Home స్కోర్ సిరీస్‌పై భారత్ గురి

సిరీస్‌పై భారత్ గురి

ind

సఫారీలకు చావోరేవో, నేడు రెండో టి-20

సెంచూరియన్: వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియాపై బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టి20 మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో పోటీ మిగిలివుండగానే సిరీస్ దక్కించుకోవాలనే లక్షంతో భారత్ కనిపిస్తోంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే లక్షంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుంది. కాగా, కిందటి మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ విరాట్ కోహ్లి బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఇంత వరకు తేలలేదు. ఒక వేళ కోహ్లి బరిలోకి దిగక పోతే రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహిస్తాడు. కాగా, ఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా టి20లలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఇందు కోసం అన్ని అస్త్రాలతో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది.
రోహిత్ ఈసారైనా..
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ఓపెనర్ రోహిత్ శర్మ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్ ఝులిపిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టెస్టు, వన్డే సిరీస్‌లలో రోహిత్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ కొనసాగించలేక పోయాడు. కేవలం ఒక వన్డేలో మాత్రమే సెంచరీతో ఆకట్టుకున్నాడు. అది తప్ప మరో మెరుగైన ఇన్నింగ్స్‌ను ఆడనేలేదు. తొలి టి20లో జోరు మీద కనిపించినా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరి నిరాశ పరిచాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైన స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సిన అవసరం రోహిత్‌పై ఉంది. ఇక, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తొలి టి20లో కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చూడచక్కని బ్యాటింగ్‌తో సిరీస్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన ధావన్ చెలరేగితే ఈ మ్యాచ్‌ను కూడా గెలుచుకోవడం భారత్‌కు కష్టమేమి కాదు. ఇక, తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే ఔటైన సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా ఈసారి భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. వాండరర్స్‌లో కొద్ది సేపు మెరుపులు మెరిపించినా భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. కానీ, ఈసారి మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు.
కోహ్లి అనుమానమే..
మరోవైపు తొలి మ్యాచ్‌లో గాయం బారిన పడిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది ఇంకా తేలలేదు. జట్టు యాజమాన్యం మాత్రం కోహ్లి బరిలోకి దిగుతాడనే నమ్మకంతో ఉంది. కోహ్లి కూడా మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే మంగళవారం రాత్రి వరకు కూడా కోహ్లి ఆడే విషయంపై స్పష్టత రాలేదు. అసాధారణ ఫాంలో ఉన్న కోహ్లి బరిలోకి దిగక పోతే టీమిండియాకు అది పెద్ద లోటుగా పరిణమించే అవకాశం ఉంది. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకే కోహ్లి మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
చివర్లో వేగం పెంచాలి..
టాప్ ఆర్డర్ అందిస్తున్న శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో మిడిలార్డర్ విఫలమవుతుందనే చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో ధావన్, కోహ్లిలు మెరుగ్గా ఆడి భారీ స్కోరుకు పునాది వేశారు. అయితే మధ్య, చివరి ఓవర్లలో భారత్ వేగంగా పరుగులు సాధించడంలో విఫలమవుతోంది. తొలి టి20లో కూడా ఈ విషయం స్పష్టమైంది. కీలక సమయంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడడంలో విఫలమవుతున్నారు. దీంతో జట్టు ఊహించిన దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమవుతోంది. కిందటి మ్యాచ్‌లో మనీష్ పాండే, మహేంద్ర సింగ్ ధోనిలు వేగంగా ఆడలేక పోయారు. దాదాపు ఆరేడు ఓవర్లు ఆడినా మనీష్ పాండే కేవలం ఒక్క సిక్స్ మాత్రమే సాధించాడు. అతని బ్యాట్ నుంచి ఒక్క బౌండరీ కూడా రాలేదు. దీన్ని బట్టి అతను ఎంత రక్షణాత్మక బ్యాటింగ్‌ను కనబరిచాడో ఊహించుకోవచ్చు. ధోనిలో కూడా మునుపటి వేగం కనిపించడం లేదు. ఒకప్పుడూ చివరి ఓవర్లలో కళ్లు చెదిరే షాట్లతో చెలరేగి పోయే ధోని ప్రస్తుతం ఆ స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నాడు. అతను తన దూకుడును పెంచాల్సిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్య, భువనేశ్వర్‌లు కూడా వేగంగా ఆడితే భారత్‌కు భారీ స్కోరు సాధించడం అసాధ్యమేమి కాదు.

బౌలింగే బలం..

సిరీస్‌లో భారత్ సాధిస్తున్న విజయాల్లో బౌలర్లదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. వన్డే సిరీస్‌లో స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్‌లు అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. వీరిద్దరు రాణించడంతో దక్షిణాఫ్రికాపై భారత్ భారీ తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. వీరి బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో సఫారీ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా భారత బౌలర్ల నుంచి సఫారీ ఆటగాళ్లకు ప్రమాదం పొంచి వుందనే చెప్పాలి. చాహల్, కుల్దీప్‌లతో పాటు బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కూడా జోరు మీదున్నారు. కిందటి మ్యాచ్‌లో భువనేశ్వర్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ బౌలర్లపైనే ఆశలు పెట్టుకుంది.