్మ వారికి ముద్ద పప్పు , బెల్లం, పాలు కలిపిన పదార్థాలను నైవేద్యం గా సమర్పిస్తారు.
ముద్దపప్పు ప్రసాదం
శనగ పప్పు 1 కప్పు
బెల్లం 1 కప్పు
పాలు……..1 కప్పు
నీళ్లు….1 కప్పు
తయారీ విధానం….
ముందుగా ఒక గిన్నెలో పప్పు ఉడికించి పెట్టు కోవాలి . తరువాత మరొక గిన్నెలో పాలు తీసుకుని మరిగించాలి. మరుగుతున్న పాలలో బెల్లం, ఉడికించిన పప్పును కలపాలి. మిశ్రమం గట్టి పడేంత వరకు కలిపి దించేయాలి అంతే ముద్దపప్పు ప్రసాదం రెడీ. పాల వల్ల శరీరానికి ప్రోటీన్స్ అందుతాయి. బెల్లం ఐరన్ ఇస్తుంది. అమ్మవారి ప్రసాదంగానే కాకుండా ఆరోగ్యంగా ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతుంది.

ఏమేమి పువ్వప్పునే …
ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ… ఏమేమి కాయప్పునే గౌరమ్మ… చిత్తూ చిత్తూల బొమ్మ శివునీ ముద్దూల గుమ్మ… బంగారు బొమ్మదొరికెనమ్మో ఈ వాడలోన… అంటూ ఊరూవాడా ఉప్పొంగిపోయింది. గునుగు పూల గుబాళింపు… తంగెడు పూల తళుకులతో బంగారు కొండల్లా ముస్తాబుచేసిన బతుకమ్మలను చూడ్డానికి రెండు కళ్లూ చాలట్లేదు. పట్టు చీరలతో పట్టరాని సంతోషంలో మహిళలు.. పరికిణూలు ధరించి పరవశాన ఆడిపాడుతున్న యువతుల.. మూడో రోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ

ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
దూరాన దోర పండే గౌరమ్మ
దూరాన దొరలైరి గౌరమ్మ
పట్నాన పంతులైరి గౌరమ్మ
అటు చూసి మాయన్నలు గౌరమ్మ
ఏడు మేడ లెక్కిరి గౌరమ్మ
ఏడు మేడ లెక్కి ఎత్తులు దాటంగా
ఎదుర్కోలియంగా
దొంగలెవరు దోసిరి గౌరమ్మ
బంగారు గుండ్ల వనమే గౌరమ్మ
శ్రీ లక్ష్మినీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మ గౌరమ్మ
భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై
పార్వతీ దేవివై పరమేశురాణివై
పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ
భార్యవైతివి హరికినీ గౌరమ్మ
ఎన్నెన్నో రూపాలు
ఏడేడు లోకాలు
ఉన్న జనులకు
కోరికలు సమకూర్చగా
కన్న తల్లివైతివి గౌరమ్మ
కామధేనువు అయితివి గౌరమ్మ
ముక్కోటి దేవతలు
సక్కని కాంతలు
ఎక్కువ పూలు గూర్చి
పెక్కు నోములు నోమి
ఎక్కువ వారిరై గౌరమ్మ
ఈ లోకముల నుండియు గౌరమ్మ
తమరి కంటే ఎక్కువ
దైవము ఎవ్వరూ లేరు
తమకింపు పట్టింపు
సకల లోకంబుల
క్రమముచే పాలించగా గౌరమ్మ
కన్నుల పండుగాయే గౌరమ్మ
ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
దూరాన దోర పండే గౌరమ్మ.