నగరంలో వేడుకలకు ముస్తాబైన పార్కులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : భారతీయ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్య సిద్ధిస్తుంది. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం… భారతీయ తత్తజ్ఞానం ప్రతిపాదించిన షడ్ధర్శనాల్లో యోగ ఒకటి. దీనికి కర్త పతంజలి మహర్షి. ఆయన రచించిన యోగా సూత్రాలు యోగా శస్త్రానికి ప్రామాణికం. మనసుతో సహా ఐదు ఇంద్రియాలు ఆత్మలో స్థిరంగా నిలబడి బుద్ధి సైతం చలించకుండా… మానవునికి సునిశ్చితమైన ఆధ్యాత్మిక సమున్నతిని కలిగించే సాధానాలను ఉపదేశించినదే యోగ విద్య.
నగరంలో ముస్తాబైన పార్కులు : యోగ ఒకతరం నుంచి మరోతరానికి ప్రవహించే ప్రాణశక్తి. శతాబ్ధాల కాలగమనంలో మనుషులను, మానవ సంబంధాలను పట్టినిలిపే బలమైన జీవశక్తి. వ్యక్తిని వ్యవస్థతో అనుసంధానం చేసే అద్భుతమైన జీవన ప్రక్రియే యోగ. అందరినీ కలిపి ఉంచే ఒక జీవనమార్గ. వేల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిన యోగ విద్య ఇప్పుడు అంతర్జాతీయ వేడుకైంది. అష్టాంగ యోగమే జీవనవిధానంగా,ప్రాణాయామమే పరిపూర్ణ ఆరోగ్యసంపాదనగా మలుచుకుని అనేకమంది స్వస్థతను పొందుతున్నారు. నగరంలోని ఉద్యానవనాలన్నీ ఇప్పుడుయోగ కేంద్రాలుగా అవతరించాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ యోగాసానాలు వేస్తు నగరవాసులు ఆరోగ్యానికి బాటలువేస్తున్నారు. గతంలో ఒకటి,రెండు పార్కులకు మించి యోగ కేంద్రాలు నడిచేవి కాదు. ఇప్పుడు యోగపై నగరవాసుల్లో చైతన్యం పెరిగింది. నగరంలోని ఏ పార్కులో చూసి యోగా శిక్షణ కేంద్రాలు మనకు దర్శనమిస్తున్నాయి. ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యాన్ని పంచే లక్షంతో స్వచ్ఛంధ సంస్థలు పార్కుల్లో యోగా శిక్షణను ఇస్తున్నాయి. జూన్ 21 గరువారం ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని పార్కులు ముస్తాబయ్యాయి. అలాగే అనేక అధ్యాత్మిక,యోగా సాధన సంస్థలు ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసుకున్నాయి. నేడు యోగ సాధకులతో పార్కులు కళకళలాడనున్నాయి.