Home తాజా వార్తలు మంత్రివర్గకూర్పులో సమ తూకం

మంత్రివర్గకూర్పులో సమ తూకం

Telangana cabinet expansion

నేడు కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ ప్రారంభం

సిఎం ఆశయ, లక్షాల సాధనకు
అనువుగా సమతూక ప్రాధాన్యం
పాత కొత్తల మేలు కలయిక
ప్రస్తుతం కొద్ది మందితో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెద్ద టీమ్ ?
సామాజిక వర్గాలకు సమన్యాయం

మన తెలంగాణ /హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గాన్ని ఈ నెల 19వ తేదీన విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు ఉంటుందోననే ఊహాగానాలు జోరందుకున్నాయి. తన ఆలోచనలను, వేగాన్ని అందుకునేవారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి మంత్రులుగా వారిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. పాత ముఖాలా లేక కొత్త ముఖాలా అనే అంశంకంటే కార్యాచరణలో ఎవరు ఎక్కువగా ఉత్సాహంగా పనిచేస్తారో, రానున్న ఐదేళ్ళలో తెలంగాణను ఏ స్థాయికి వృద్ధి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారో ఆ బాధ్యతలను నెరవేర్చగలిగినవారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. వీలైనంత వరకు పాత, కొత్త ముఖాల మేళవింపుతో సామాజికవర్గాల సమీకరణాన్ని, జిల్లాల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని సమతూకం ఉండేలా మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏడాది కాలం పాటు ఐఏఎస్ అధికారుల కొరత, ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయడం, విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి కార్యాచరణ తదితరాలపైనే దృష్టి పెట్టి పునాదిని పటిష్టం చేసిన కెసిఆర్ రానున్న కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొత్తం దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి చొరవతో, నిబద్ధతతో కృషి చేసేవారిని మంత్రులుగా నియమించాలని భావిస్తున్నట్లు స మాచారం. అదే సమయంలో సామాజిక వర్గాల సమీకరణ, జిల్లాలకు ప్రాతినిధ్యం తదితర అం శాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని గతంలో పలువురు మంత్రులను వారించిన ముఖ్యమంత్రి ఈసారి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిమంతులకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఈ నెల 19న జరిగే మంత్రివర్గ విస్తరణలో ఎనిమిది మంది లేదా తొమ్మిది మందికి అవకాశం ఇచ్చి పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలవారీగా చూస్తే ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నల్లగొండ జిల్లా నుంచి జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి నిరంజన్‌రెడ్డి, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాసయాదవ్‌లకు దాదాపుగా బెర్త్‌లు ఖాయమని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత విస్తరణలో ఆ జిల్లా నుంచి అవకాశం ఇవ్వకపోవచ్చని సమాచారం. ఇదే విధంగా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రస్తుతం ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆలోచిద్దామని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది.

మెదక్ జిల్లా నుంచి స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ప్రస్తుత విస్తరణలో ఆ జిల్లా నుంచి ఎవరికీ అవకాశం లభించకపోచ్చు. మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న సమయంలోనే రానున్న పార్లమెంటు ఎన్నికలు, ఎంఎల్‌సి ఎన్నికలు, కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు తదితరాలన్నింటిపై ముఖ్యమంత్రి ఆలోచించినట్లు తెలిసింది. ప్రస్తుతం కొద్దిమందికి మంత్రివర్గంలో చోటు కల్పించి పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలవారీగా పరిశీలిస్తే, ఆదిలాబాద్ జిల్లా నుంచి గతంలో ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నలు మంత్రులుగా కొనసాగినా ఈసారి ఒక్కరికి మాత్రమే అవకాశం లభించనున్నట్లు తెలిసింది. ఇందులో ఎక్కువగా ఇంద్రకరణ్‌రెడ్డికి అవకాశం ఉండొచ్చని సమాచారం. నిజామాబాద్ జిల్లాలో గతంలో పోచారం శ్రీనివాసరెడ్డికి అవకాశం లభించినా ఈసారి స్పీకర్‌గా ఎన్నిక కావడంతో ఆ స్థానంలో మిషన్ భగీరధ చైర్మన్‌గా ఉన్న వేముల ప్రశాంత్‌రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉంది.

