Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

నేటి నుంచే ఉమ్మడి జిల్లాలో ‘ప్రత్యేక’ పాలన

Grama-panchayathi-image

కొలువుదీరనున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు
పండుగ వాతావరణంలో కొత్త పాలనకు స్వాగతం

మన తెలంగాణ/నల్లగొండ : స్వరాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యంతో పాటు పల్లెల సమగ్రాభివృద్ధ్ది కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. చిరకాలవాంఛను నెరవేరుస్తూ 500 జనాభా కల్గిన తండాలను, శివారు పల్లెలను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. గ్రామపంచాయతీల పదవీకాలం ముగియడం, కొత్త పంచాయతీల ఏర్పాటును చకచకా పూర్తిచేసిన ప్రభుత్వం గురువారం నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రత్యేకాధికారుల పాలనను ప్రారంభించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. పాతపంచాయతీలతో పాటు కొత్తపంచాయతీల్లో కూడా ప్రత్యేకాధికారుల పాలన కొత్తకొత్తగా కొంగొత్తగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధ్దం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఊహించినట్టుగానే గ్రామ సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేకాధికారులను నియామకం పూర్తైంది.

ఆగస్టు1వ తేదీతో పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పంచాయతీలన్నీ ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో నేటి నుంచి ప్రత్యేకాధికారులు పల్లెల పాలనపగ్గాలు చేతుల్లోకి తీసుకోనున్నారు. ఇందుకు సంబందించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే తగిన కసరత్తు పూర్తి చేసింది. పాతపంచాయతీల పరిస్థితి అటుంచితే కొత్తవాటి కోసం భవనాలు, ఫర్నీచర్, ఇతర కార్యాలయ సామాగ్రి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో కొత్త పంచాయతీల ప్రారంభం పండుగవాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో తదననుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జిల్లాల వారిగా ఇప్పటికే పాతపంచాయతీలు, కొత్తపంచాయతీలు కలిపి ప్రత్యేకాధికారుల నియామకం, మౌళిక వసతుల కల్పన వంటి ప్రక్రియలు ఈ పాటికే ఆయా జిల్లాల యంత్రాంగాలు పూర్తి చేశాయి. ఉమ్మడి జిల్లాలో 1713 పంచాయతీలుః నల్లగొండ ఉమ్మడి జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 1713 గ్రామపంచాయతీలు ఉండగా 15,146 వార్డులు ఉన్నాయి. కొత్తగా నల్లగొండ, సూర్యాపేట, యాదాధ్రి భువనగిరి జిల్లాల్లో 578 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. కాగా నల్లగొండ జిల్లాలో పాతవి 502, కొత్తవి 342 కలిపి 844కాగా 37 గ్రామపంచాతీలు కొత్త మున్సిపాలిటీల పరిధిలోని వెళ్ళాయి, దీంతో 7340వార్డులు ఏర్పాడ్డాయి.

ఇక సూర్యాపేట జిల్లాలో పాతవి 323, కొత్తవి 152 కలిపి మొత్తం 475 పంచాయతీలకు 4322 వార్డులు, యాదాధ్రి భువనగిరి జిల్లాలో 334 పాతవికాగా 84కొత్తవి మొత్తం 401పంచాయతీలు కాగా 17పంచాయతీలు కొత్త మున్సిపాలిటీల పరిధిలో విలీనం కావడం, 3484 వార్డులు కొత్తవి, పాతవి కలిపి ఏర్పడడం జరిగింది. కొలువుదీరనున్న ‘పుర’పాలన, నల్లగొండజిల్లాలో ఇప్పటికే నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీలు ఉండగా కొత్తగా మరో ఐదు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు నకిరేకల్, చిట్యాల, చండూరు, హాలియా, నాగార్జునసాగర్‌లు మున్సిపాలిటీలుగా రూపుదిద్ధుకోనున్నాయి. వీటికి గురువారం నుంచి తహశీల్దార్‌లను కమీషనర్‌లుగా నియమితులు కావడం, వారితో పాటు ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇదిలా ఉండగా మేజర్ గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలు ఏర్పడడంతో భారీగా నిధులు సమకూరి ఇంతకాలం పంచాయతీ వాతావరణంలో ఉన్న వాటన్నింటిలో సరికొత్త శోభ సంతరించుకోనుంది. ఇక సూర్యాపేట జిల్లాకు వచ్చేసరికి పాతవి 323, కొత్తవి 152 కలిపి మొత్తం 475 గ్రామపంచాయతీలు ఉండగా, అందులో 15గ్రామాలు సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పాటైన తిరుమలగిరి, నేరేడుచర్ల నగర పంచాయతీల పరిధిలోకి వెళ్ళాయి. అదే విధంగా మరో 7గ్రామాలు పులిచింతల ప్రాజెక్టుముంపునుకు గురికావడంతో వాటిని కూడా మినహాయిస్తే ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 475 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నూతనంగా ఏర్పాటైన పంచాయతీలకు, నగరపంచాయతీలకు ఆయా మండల తహసీల్దార్‌లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించనున్నారు. అదే విధంగా యాదాధ్రి భువనగిరి జిల్లాలో 334 గ్రామపంచాయతీలు కాగా కొత్తవి 84పంచాయతీలు మొత్తం 401కొలువుదీరి ఉన్నాయి. ఇందులో 17పంచాయతీలు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో విలీనం కానున్నాయి. జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీతో పాటు కొత్తగా మరో ఐదు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇదిలా ఉండగా యాదగిరిగుట్ట, ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు, చౌటుప్పల్ మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసినందున తదననుగుణంగా అధికార యంత్రాంగం ప్రత్యేకాధికారులతో పాలన ప్రారంబించేందుకు సమాయత్తమైంది.
యాదాధ్రిలో పెరగనున్న పట్టణీకరణః యాదాధ్రి భువనగిరి జిల్లాలోని 16మండలాల్లో భువనగిరి మాత్రమే మున్సిపాలిటీగా పట్టణ పరిధిని సంతరించుకుంది. ఇటీవల పరిణామాల నేపధ్యంలో భువనగిరిలో కొత్తగా మూడు పంచాయతీలు విలీనం కాగా, కొత్తగా ఏర్పడుతున్న మరో ఐదు మున్సిపాలిటీల పరిధిలోకి మరో 14పంచాయతీలు విలీనం కావడంతో ఈ జిల్లాలో పట్టణీకరణ పెరిగిపోయినట్లయ్యింది. దీంతో జిల్లావ్యాప్తంగా పట్టణ జనాభా సంఖ్య గణనీయంగా పెరిగింది. సర్వత్రా హర్షం, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజన తండాలు, శివారు పల్లెలు కొత్త గ్రామపంచాయతీలుగా రూపుదిద్దుకోవడంతో ఆయా వర్గాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. జిల్లాలో కొత్తగా ఏర్పడిన 578 గ్రామపంచాయతీలు సొంత పాలనలోకి రావడం, పరిపాలన సౌలభ్యం అందుబాటులోకి వస్తుండడంతో వారి ఆనందంలో అవదులు లేకుండా పోతోంది. ఆయా పంచాయతీల్లో కొత్త పాలన గురువారం ప్రారంభానికి అనువుగా భవనాలు, మౌలిక వసతులు, కార్యాలయం సంబందిత ఫర్నీచర్ సామాగ్రి తదితర హడావుడి నెలకొనడంతో గ్రామాల ప్రజలు ఏదో పండుగొచ్చిందన్న ఆనందం వారి మోములో కనబడుతోంది.

Comments

comments