Home తాజా వార్తలు పంజాబ్‌కు పరీక్ష!

పంజాబ్‌కు పరీక్ష!

punjab won by 4 runs on delhi

నేడు ముంబయితో సమరం

ముంబయి: వరుస ఓటములతో సతమతమవుతున్న కింగ్స్ లెవన్ పంజాబ్‌కు బుధవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ చావోరేవోగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే రెండు జట్లు కూడా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. దీంతో ఇరు జట్లు కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతున్నాయి. సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో ప్రకంపనలు సృష్టించిన పంజాబ్ తర్వాత పరాజయాల బాట పట్టింది. చివరిగా ఆడిన ఆరు మ్యాచుల్లో ఐటింటిలో ఓటమి పాలై ప్లేఆఫ్ అవకాశాలను చేజేతులా క్లిష్టం చేసుకుంది. లోకేష్ రాహుల్, క్రిస్ గేల్ వంటి స్టార్లతో కూడిన పంజాబ్ వరుస ఓటములతో కుదేలైంది. రాహుల్ రాణిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. గేల్ విఫలం అవుతుండడంతో పంజాబ్‌కు కష్టాలు తప్పడం లేదు. ముంబయితో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే పంజాబ్ అవకాశాలు మెరుగుపడుతాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైన జయకేతనం ఎగుర వేయాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. ముంబయి ఇండియన్స్‌కు కూడా మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకున్నా రేసులో నిలువాలంటే పంజాబ్‌పై గెలవక తప్పదు. వరుస విజయాలతో జోరుమీదున్న ముంబయికి కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. దీంతో ముంబయిపై ఒత్తిడి రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లో గెలిచి రేసులో ఉండాలని భావిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండడంతో ముంబయికే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
రాహుల్‌పైనే ఆశలు..
ఇక, ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆశలన్నీ స్టార్ ఓపెనర్ లోకేష్ రాహుల్‌పైనే ఆధారపడ్డాయి. ఈ సీజన్‌లో భీకర ఫాంలో ఉన్న రాహుల్ పంజాబ్ సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఓటమి పాలైన మ్యాచుల్లో కూడా రాహుల్ చివరి వరకు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈసారి కూడా జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో పంజాబ్ 88 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో రాహుల్‌పై ఒత్తిడి పెరిగింది. గేల్‌తో కలిసి శుభారంభం అందిస్తే జట్టు మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంటుంది. గేల్‌లో కూడా నిలకడ లోపించింది. ప్రారంభ మ్యాచుల్లో ఇరగదీసిన గేల్ ప్రస్తుతం వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని భావిస్తున్నాడు. మరో స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టాడు. కిందటి మ్యాచ్‌లో నాయర్ విఫలమయ్యాడు. ఈసారి మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. అరోన్ ఫించ్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. బెంగళూరు మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఫించ్ కాస్త టచ్‌లోకి వచ్చాడు. నిలకడలేమి అతనికి ప్రధాన సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా ఫాంను అందుకోవాలని తహతహలాడుతున్నాడు. ఆల్‌రౌండర్లు డేవిడ్ మిల్లర్, స్టోయినస్ తదితరులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. జట్టుకు అండగా నిలువలేక పోతున్నారు. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. కెప్టెన్ అశ్విన్ కూడా తన ఆటను మెరుగు పరుచుకోక తప్పదు. బంతితో, బ్యాట్‌తో రాణించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. అయితే ఆండ్రూ టై, అశ్విన్, మోహిత్ తదితరులతో బౌలింగ్ బాగానే ఉంది. టై నిలకడైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. అక్షర్ పటేల్ కూడా బంతితో మెరుగ్గానే రాణిస్తున్నాడు. సమష్టిగా పోరాడితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం పంజాబ్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు.

బ్యాటింగే బలం..

Mumbai won by 8 wickets

ముంబయి ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌నే నమ్మకుంది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, లూయిస్‌లు భీకర పాంలో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశం. సూర్యకుమార్, లూయిస్ సీజన్‌లో మెరుగ్గా రాణిస్తున్నారు. ఈసారి కూడా జట్టు వీరి నుంచి శుభారంభం ఆశిస్తోంది. వీరు మంచి ఆరంభం అందిస్తే ముంబయికి భారీ స్కోరు కష్టం కాదు. ఇక, యువ ఆటగాడు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా బాగానే ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే మెరుపు అర్ధ శతకం సాధించి సత్తా చాటాడు. పంజాబ్‌పై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం జట్టుకు సమస్యగా మారింది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఈసారి మెరుగ్గా ఆడాలనే లక్షంతో ఉన్నాడు. పాండ్య బ్రదర్స్ కూడా జట్టుకు అండగా నిలువాలనే లక్షంతో ఉన్నారు. వీరిద్దరూ చెలరేగితే ముంబయికి విజయం నల్లేరుపై నడకే. అయితే నిలకడలేమి వీరికి ప్రధాన అడ్డంకిగా తయారైంది. హార్ధిక్ కాస్త బాగానే ఆడుతున్నాడు. కృనాల్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. కానీ, ఈ మ్యాచ్‌లో ఇద్దరు కూడా మెరుగ్గా ఆడాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యారు.