కరీంనగర్ జిల్లాలో సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌కు గత మంత్రివర్గంలోనే అవకాశం లభిస్తుందని భావించినా చీఫ్ విప్‌గా అవకాశం ఇవ్వడంతో ఈసారి తప్పకుండా మంత్రి అవుతారని సమాచారం. ఈ జిల్లా నుంచి గతంలో ఈటల రాజేందర్ మంత్రిగా పనిచేసినా బి.సి. సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రానున్న విస్తరణలో అవకాశం ఉంటుందా లేక పార్లమెంటు ఎన్నికల తర్వాత ఉంటుందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా నుంచి గతంలో స్పీకర్ మధుసూధనాచారికి, చందూలాల్‌కు అవకాశం లభించినా ఈసారి ఈ ఇద్దరూ ఓడిపోవడంతో సీనియర్ శాసనసభ్యుడైన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం లభించవచ్చని సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి గతంలో ఇద్దరికి మంత్రులుగా అవకాశం లభించింది. అందులో ఒకరు ఓడిపోవడంతో ఈసారి వనపర్తి నుంచి గెలిచిన నిరంజన్‌రెడ్డికి మంత్రిపదవి ఖాయమని తెలుస్తోంది.

ఆ జిల్లా నుంచి మరొకరికి కూడా ఈసారే చోటు కల్పించాలని ముఖ్యమంత్రి భావించినట్లయితే మహబూబ్‌నగర్‌కు చెందిన ఎంఎల్‌ఏ శ్రీనివాసగౌడ్‌కు అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అదే సామాజికవర్గానికి చెందిన పద్మారావుగౌడ్‌కు గతంలోనే మంత్రిపదవి లభించినందున ఈసారి డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేయవచ్చని సమాచారం. రంగారెడ్డి జిల్లా నుంచి గతంలో పట్నం మహేందర్‌రెడ్డికి అవకాశం లభించినా ఈసారి ఆయన ఓడిపోవడంతో ప్రస్తుతానికి ఆ జిల్లా నుంచి అవకాశం ఇవ్వకుండా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆలోచించవచ్చన్న ఆలోచన ఉన్నట్లు తెలిసింది. ఇక హైదరాబాద్ నుంచి గతంలో ఇద్దరు మంత్రులుగా పనిచేసినందున అందులో ఒకరైన తలసాని శ్రీనివాసయాదవ్‌కు ఈసారి కూడా అవకాశం లభించవచ్చని సమాచారం. సామాజికవర్గ సమీకరణంలోంచి మాత్రమే కాక ఇతర కారణాలు కూడా ఇందుకు దోహదపడుతున్నట్లు తెలిసింది.

నల్లగొండ జిల్లాలో ఇద్దరికి అవకాశం ఉండవచ్చునని, ప్రస్తుతానికి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి చోటు కల్పించి పార్లమెంటు ఎన్నికల తర్వాత గుత్తా సుఖేందర్‌రెడ్డిని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా నుంచి గతంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఓడిపోవడంతో ప్రస్తుత విస్తరణలో ఆ జిల్లాలోని రాజకీయ పరిస్థితులను, గ్రూపుల తగాదాలను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా పార్లమెంటు ఎన్నికల అనంతరం ఆలోచించవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. ఈ జిల్లా నుంచి తెలుగుదేశం తరఫున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య పేరు వినిపిస్తున్నప్పటికీ ఈసారి విస్తరణలోనే అవకాశం లభిస్తుందా లేక పార్లమెంటు ఎన్నికల తర్వాత ఉండొచ్చా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Today Telangana cabinet expansion